సానుభూతి పవనాలు సమంత సినిమాకు ప్లస్ అవుతాయా..?

Update: 2022-11-11 07:04 GMT
'ఏమాయ చేసావే' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత రూత్ ప్రభు.. తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకుంది. క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోయింది. అదే సమయంలో సోషల్ మీడియాలో కాస్త నెగెటివిటీని కూడా కూడగట్టుకుంది. ముఖ్యంగా తన మాజీ భర్త అక్కినేని నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సామ్.. హేటర్స్ నుంచి పెద్ద ఎత్తున ట్రోలింగ్ ఎదుర్కొంది.

సమంత ను లక్ష్యంగా చేసుకొని ఓ వర్గం నిరంతరం అసభ్యకరమైన పోస్టులు అభ్యంతరకరమైన మీమ్స్ తో దాడి చేసారు. ఆమె సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా.. నెగెటివ్ కామెంట్స్ చేయడానికి ఈ బ్యాచ్ ఎప్పుడూ రెడీగా ఉండేవారు. అయితే ఇటీవల సామ్ అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు వెల్లడించడంతో ట్రోలర్స్ అందరూ ఒక్క్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఆమెపై సానుభూతి కలగడమే దీనికి కారణమని అర్థమవుతోంది.

సమంత ప్రధాన పాత్రలో నటించిన ఫిమేల్ ఓరియెంటెడ్ థ్రిల్లర్ "యశోద" ఈరోజు శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. సాధారణంగా తమకు నచ్చని హీరో లేదా హీరోయిన్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు.. నెగెటివ్ కామెంట్స్ చేయడానికి.. నెట్టింట ట్రోల్ చేయడానికి కొందరు రెడీగా ఉంటారు. కానీ ఇప్పుడు సామ్ సినిమా విషయంలో అది కనిపించలేదు. జెన్యూన్ గా టాక్ ఎలా ఉందో చెప్తున్నారు కానీ.. పనిగట్టుకొని ప్రతికూల కామెంట్స్ చేయడం లేదు.

సమంత తాను మైయోసైటిస్‌ అనే ఆటో ఇమ్యునో వ్యాధితో బాధపడుతున్నట్లు ఇటీవల సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ క్రమంలో 'యశోద' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రికార్డ్ చేసిన ఇంటర్వ్యూలో తాను ఎలాంటి ఇబ్బందులు పడుతోందనే విషయాలను చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. ఇది అందరిలో ఆమె పట్ల సానుభూతి కలిగేలా చేసింది. వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు.

నిజంగానే సానుభూతి చూపిస్తున్నారా? లేదా ఇలాంటి పరిస్థితుల్లో ట్రోల్ చేస్తే చెడ్డ పేరు వస్తుందని వెనక్కి తగ్గారో తెలియదు కానీ.. ఈరోజు మాత్రం సమంత మరియు ఆమె సినిమాపై సోషల్ మీడియాలో కావాలని నెగెటివ్ ప్రచారం చేయలేదు. అయితే సామ్ పై ఉన్న సానుభూతి పవనాలు 'యశోద' చిత్రానికి అనుకూలంగా మారాయా లేదా అనేది.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఫిగర్స్ బయటకు వస్తే కానీ తెలియదు.

ఇప్పటికైతే సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. సమంత ఈ సినిమాలో యాక్షన్ మరియు ఎమోషన్ తో ఆకట్టుకుందని తెలుస్తోంది. స్టోరీ లైన్ ఇంట్రెస్టింగ్ గా ఉందని.. ఇంటర్వెల్ కు ముందు సీక్వెన్స్ బాగుందని అంటున్నారు. కొన్ని ట్విస్టులు బాగున్నప్పటికీ.. కథనం థ్రిల్ కు గురి చేసేలా ప్రభావవంతగా లేదని చెబుతున్నారు. అంచనాలు లేకుండా వెళ్తే ఇది సంతృప్తినిచ్చే ఎమోషనల్ థ్రిల్లర్ గా అనిపిస్తుందని పేర్కొంటున్నారు.

కాగా, 'యశోద' చిత్రానికి హరి & హరీష్ దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో సమంత తో పాటుగా వరలక్ష్మీ శరత్ కుమార్ - ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News