అంబానీ పెళ్లిలో అట్లీ 10 ని.ల సినిమా రిలీజ్

క‌న్యాదానం గురించి అనంత్ అంబానీ త‌ల్లిగారైన నీతా అంబానీ స్ఫూర్తివంత‌మైన వ్యాఖ్యానం ఆక‌ట్టుకుంది.

Update: 2024-07-18 09:05 GMT

అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ జూలై 12న ముంబైలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి బాలీవుడ్ ప్రముఖులు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ మరియు జాన్ సెనా, కిమ్ కర్దాషియాన్, ఖోలే క‌ర్ధాషియాన్ వంటి అంతర్జాతీయ తారలు హాజరయ్యారు. వివాహ వేడుకల చివరి రోజున ఈవెంట్ సజావుగా సాగేలా అంద‌రికీ గుర్తుండిపోయేలా చేయడంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అనంత్ ధన్యవాదాలు తెలిపారు. క‌న్యాదానం గురించి అనంత్ అంబానీ త‌ల్లిగారైన నీతా అంబానీ స్ఫూర్తివంత‌మైన వ్యాఖ్యానం ఆక‌ట్టుకుంది.

పెళ్లి ముగిసినా కానీ.. ఇప్ప‌టికీ అంబానీ పెళ్లి గురించిన చాలా ముచ్చ‌ట్లు ప్ర‌జల్లో సాగుతున్నాయి. ఇంత‌లోనే ఒక కొత్త విష‌యం కూడా తెలిసింది. అంబానీల పెళ్లి వేడుక‌లో చాలా ఫ్రేమ్‌ల‌లో కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్ త‌న భార్య‌తో క‌లిసి క‌నిపించాడు. పెళ్లి ఆద్యంతం ర‌క‌ర‌కాల డిజైన‌ర్ దుస్తుల్లో అత‌డు క‌నిపించిన తీరుకు అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. అంబానీల‌కు అత‌డు మ‌రీ అంత స‌న్నిహితం అయిపోయాడేంటి? అని ఆరాలు తీసారు. అయితే జ‌వాన్ సినిమాతో షారూఖ్, స‌ల్మాన్ లాంటి వారికి అత‌డు అత్యంత స‌న్నిహితుడు అయిపోయాడు. దీంతో అత‌డి పీఆర్ క‌మ్యూనికేష‌న్ ఓ లెవ‌ల్లో ఉందిప్పుడు. రిల‌య‌న్స్ అధినేత‌ల నుంచి ఆహ్వానం అందుకునేవార‌కూ వెళ్లింది.

అంతేకాదు.. ఈ పెళ్లిలో వ‌ధూవ‌రుల కోసం 10 నిమిషాల యానిమేషన్ చిత్రాన్ని అట్లీ రూపొందించాడ‌ని కూడా తెలిసింది. అనంత్- రాధిక స్వ‌యంగా అట్లీ దీనిని రూపొందించాల‌ని కోరుకున్నార‌ట‌. అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ అందించిన ఈ ప్రత్యేక చిత్రం పెళ్లి అనంత‌రం శుభ్ ఆశీర్వాద్ వేడుకలో ప్రదర్శించారు. పాపుల‌ర్ `బీర్ బైసెప్స్‌` యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాడియా ఈ సమాచారాన్ని రివీల్ చేసారు. అమెరికన్ హాస్యనటుడు-నటుడు ఆకాష్ సింగ్ పోడ్‌కాస్ట్‌లో మూడు రోజుల వేడుక గురించి చాలా విష‌యాలు వెల్లడించాడు. పెళ్లి జరిగిన రెండోరోజు వారు వివాహ అతిథుల కోసం ఈ యానిమేషన్ చిత్రాన్ని విడుదల చేశారు. పెళ్లి సందర్భంగా అదొక అపూర్వమైన ఘట్టం`` అన్నారు.

ఇక ఈ పెళ్లిలో అతిథుల కోసం వీనుల‌విందైన సంగీత కార్య‌క్ర‌మాల‌కు కొద‌వేమీ లేదు. అయితే దీనికోసం అతిథులు ఒక వేదిక వ‌ద్ద‌కు రావాల్సిన ప‌ని లేదు. వారి వ‌ద్ద‌కే కిలోమీట‌ర్ల పొడ‌వునా సంగీత‌జ్ఞులు వెళ్లారు. అహూతుల‌ను అల‌రించారు. సాధారణ వివాహంలో మ‌నం షో చూడ‌టానికి వెళ్లాలి. కానీ ఇక్కడ సిబ్బంది చిన్న కచేరీ కోసం ప్రతి స్టేషన్‌లో ఆగిపోయారు. కళాకారులు త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇచ్చారు. బారాత్‌లోని ప్రతి ఒక్కరూ వెర్రివాళ్ళయ్యారు.. అని కూడా అల్లాబాడియా వెల్ల‌డించారు.

Tags:    

Similar News