అత్య‌థిక ఓటింగ్ RRR కు వ‌రంగా మార‌నుందా?

Update: 2023-01-20 02:30 GMT
గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారాల్లో RRR స‌త్తా చాటింది. 'నాటు నాటు' సాంగ్ కు గానూ బెస్ట్ ఒరిజిన‌ల్ మ్యూజిక్ విభాగంలో అవార్డుని ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో యావ‌త్ ఇండియ‌న్ సెల‌బ్రిటీలు, ప్రేక్ష‌కులు సైతం RRR ఆస్కార్ అవార్డు ని ద‌క్కించుకునే క్ష‌ణాల కోసం ఆస‌క్త‌గా ఎదురు చూస్తున్నారు. మ‌న దేశం నుంచి ఆస్కార్ కు RRRతో పాటు మొత్తం ప‌ది సినిమాలు పోటీప‌డుతున్నాయి. ఇదిలా వుంటే ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే ఆస్కార్ అవార్డుల కీల‌క ఓటింగ్ ప్ర‌క్రియ ముగిసింది.

దాదాపు 89 దేశాల‌కు చెందిన అకాడ‌మీ స‌భ్యులు ఈ ఓటింగ్ లో పాల్గొని త‌మ‌కు న‌చ్చిన సినిమాల‌కు, న‌టీన‌టుల‌కు ఓటు వేశారు. అయితే మిగ‌తా ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఓటింగ్ కు అత్య‌ధిక ప్రాధాన్య‌త వున్న‌ట్టుగా తెలుస్తోంది. కార‌ణం ఈ ఏడాది ఎక్కువ మంది స‌భ్యులు ఓటీంగ్ లో పాల్గొన్నార‌ని తెలుస్తోంది. 95 ఏళ్ల ఆస్కార్ చ‌రిత్ర‌లో ఈ స్థాయిలో ఓటింగ్ జ‌ర‌గ‌డం ఇదే తొలిసార‌ని చెబుతున్నారు. ఈ విష‌యాన్ని అకాడ‌మీ సీఆర్ ఓ బిల్ క్రామెర్ వెల్ల‌డిస్తూ త‌న ఆనందాన్ని వ్యక్తం చేయ‌డం విశేషం.

ఈ విష‌యాన్ని అకాడ‌మీ ఆఫ్ మోష‌న్ పిక్చ‌ర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ స‌భ్యులంద‌రికి సందేశాలు పంపించార‌ట‌. ఇదిలా వుంటే మునుపెన్న‌డూ లేనంత‌గా ఆస్కార్ అకాడ‌మీ అవార్డుల్లో నామినేష‌న్స్ కోసం మొత్తం ప‌ది సినిమాలు పోటీప‌డుతున్నాయి.RRR, ద క‌శ్మీర్ ఫైల్స్‌, కాంతార‌, గంగూభాయి క‌తియా వాడీ, విక్రాంత్ రోణ‌, 'మి వ‌సంత‌రావ్‌, తుజ్యా సాథీ క‌హీహై', రాకెట్రీ, ఇర‌విన్ నిళ‌ళ్ వంటి సినిమాలు పోటీప‌డుతున్నాయి.

ఈ సినిమాల‌తో పాటు ప్ర‌పంచ న‌లుమూల‌ల నుంచి వ‌చ్చిన మొత్తం 301 సినిమాల‌కు జ‌న‌వ‌రి 11 నుంచి 17 వ‌ర‌కు ఓటింగ్ నిర్వ‌హించారు. ఇండియా నుంచి ఆస్కార్ విన్న‌ర్ ఏ.ఆర్‌. రెహ‌మాన్ కూడా ఈ ఓటింగ్ లో పాల్గొన‌డం విశేషం.

ఇక ఈ నెల 24న ఆస్కార్ కు నామినేట్ అయిన ఫైన‌ల్ మూవీస్ ని ప్ర‌క‌టిస్తారు. మార్చి 12న ఆస్కార్ అవార్డులు వేడుక జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే మ‌న ఇండియా త‌రుపున విదేశీ చిత్రాల విభాగంలో 'లాస్ట్ ఫిల్మ్ షో' నామినేట్ కావడం తెలిసిందే.

ఇదిలా వుంటే గ‌తంతో పోలిస్తే 95వ ఆస్కార్ అడ‌కాడ‌మీ అవార్డుల చ‌రిత్ర‌లో రికార్డు స్థాయి ఓటీంగ్ జ‌ర‌గ‌డంతో అది RRR కు వ‌రంగా మారే అవ‌కాశం వుంద‌నే విశ్లేష‌ణ‌లు మొద‌ల‌య్యాయి. గోల్డెన్ గ్లోబ్ విష‌యంలో జ‌రిగిన‌ట్టే ఆస్కార్ విష‌యంలో రిపీట్ వుతుంద‌ని, RRR ఖ‌చ్చితంగా ఆస్కార్ అవార్డుని ద‌క్కించుకుని చ‌రిత్ర సృష్టిస్తుంద‌నే చ‌ర్చ ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు అభిమానుల్లోనూ జోరుగా సాగుతోంది. మ‌రి RRR చ‌రిత్ర సృష్టించి ఇండియ‌న్ సినిమా కీర్తి బావుటాని అంత‌ర్జాతీయ వేదిక‌పై రెప రెప లాడిస్తుందా? అన్న‌ది వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News