సినిమా విడుదలయ్యాక ఒకట్రెండు వారాలకి కొత్తగా మరో పాటని కలపడం లేదంటే అదనంగా మరికొన్ని సన్నివేశాల్ని జోడించడం తరచుగా జరిగేదే. మరో దఫా ప్రేక్షకుల్ని థియేటర్‌కి రప్పించడంలో భాగంగా చేసే ప్రయత్నమే అదంతా. వైవీయస్ చౌదరి కూడా అలాగే ప్లాన్ చేసుకొన్నాడు. పవనిజంపై తయారు చేయించిన పాటని సినిమా విడుదలయ్యాకే కలుపుతామని చౌదరి హింట్ ఇచ్చేశాడు. ఆయన తీసిన 'రేయ్' ఈ నెల 27న ప్రేక్షుల ముందుకొస్తోంది. ఓ రేంజ్లో ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పవన్‌కల్యాణ్‌పై అభిమానుల్లో ఉన్న క్రేజ్‌ని ఎలాగైనా వాడుకోవాలని భావించిన చౌదరి పవనిజం నేపథ్యంలో ఓ పాటని తయారు చేయించాడు. అది నిన్ననే విడుదల చేశారు. అయితే ఆ పాటని ఇంకా షూట్ చేయలేదట. రెండు రోజుల్లో షూట్ చేస్తామనీ, అంతా అనుకొన్నట్టు పూర్తయితే సినిమాలో కలిపేస్తామనీ, లేదంటే విడుదలయ్యాక కొన్ని రోజులకి ఆ పాటని కలుపుతామని ప్రకటించాడు వైవీయస్ చౌదరి. అంటే పవన్ పాట పేరుతో మరో దఫా ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడమే లక్ష్యంగా ఈ బంపర్ ఆఫర్ ప్రకటించాడని జనాలు మాట్లాడుకొంటున్నారు. మొత్తంగా వైవీయస్ చౌదరి సినిమా ప్రమోషన్ కోసం ఏమేం చేయాలో అవన్నీ చేసేస్తున్నాడు. ఏదో ఒక హంగామాతో క్రేజ్ తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.