ఎలియన్ తో కార్తికేయన్ అల్లరి
తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసి సినిమాపై మంచి క్యూరియాసిటీని పెంచారు మేకర్స్.
ఈ ఏడాది మహావీరుడు చిత్రంతో ఆకట్టుకున్న కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్.. ప్రస్తుతం అయలాన్ చిత్రంలో నటిస్తున్నాడు. తమిళంలో అయలాన్ అంటే ఏలియన్ అని అర్థం. ఆర్.రవికుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసి సినిమాపై మంచి క్యూరియాసిటీని పెంచారు మేకర్స్.
ఒక్కో పీరియడ్‌లో ఒక్కో ఎనర్జీ ఈ వరల్డ్‌ని డామినేట్ చేసింది. వాతావరణంలో ఏర్పడిన ఈ ప్రమాదకరమైన మార్పులు భూమినే అంతం చేస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఆ ఎనర్జీ యొక్క డిమాండ్ అండ్ డ్రైనే రాబోయే ఎనర్జీలకు నాంది అంటూ టీజర్ యాక్షన్ సీన్స్‌తో మొదలైంది. ఆ తర్వాత ఓ పల్లెటూరిలో తన స్నేహితులతో ఉండే శివకార్తికేయన్‌కు.. అనుకోకుండా ఆ ఊరిలోకి వచ్చిన ఏలియన్‌తో స్నేహం ఏర్పడుతుంది.
ఆ తర్వాత ఊరికి ఒక సమస్య రాగా ఏలియన్‌తో కలిసి శివకార్తికేయన్ ఆ సమస్యను ఎలా పరిష్కరించాడు? అసలా ఏలియన్ భూమి మీదకు ఎందుకు, ఎలా వచ్చింది? అసలు వాతావరణంలో ఏర్పడిన ఆ ప్రమాదకరమైన మార్పులు ఏంటి? తెలుసుకోవాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక టీజర్ చివరిలో ఏలియన్‌ను శివ స్నేహితుడు కొట్టడం మస్త్ కామెడీగా అనిపించింది.
మొత్తంగా ఈ ప్రచార చిత్రం యాక్షన్ కామెడీ సీన్స్‌తో ఆసక్తికరంగా సాగింది. ఏ.ఆర్.రెహమాన్ అందించిన సంగీతం కూడా చాలా బాగుంది. యాక్షన్ విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. ఇంకా ఈ టీజర్.. కాస్త గతంలో వచ్చిన హృతిక్ రోషన్ కోయి మిల్గయా సినిమాను గుర్తుచేసింది. ఇకపోతే ఇప్పటికే అయలాన్ నుంచి మేకర్స్ లాంఛ్ చేసిన అయలాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా బాగా ఆకట్టుకుంది.
కాగా, సైన్స్ ఫిక్షన్ కామెడీ జానర్‌లో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. రకుల్ ప్రీత్‌సింగ్ కథనాయికగా నటిస్తోంది. పొంగల్ 2024 కానుకగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. సినిమాలో ఇషా కొప్పికర్, శరద్ కేల్కర్, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్, బాల శరవణన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.