అట్లీ కలర్‌పై కపిల్ కామెడీ... బుద్ది ఉందా అని విమర్శలు
కపిల్ షో లో కామెడీ పేరుతో ప్రముఖులను అవమానించడం, వారి లుక్ పై కామెంట్స్ చేయడం, వారి కలర్ విషయంలో కామెంట్స్ చేయడం ఎప్పుడూ విమర్శలకు తెర తీస్తూనే ఉంటుంది.
తమిళ దర్శకుడు అట్లీ బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్‌తో 'జవాన్' సినిమాను రూపొందించి రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన విషయం తెల్సిందే. సౌత్ దర్శకుల స్థాయిని బాలీవుడ్ ఫిల్మ్ స్టార్స్‌కి, హిందీ మీడియాకు చెప్పకనే చెప్పిన అట్లీ తాజాగా హిందీలో బేబీజాన్ సినిమాను నిర్మించారు. తమిళ్‌లో తాను రూపొందించిన సినిమాను హిందీలో తన శిష్యుడి దర్శకత్వంలో అట్లీ నిర్మించారు. హిందీలో వరుణ్ ధావన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా బేబీ జాన్ సినిమా రూపొందింది. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' అనే కామెడీ షోలో చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆసక్తికర సంఘటన జరిగింది.
కపిల్ షో లో కామెడీ పేరుతో ప్రముఖులను అవమానించడం, వారి లుక్ పై కామెంట్స్ చేయడం, వారి కలర్ విషయంలో కామెంట్స్ చేయడం ఎప్పుడూ విమర్శలకు తెర తీస్తూనే ఉంటుంది. తాజాగా అట్లీ కలర్ గురించి కపిల్ కామెంట్ చేశాడు. అట్లీ వంటి గొప్ప దర్శకుడిని గురించి కపిల్ శర్మ అవమానించినట్లుగా కలర్‌ను ప్రస్థావిస్తూ.. కథ చెప్పడంకు వెళ్లిన సమయంలో మీరు ఎవరైనా స్టార్ హీరో వద్దకు వెళ్లిన సమయంలో వాళ్లు అట్లీ ఎక్కడ కనిపించడం లేదు అని అడిగారా అంటూ ప్రశ్నించాడు. అందుకు అట్లీ సరైన సమాధానం చెప్పి కపిల్‌పై చెంపపై కొట్టినట్లుగా చేశాడు.
కపిల్ ప్రశ్నకు అట్లీ స్పందిస్తూ... మీరు ఈ ప్రశ్న అడగడం వెనుక ఉద్దేశ్యం నాకు అర్థం అయ్యింది. ట్యాలెంట్ ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం అనేది పెద్ద విషయం కాదు. నిజం చెప్పాలంటే దర్శకుడు మురుగదాస్ గారికి నేను కృతజ్ఞతలు చెప్పాలి. తొలిసారి నేను కథ ఆయన వద్ద చెప్పాను. ఆ సమయంలో నా కథను విని నచ్చారు, ఆయన నా యొక్క రూపం గురించి ఆలోచించలేదు. ఆయన కేవలం నా స్క్రిప్ట్ గురించి ఆలోచించారు అందుకే నాకు అవకాశం ఇచ్చారు. ఈ ప్రపంచం మన ప్రతిభ గురించి మాట్లాడుకోవాలి తప్ప, మన రూపం గురించి మాట్లాడుకునే అవకాశం ఇవ్వకూడదు అని నమ్ముతాను అన్నారు.
అట్లీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది అట్లీకి మద్దతుగా నిలుస్తున్నారు. అంత గొప్ప దర్శకుడు, వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను సాధించిన సినిమా దర్శకుడు అయిన అట్లీని పట్టుకుని కలర్ గురించి మాట్లాడటంను ఏమంటారు, బుద్ది ఉండి అలాంటి ప్రశ్నలు అడుగుతావా అంటూ కపిల్‌ను ఉద్దేశించి చాలా మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కపిల్ శర్మను బ్యాన్ చేయాలి అంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ కపిల్ ఇలాంటి వక్రబుద్ది చూపించి ఇతరులను అవమానించే విధంగా మాట్లాడారు అంటూ సోషల్ మీడియాలో పాత వీడియోలను కొందరు షేర్ చేస్తున్నారు.