వ‌ర్మ‌కు ఏ శిక్ష క‌రెక్టో చెప్పిన మ‌ణి

Update: 2018-02-18 05:18 GMT
ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడ‌తా. నాకు అనిపించింది చెబుతా. నేను నాలానే ఉంటా. ఇవేమీ త‌ప్పు కాదు. కానీ.. నేను అన్న దాన్లోకి మ‌రొక‌రిని తీసుకొస్తేనే తిప్ప‌లు. ఆ విష‌యం వివాదాల‌తో స‌హ‌వాసం చేసే ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌కు ఇప్పుడిప్పుడే అర్థ‌మ‌వుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది.

కావాల్సినంత పేరు ప్ర‌ఖ్యాతులున్న‌ప్ప‌టికీ మ‌రింత సంచ‌ల‌నం కావాల‌ని కోరుకున్నారో ఏమో కానీ.. జీఎస్టీ మూవీతో పెను సంచ‌ల‌నాన్ని.. వివాదాన్ని ర‌గ‌ల్చారు. జీఎస్టీ మూవీపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన మ‌హిళ‌ల‌పై వ‌ర్మ చేసిన వ్యాఖ్య‌లపై కొంద‌రు తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  వ‌ర్మ చేసిన వ్యాఖ్య‌ల‌తో ఇప్పుడాయ‌న పోలీస్ కేసు ఎదుర్కొంటున్నారు.

సామాజిక కార్య‌క‌ర్త దేవిని ఉద్దేశించి వ‌ర్మ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆమె ఫిర్యాదు చేయ‌టం.. వ‌ర్మను విచారించ‌టం లాంటివి జ‌రిగాయి. ఇదో ఎపిసోడ్ అయితే.. జీఎస్టీ మూవీపై ఆ మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌లో ఐద్వాకు చెందిన మ‌ణి అనే మ‌హిళ‌ను ఉద్దేశించి వ‌ర్మ దారుణ వ్యాఖ్య‌లు చేశార‌న్న ఆరోప‌ణ ఉంది. మ‌ణిని ఉద్దేశించి వ‌ర్మ చేసిన వ్యాఖ్య‌ను చూస్తే.. జీఎస్టీ సినిమాను త‌ప్పు ప‌ట్టిన ఆమె మాట‌ల‌కు స్పందించిన వ‌ర్మ‌.. "ఈసారి మిమ్మల్ని పెట్టి తీస్తా. జీఎస్టీ పార్ట్‌2 ఆవిడతో తీస్తా. మియా మాల్కోవా కన్నా ఆవిడ ముఖం అందంగా ఉంది’ అని బదులిచ్చిన వైనంపై ప‌లువురు త‌ప్పు ప‌ట్టారు.

ఈ వివాదంపై ఒక ఛాన‌ల్ లో వ‌ర్మ‌తో  ముఖాముఖి ఏర్పాటు చేశారు. వ‌ర్మ వ్యాఖ్య‌ల‌కు బాధితురాలిగా మారిన మ‌ణితో ఫోన్లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆమెను ఉద్దేశించి వ‌ర్మ మాట్లాడుతూ.. తాను స‌ర‌దా ధోర‌ణిలో వ్యాఖ్య‌లు చేశాన‌ని.. దానికి మ‌ణి ఏమైనా ఫీల్ అయి ఉంటే సారీ చెబుతున్నాన‌న్నారు. త‌న వ్యాఖ్య‌ల కార‌ణంగా ఆమె కానీ.. ఆమె కుటుంబ స‌భ్యులు కానీ ఇబ్బందికి గురై ఉంటే.. క్ష‌మించాల‌న్నారు.

వ‌ర్మ.. తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు ఇబ్బంది ప‌డుతూ సారీ చెప్పారు క‌దా.. మీరు సంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారా? అంటూ స‌ద‌రు ఛాన‌ల్ ప్ర‌తినిధి అడ‌గ్గా.. ఆమె నో చెప్పారు. తాను సంతృప్తి చెంద‌టం లేద‌ని.. ఆ మాట‌కు వ‌స్తే వ‌ర్మ‌తో మాట్లాడ‌టం కూడా తాను ఇష్ట‌ప‌డ‌టం లేద‌న్నారు. మ‌హిళ‌లంటే అంత చుల‌క‌న‌గా ఎలా మాట్లాడ‌తార‌ని ప్ర‌శ్నించిన ఆమె.. వ‌ర్మ వ్యాఖ్య‌ల త‌ర్వాత తాను ఎలాంటి ఇబ్బందికి గుర‌య్యానో ఆయ‌న‌కు తెలుసా? అని ప్ర‌శ్నించారు.

సారీ చెప్పారు క‌దా? మ‌రి.. ఎలాంటి శిక్ష కోరుకుంటున్నారంటూ ఛాన‌ల్ ప్ర‌తినిధి అడిగిన ప్ర‌శ్న‌కు స్పందించిన మ‌ణి.. సెల‌బ్రిటీ అన్న వాళ్లు బాధ్య‌త‌గా ఉండాల‌ని.. వ‌ర్మ మాత్రం అలా ఉండ‌లేద‌న్నారు. సెల‌బ్రిటీల‌ను అనుక‌రించే వాళ్లు చాలామంది ఉంటార‌ని.. తామేం మాట్లాడినా న‌డిచిపోతుంద‌న్న‌ట్లుగా వ‌ర్మ తీరు ఉంద‌ని.. ఇది త‌ప్ప‌న్నారు. ఒక మ‌హిళ ప‌ట్ల ఒక పోలీస్ అధికారి అనుచితంగా వ్య‌వ‌హ‌రిస్తే ఆయ‌న‌కు శిక్ష విధించార‌ని.. అదే తీరులో మ‌హిళ‌ల్ని త‌ప్పుగా చూసినా నిర్బ‌య చ‌ట్టం కింద కేసు న‌మోదు చేయొచ్చ‌న్నారు.

వ‌ర్మ‌పై కూడా చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. మ‌హిళ‌ల్ని చుల‌క‌న చేసేలా మాట్లాడిన వారిని ఎట్టి ప‌రిస్థితుల్లో వ‌ద‌లొద్ద‌న్నారు. సూటిగా చెప్ప‌కున్నా.. త‌న‌ను అవ‌మానించేలా మాట్లాడిన వ‌ర్మ‌ను నిర్భ‌య చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసి శిక్షించాల‌న్న అభిప్రాయాన్ని ఆమె వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికే దేవి ఫిర్యాదుతో ఇబ్బంది ప‌డుతున్న వ‌ర్మ‌.. మ‌ణి ఇష్యూ సైతం చ‌ట్ట‌ప్రకారం చ‌ర్య‌ల‌కు ఆశ్ర‌యిస్తే మ‌రిన్ని ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News