విశ్వక్ స్థానంలోకి శర్వా వస్తాడా..?

Update: 2022-11-10 00:30 GMT
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా మరియు యువ హీరో విశ్వక్ సేన్ మధ్య వివాదం గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నడుస్తోంది. అర్జున్ దర్శక నిర్మాణంలో విశ్వక్ హీరోగా తపెట్టిన ఓ సినిమా విషయంలో.. దర్శక హీరోల మధ్య అభిప్రాయాలు భేదాలు రావడంతో ఈ వివాదం చెలరేగింది.

అర్జున్ తన దర్శకత్వంలో కూతురు ఐశ్వర్య అర్జున్ ను హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం చేస్తూ.. విశ్వక్ సేన్ హీరోగా ఓ మూవీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఇటీవల హైదరాబాద్ లో ఈ ప్రాజెక్ట్ ని గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసారు. హీరో లేని కొన్ని సన్నివేశాలను ఇప్పటికే చిత్రీకరించారు.

అయితే ఈ సినిమాని విశ్వక్ సేన్ తో తీయలేనని డైరెక్టర్ అర్జున్ ఇటీవల మీడియా ముఖంగా ప్రకటించారు. విశ్వక్ షూటింగ్ కు రాకుండా ఇబ్బంది పెట్టాడని.. అతని కారణంగా సినిమా షెడ్యూల్స్ ని వాయిదా వేసుకున్నామని చెప్పారు. విశ్వక్ అన్ ప్రొఫెషనల్ యాక్టర్ అని.. తనని తన టీమ్ ని అవమానించాడని అర్జున్ ఆరోపించారు.

100 కోట్లు ఇచ్చినా విశ్వక్ తో తాను సినిమా తీసే ప్రసక్తి లేదని అర్జున్ చెప్పారు. నేను ఇక్కడకు సినిమాలు మాత్రమే చేయడానికి వచ్చా.. వివాదాలు సృష్టించడానికి కాదు.. ఎవరి వలనా ఏదీ ఆగదు. త్వరలోనే ఈ సినిమా మరొక హీరోతో చేస్తా.. టైటిల్ కూడా అనౌన్స్ చేస్తానని సీనియర్ హీరో తెలిపారు.

దీనిపై విశ్వక్ సేన్ కూడా స్పందించాడు. తన అభిప్రాయాలకు ఎలాంటి ప్రాధాన్యత లేదని.. అందుకే కొన్ని అంశాలపై చర్చించడానికి షూటింగ్ ఆపమని అడిగానంటూ వివరణ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వివాదంపై సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. పలువురు సినీ పెద్దలు ఈ విషయం మీద తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే అర్జున్ ఇప్పుడు తన సినిమా కోసం మరో హీరోని వెతికే పనిలో ఉన్నారని తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ సినిమాను పట్టాలెక్కించడానికి ప్రయత్నిస్తున్నాట. ఇందులో భాగంగా తన చిత్రంలో కథానాయికుడిగా శర్వానంద్ అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నాడట.

శర్వా తన కథకి సరిపోతాడని భావించిన అర్జున్.. ఇప్పుడు యంగ్ హీరోతో సంప్రదింపులు జరుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. విశ్వక్ సేన్ ని తప్పించిన తర్వాత.. అతని స్థానంలోకి శర్వా వస్తాడా లేదా అనేది వేచి చూడాలి.

నిజానికి అర్జున్ తన డాటర్ తెలుగు డెబ్యూ మూవీ కోసం పేరున్న నటీనటులు టెక్నిషియన్స్ ని తీసుకున్నారు. సాయి మాధవ్ బుర్రా ని డైలాగ్ రైటర్ గా.. అనూప్ రూబెన్స్ ని సంగీత దర్శకుడిగా.. పాటల కోసం చంద్రబోస్ ను తీసుకున్నారు. మరో హీరో సెట్ అయితే అర్జున్ అదే టీమ్ ని కొనసాగిస్తారేమో చూడాలి.

ఇక శర్వానంద్ విషయానికొస్తే.. అర డజను ప్లాప్స్ తర్వాత ఇటీవల 'ఒకే ఒక జీవితం' సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇదే జోష్ లో కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ మూవీ అనౌన్స్ చేసాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News