యూట్యూబ్ వ్యూస్ - లైక్స్ మ్యానియాలో స్టార్ హీరోలు..!

Update: 2022-02-14 13:30 GMT
చిన్న సినిమా అయినా కోట్లు ఖర్చు చేసి తీసిన పెద్ద సినిమా అయినా.. జనాల్లోకి వెళ్ళడానికి ప్రమోషన్స్ చేయాల్సిందే. ఒకప్పుడు సినిమా వాళ్ళు పేపర్ యాడ్స్ - ఆఫ్ లైన్ పబ్లిసిటీతో సరిపెట్టేవారు. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ అందరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా ప్రచారం అనేది కీలకంగా మారింది. ప్రమోషనల కంటెంట్ కు ఎంత ఎక్కువ రీచ్ వస్తే.. సినిమాకు అంత క్రేజ్ వచ్చినట్లుగా మేకర్స్ భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రికార్డులతో పాటు ఇప్పుడు సోషల్ మీడియా రికార్డులు కూడా హీరోల స్టామినాని నిర్ధారించే కొలమానంగా మారిపోయాయి. మరీ ముఖ్యంగా యూట్యూబ్ లో వదిలే కంటెంట్ కు వచ్చే రెస్పాన్స్ ని బట్టి సినిమా రిజల్ట్ ని అంచనా వేసుకుంటున్నారు. మిలియన్ల వ్యూస్.. లక్షల కొలదీ లైక్స్ వస్తే సినిమా సక్సెస్ అయిపోయినట్లే అనే భ్రమలో ఉంటున్నారు.

స్టార్ హీరోల యూట్యూబ్ రికార్డుల మేనియాలో మిగతా ఇండస్ట్రీల కంటే టాలీవుడ్ - కోలీవుడ్ కాస్త ముందుంటాయి. ముఖ్యంగా తెలుగు తమిళ స్టార్ హీరోలు తమ సత్తా ఏంటో ప్రమోషనల్ కంటెంట్ తో వచ్చే రెస్పాన్స్ తోనే చాటిచెప్పాలన్నట్లు వ్యవహరిస్తుంటారు. తమ ట్రైలర్ కి ఒక రోజులో ఇన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయని.. లిరికల్ సాంగ్ ఫాస్టెస్ట్ లైక్స్ రికార్డ్ తమ పేరిటే నమోదయ్యిందని.. అదని ఇదని పోస్టర్స్ రిలీజ్ చేస్తూ హంగామా చేస్తుంటారు.

సినిమా వసూళ్ల పోస్టర్ మాదిరిగానే సోషల్ మీడియా రికార్డుల పోస్టర్స్ రిలీజ్ చేయడమేనేది ఇప్పుడు మ్యాండేటరీ అయిపోయింది. వీటి వల్ల సినిమా జనాలకు ఏమాత్రం రీచ్ అవుతుందో కానీ.. హీరోల ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్స్ జరగడానికి కారణం అవుతోంది. వాస్తవానికి వ్యూస్ - లైక్స్ విషయంలో 'పెయిడ్' స్ట్రాటజీ ఫాలో అవుతారనే టాక్ ఉంది. ముఖ్యంగా స్టార్ హీరోల కంటెంట్ విషయంలో జరుగుతుందని అంటుంటారు.

అందుకే సదరు హీరోలు నటించిన సినిమాల్లో ఏదైనా ప్రమోషనల్ కంటెంట్ విడుదలవుతున్నప్పుడు వాటి నిర్మాతలు భయపడుతుంటారని టాక్. అయినప్పటికీ ఈ నంబర్ గేమింగ్ మాత్రం ఆగడం లేదు. నిమిషాల వ్యవధిలో మా పాటకు ఇన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయంటే.. మా టీజర్ కి అన్ని లైక్స్ వచ్చాయని హీరోల డిజిటల్ టీమ్స్ సోషల్ మీడియాలో ఊదరగొడుతూ వస్తున్నారు.

ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న చిత్రాలకి అసాధ్యమైన ఎన్నో రికార్డులను మన స్టార్ హీరోలు తమ పేరిట లిఖిస్తున్నారు. దీని వల్ల సినిమాకు పబ్లిసిటీ ఏ మాత్రం జరుగుద్దనేది పక్కన పెడితే.. పెయిడ్ ప్రమోషన్స్ వల్ల సోషల్ మీడియా కంపెనీలు బాగుపడుతున్నాయి. ఇక వీటి వల్ల జరిగే ఫ్యాన్ వార్ ని ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. మా హీరో గొప్ప అని స్టార్ట్ చేసి.. మీ హీరోవి పెయిడ్ వ్యూస్ అంటూ విమర్శలు ప్రతి విమర్శలతో నెట్టింట రచ్చ చేస్తుంటారు.

నిజానికి యూట్యూబ్ లో వచ్చే వ్యూస్ - లైక్స్ కారణంగా సినిమా సక్సెస్ అవుతుంది అనుకుంటే.. దీని గురించి గొప్పలు చెప్పుకునే ప్రతీ స్టార్ హీరో సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి కదా?. యూట్యూబ్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తే థియేటర్లలో వసూళ్లు కూడా అదే స్థాయిలో ఎందుకు రావడం లేదు?. పబ్లిసిటీ చేసుకుని సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లాలని అనుకోవడంలో తప్పులేదు. కానీ ఇలా 'పెయిడ్' వ్యూహంతో వ్యూస్ - లైక్స్ కోసం పాకులాడటం వల్ల ఏం ఉపయోగం ఉండదు.

అంతేకాదు ఇది ప్రొడ్యూసర్స్ కు ఇబ్బంది తెచ్చిపెట్టడంతో పాటు అభిమానుల మధ్య గొడవలకు దారి తీస్తుంది. అందుకే మన సౌత్ స్టార్స్ - సూపర్ డూపర్ స్టార్స్ అందరూ యూట్యూబ్ వ్యూస్ - లైక్స్ మ్యానియా నుంచి వీలైనంత త్వరగా బయటపడాలని సగటు సినీ అభిమాని కోరుకుంటున్నాడు. మరి అది జరుగుతుందో లేదో చూడాలి.
    
    
    

Tags:    

Similar News