అగ్ర బ్యాన‌ర్ ని 1000 కోట్ల క్ల‌బ్ లో చేరుస్తాడా?

Update: 2022-08-01 04:07 GMT
వందేళ్ల భార‌తీయ సినిమా రంగంలో 50 సంవత్స‌రాలు ఎదురేలేని బ్యాన‌ర్ గా కొన‌సాగింది య‌ష్ రాజ్ ఫిలింస్. ఈ సంస్థ నుంచి ఒక సినిమా వ‌స్తోంది అంటే దానిపై భారీ అంచనాలుంటాయి. ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్లు ఇండ‌స్ట్రీ రికార్డ్ హిట్లు సొంతం చేసుకున్న ఈ బ్యాన‌ర్ నుంచి క్లాసిక్ అన‌ద‌గ్గ సినిమాలొచ్చాయి. వంద‌లాది మంది న‌టీన‌టులు సాంకేతిక నిపుణుల‌ను ప‌రిశ్ర‌మ‌కు అందించిన చ‌రిత్ర య‌ష్ రాజ్ బ్యాన‌ర్ కి ఉంది. గొప్ప ద‌ర్శ‌కుల‌ను కూడా ఈ సంస్థ ప‌రిచ‌యం చేసింది.

అయితే అలాంటి సంస్థ గ‌డిచిన ఐదేళ్లుగా త‌న ప్ర‌భును కోల్పోవ‌డం హాట్ టాపిక్ గా మారింది. ప‌రిశ్ర‌మ అగ్ర హీరోల‌తో అత్యంత భారీ బ‌డ్జెట్ల‌తో సినిమాలు తీస్తున్నా అవ‌న్నీ ఫ్లాపులుగా మిగులుతున్నాయి. సౌతిండియా బాలీవుడ్ ని డామినేట్ చేస్తున్న క్ర‌మంలో దిగ్గ‌జ‌ య‌ష్ రాజ్ బ్యాన‌ర్ తీవ్ర సందిగ్ధ‌త‌లో ప‌డింది. 1000 కోట్ల క్ల‌బ్ మూవీతో స‌త్తా చాటాల‌ని అత్యంత భారీ బ‌డ్జెట్ల‌తో అసాధార‌ణ స్టార్ల‌తో సినిమాలు తీసిన ఈ బ్యాన‌ర్ కి అది అంద‌ని ద్రాక్షే అయ్యింది. యాభై ఏళ్ల చ‌రిత్ర‌లో ఇప్పుడు కీల‌క ద‌శ‌లో స‌ద‌రు సంస్థ వ‌రుస ఫెయిల్యూర్స్ తో భారీ న‌ష్టాల‌ను చ‌వి చూస్తోంది. ఇటీవ‌ల వ‌రుస‌గా నాలుగు పెద్ద సినిమాలు ఈ సంస్థ నుంచి రిలీజై ఫ్లాపులుగా నిలిచాయి.

అయితే ఇలాంటి స‌మ‌యంలో య‌ష్ రాజ్ బ్యాన‌ర్ ని ఆదుకునేందుకు ఒకే ఒక్క‌డు క‌నిపిస్తున్నాడు. అత‌డే సిద్ధార్థ్ ఆనంద్. ప్ర‌స్తుతం ఈ బ్యాన‌ర్ లో అత‌డు ప‌ఠాన్ అనే భారీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రంతో ప్రేక్షకులకు ఎన్న‌టికీ మ‌ర‌పురాని అద్భుతమైన అనుభూతిని అందించాలనుకుంటున్నాను అని అత‌డు ప్ర‌క‌టించ‌డం వేడి పెంచింది. వార్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందించిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కింగ్ ఖాన్ షారుఖ్ తో సినిమా ప్రకటించినప్పటి నుండి అభిమానుల ఆనందానికి అవ‌ధుల్లేవ్. కొన్ని వ‌రుస ఫ్లాపుల‌తో కిందికి ప‌డిపోయిన ఖాన్ ని తిరిగి నిల‌బెడ‌తాడ‌నే అంతా ఆశిస్తున్నారు. పఠాన్ ఇప్పుడు అత‌డికి ఏకైక హోప్. ఖాన్ తో పాటు య‌ష్ రాజ్ బ్యాన‌ర్ కి అత‌డే బిగ్ హోప్. ప‌ఠాన్ లాంటి ఇంట్రెస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ గూఢచారి నేప‌థ్య‌ చిత్రంలో షారుఖ్ ఖాన్ సరసన దీపికా పదుకొణెలాంటి అగ్ర నాయిక‌ నటిస్తోంది.

ఈ రోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్న దర్శకుడు సిద్ధార్థ్ ఒక ఇంటర్వ్యూలో `ప‌ఠాన్`  గురించి చాలా విష‌యాల‌ను షేర్ చేసాడు. మరే సినిమాలోనూ లేని అనుభూతిని ప్రేక్షకులకు అందించాలని తాను కోరుకుంటున్నానని ఇది తన ప్రత్యేక పుట్టినరోజుగా భావిస్తున్నానని అత‌డు పేర్కొన్నాడు. ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్ కి వచ్చిన సానుకూల స్పందన పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానని ఆయన తెలిపారు. యశ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్ అబ్రహం కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. 25 జనవరి 2023న ఈ చిత్రం హిందీ- తెలుగు- తమిళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.

నిజానికి ఈ స్థితి ఊహించ‌నిది!

గ‌త ద‌శాబ్ధ కాలంలో య‌ష్ రాజ్ బ్యాన‌ర్ స‌న్నివేశం ఏమంత బాలేద‌నే చెప్పాలి. ఇటీవ‌ల వరుసగా ఫ్లాపులతో YRF బ్యానర్ రేంజ్ ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి  ప‌డిపోవ‌డం ఇండస్ట్రీలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. రీసెంట్ గానే విడుద‌లైన ర‌ణ‌బీర్ శంషేరాపై స‌ద‌రు బ్యాన‌ర్ చాలా హోప్స్ పెట్టుకున్నా కానీ ఆశించిన ఫ‌లితం ద‌క్కలేదు. ఈ మూవీ రాంగ్ కాస్టింగ్ అన్న విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. చాక్లెట్ బోయ్ లాంటి ర‌ణ‌బీర్ ని మాస్ యాక్ష‌న్ హీరోగా చూపించ‌డం ఒక త‌ప్పిదం అని విమ‌ర్శించిన వారు లేక‌పోలేదు. ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 5250 స్క్రీన్లలో తొలి వారం ముగిసేసరికి రూ.40 కోట్ల కలెక్షన్లను కూడా అధిగమించలేక శంషారా చ‌తికిలప‌డిపోయింది.

ఈ మూవీ ఆడుతుండ‌గానే జాన్ అబ్రహం-అర్జున్ కపూర్ నటించిన `ఏక్ విలన్ రిటర్న్స్` సినిమా మొదటి వారాంతంలో రూ. 24 కోట్లతో త‌న ర‌న్ ని 40 కోట్ల లోపు ముగించేస్తుంద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. ఇంత‌లోనే కన్నడ నటుడు కిచ్చా సుదీప్ న‌టించిన పాన్ ఇండియా 3D చిత్రం `విక్రాంత్ రోనా` తొలి వీకెండ్ లోనే రూ. 37-38 కోట్లు వసూలు చేసి స‌త్తా చాటింది. ఆ రెండు బాలీవుడ్ సినిమాల‌కు ఇది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. ఆర్.ఆర్.ఆర్- కేజీఎఫ్‌- పుష్ప త‌ర్వాత మ‌రోసారి సౌత్ డామినేష‌న్ స్ప‌ష్టంగా క‌నిపించింది.

అత్యంత విజయవంతమైన హిట్ ఫిలిం మేకర్ లలో ఒకరైన యష్ చోప్రా బ్రాండ్ ర‌ణ‌బీర్ లాంటి హీరోకి కూడా విజ‌యాన్ని ఇవ్వ‌లేక‌పోతోంది. దివంగత నిర్మాత-దర్శకుడి కుమారుడు ఆదిత్య చోప్రా నిర్మాత‌గా సిద్ధాంత్ చతుర్వేది తెర‌కెక్కించిన `బంటీ ఔర్ బాబ్లీ 2` 2021 నవంబర్ 19న‌ విడుదలై ఫ్లాపైంది. బడ్జెట్‌లో పావు వంతు కంటే కొంచెం ఎక్కువ వ‌సూళ్లు అంటే రూ.45 కోట్ల‌తో ఈ మూవీ స‌రిపెట్టుకుంది. ఈ ఏడాది మే 13న విడుదలైన రణ్ వీర్‌ సింగ్ `జయేష్ భాయ్‌ జోర్దార్‌` 90కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కి కేవలం రూ. 16.6 కోట్లు రాబట్టగలిగింది. క్రికెట్ ప్రపంచ కప్ 1983 డ్రామాతో తెర‌కెక్కిన `83` త‌ర్వాత జ‌యేష్ భాయ్  మ‌రో పెద్ద ఫ్లాప్ గా నిలిచింది.  అక్ష‌య్ కుమార్ హీరోగా య‌ష్ రాజ్ ఫిలింస్ తెర‌కెక్కించిన సామ్రాట్ పృథ్వీరాజ్ ఫేట్ గురించి తెలిసిందే.  చంద్రప్రకాష్ ద్వివేది 18 సంవత్సరాలుగా శ్ర‌మించి తయారు చేసిన స్క్రిప్టుతో ఇది తెర‌కెక్కింది. కానీ ఘోర‌ప‌రాజ‌యం పాలైంది. సామ్రాట్ పృథ్వీరాజ్  మూడు రాష్ట్రాల్లో పన్ను రహిత చిత్రంగా విడుద‌లై రూ.68 కోట్లు మాత్ర‌మే వసూలు చేసింది. రూ.150 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కి భారీ బిజినెస్ చేసిన ఈ చిత్రం ఊహించ‌ని ప‌రాజ‌యం పాలైంది. య‌ష్ రజ్ బ్యాన‌ర్ కి ఇది బిగ్ షాక్.

ఓవైపు టాలీవుడ్ సినిమాలు ఆర్.ఆర్.ఆర్- పుష్ప గ్రాండ్ గా ఉత్త‌రాదిన విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాలు సాధిస్తే య‌ష్ రాజ్ సంస్థ ప‌రాజ‌యాల ఫ‌ర్వం అవిరామంగా కొన‌సాగింది. అదే స‌మ‌యంలో క‌శ్మీర్ ఫైల్స్ లాంటి క‌ల్ట్ సినిమా య‌ష్ రాజ్ బ్యానర్ సినిమాల కంటే అత్యుత్త‌మ ఫ‌లితం అందుకుంది.

YRF బ్యాన‌ర్ ఇప్ప‌టికి ఫ్లాపుల‌కు అల‌వాటు ప‌డుతోంది. లమ్హే (1991)తో ప్రారంభమైన బ్యాన‌ర్ ఆ త‌ర్వాత వ‌రుస‌గా 65 విడుదలల్లో 11 దిగ్గజ చిత్రాలతో సహా ప‌దుల సంఖ్య‌లో బ్లాక్ బస్టర్ లు అందించింది. స‌ద‌రు సంస్థ ఇప్పుడిలా కిందికి ప‌డిపోతుంద‌న్న‌ది ఎవ‌రూ ఊహించ‌లేదు. యష్ రాజ్ వార‌సుడు ఆదిత్య చోప్రా నిర్మాత‌గా దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే -ధూమ్ 3 భారీ బ్లాక్ బ‌స్ట‌ర్స్ కాకుండా వ‌రుస‌గా 13 హిట్ లు లేదా సూపర్ హిట్ లు .. ఏడు సెమీ-హిట్ లు నిర్మించడం ఈ బ్యాన‌ర్ లో ఒక చ‌రిత్ర‌. కానీ ఇప్పుడు ఫేట్ మారింది. ఇప్పటికి 31 బ్లాక్ బస్టర్ లతో సెమీ హిట్ లతో పోలిస్తే YRF 34 ఫ్లాప్ లు (డిజాస్టర్) లను కూడా అందించింది. ఈ సంఖ్య‌లు ఎలా ఉన్నా కానీ య‌ష్ రాజ్ సంస్థ కీర్తి దిగ‌జారుతోంద‌ని ఇప్పుడు ముచ్చ‌ట సాగుతోంది. గ‌డిచిన ద‌శాబ్ధంలో 29 చిత్రాలలో 14 డిజాస్టర్ లు లేదా ఫ్లాప్ లు లేదా బిలో యావరేజ్ జోన్ ల‌లో ఉన్నాయి. ఈ సీజ‌న్ లో YRF ఐదు బ్లాక్ బస్టర్ లను కూడా అందించింది. వార్- టైగ‌ర్ జిందా హై- సుల్తాన్- ధూమ్ 3- ఏక్తా టైగ‌ర్ లాంటి చిత్రాలు సంచ‌ల‌న విజ‌యాలు సాధించాయి. అయితే వార్ త‌ర్వాత హిట్లు ద‌క్క‌లేదు. 1993- 2000 మధ్య గోల్డెన్ డేస్  ఈ బ్యాన‌ర్ కి తిరిగి వ‌చ్చేదెపుడు? అన్న‌ది కూడా సందేహ‌మేన‌ని విశ్లేషిస్తున్నారు.

ఇప్పుడు ఆశ‌ల‌న్నీ కింగ్ ఖాన్ షారూక్ పైనే. ఇదే బ్యాన‌ర్ లో `డర్`-`డిడిఎల్ జె` చిత్రాలతో యష్ చోప్రా బ్యాన‌ర్ కి ఎదురేలేని స‌క్సెస్ ని ఇచ్చిన‌ SRK ఇక‌పై ప‌ఠాన్ తో ఆదుకోవాల్సి ఉంది. 2023 జ‌న‌వ‌రిలో ఈ చిత్రం విడుద‌లై య‌ష్ రాజ్ బ్యాన‌ర్ ఫేట్ మారుస్తుంద‌నే భావిద్దాం. ముఖ్యంగా బాహుబ‌లి- ఆర్.ఆర్.ఆర్- కేజీఎఫ్ త‌ర‌హాలో 1000 కోట్ల క్ల‌బ్ ని ఈ బ్యాన‌ర్ అందుకుంటుందేమో చూడాలి. సిద్ధార్థ్ ఆనంద్ ఫేట్ మారుస్తాడ‌నే భావించాలి.
Tags:    

Similar News