అయోధ్యకు 'హనుమాన్' కానుక 14.25 లక్షలు
సంక్రాంతి బరిలో పెద్ద హీరోల సినిమాలతో పోటీపడుతూ యువహీరో తేజ సజ్జా నటించిన హను-మ్యాన్ శుక్రవారం వెండితెరపైకి వచ్చింది
సంక్రాంతి బరిలో పెద్ద హీరోల సినిమాలతో పోటీపడుతూ యువహీరో తేజ సజ్జా నటించిన హను-మ్యాన్ శుక్రవారం వెండితెరపైకి వచ్చింది. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. దాదాపు 300 థియేటర్లలో ప్రీమియర్ షోలు ప్రదర్శించగా అద్భుత స్పందన వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వాగ్దానం చేసినట్లుగా.. చిత్ర యూనిట్ అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రీమియర్ షో కలెక్షన్ల నుండి 14.25 లక్షల రూపాయలను విరాళాన్ని అందిస్తున్నట్టు ప్రకటించింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి ప్రతి టిక్కెట్టు నుంచి రూ.5 రామమందిర నిర్మాణానికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. సినిమా థియేటర్లలో ఉండే వరకు ఒక్కో టిక్కెట్టు నుంచి రూ.5 చొప్పున చిత్ర యూనిట్ అయోధ్య రామ మందిరానికి అందజేస్తుంది. హనుమాన్ కి క్రిటిక్స్ నుంచి దక్కిన అద్భుత ప్రశంసల నేపథ్యంలో టీమ్ ఫిల్మ్ నగర్‌లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేసింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా, అమృత అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటించిన హనుమాన్ పరిమిత బడ్జెట్లో తెరకెక్కిన అద్భుత చిత్రమన్న ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా తేజ సజ్జా కెరీర్ ఎదుగుదలకు ప్రధాన బలం కానుంది.
హనుమాన్ చిత్రం కుటుంబ సమేతంగా వీక్షించదగిన పర్ఫెక్ట్ కంటెంట్ ఉన్న సినిమా అన్న ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాకి యునానిమస్‌గా పాజిటివ్ సమీక్షలు రావడంతో ప్రశాంత్ వర్మ బృందం సెలబ్రేషన్ మోడ్ లోకి వెళ్లింది. వరుసగా ప్రయోగాత్మక చిత్రాలతో ఆకట్టుకుంటున్న ప్రశాంత్ వర్మ టాలీవుడ్ లో మోస్ట్ ప్రామిస్సింగ్ డైరెక్టర్ గా నిరూపించుకుంటున్నారు. సంక్రాంతి బరిలో మరో రెండు పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న హనుమాన్ భారీ ఓపెనింగులు సాధించేందుకు ఆస్కారం ఉంది.