టీజర్ టాక్: బడే మియాన్ చోటే మియాన్
తీవ్రవాదం అణచివేత నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలొచ్చాయి. ఇక ఈ జానర్ అలీ అబ్బాస్ జాఫర్ కి కొట్టిన పిండి.
తీవ్రవాదం అణచివేత నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలొచ్చాయి. ఇక ఈ జానర్ అలీ అబ్బాస్ జాఫర్ కి కొట్టిన పిండి. టైగర్ జిందా హై సహా పలు భారీ యాక్షన్ చిత్రాలతో భారీ హిట్లు కొట్టిన అతడు ఇప్పుడు తీవ్రవాదం నేపథ్యంలోనే మరో భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లాంటి భారీ యాక్షన్ హీరోలతో అతడు రూపొందిస్తున్న 'బడే మియాన్ చోటే మియాన్' టీజర్ తాజాగా విడుదలైంది.
భారతదేశాన్ని నాశనం చేయాలనే లక్ష్యంతో ఉన్న పాక్ ఉగ్రవాది పృథ్వీరాజ్ సుకుమారన్ పై బడే మియాన్, చోటా మియాన్ పోరాటం ఎలా సాగిందన్నదే ఈ సినిమా కథాంశం. అక్షయ్ కుమార్ - టైగర్ ష్రాఫ్ టైటిల్ పాత్రల్లో నటించారు. ఆ ముగ్గురి మధ్యా వార్ ఏ రేంజులో సాగిందన్నది తెరపైనే చూడాలి. బడే మియాన్ చోటే మియాన్ టీజర్ విడుదలకు ముందు డైనమిక్ ద్వయం అక్షయ్ కుమార్ - టైగర్ ష్రాఫ్‌లతో ఉన్న కొత్త పోస్టర్‌ను ఆవిష్కరించగా అద్భుత స్పందన వచ్చింది. తాజాగా టీజర్ విడుదలైంది. హిందూస్తాన్ ని నాశనం చేయాలనుకునే భీకరమైన తీవ్రవాదితో తలపడేవారిగా అక్కీ, టైగర్ అద్భుత పోరాట నైపుణ్యాలు, భారీ ఆయుధాలతో పోరాటాలతో విజువల్స్ రక్తి కట్టించాయి.
ఈ యాక్షన్-ప్యాక్డ్ మూవీలో హెలికాప్టర్లు, క్షిపణుల వినియోగం సహా పూర్తిగా యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంది. అలీ అబ్బాస్ జాఫర్ యాక్షన్ థ్రిల్లర్ బడే మియాన్ చోటే మియాన్‌కి దర్శకత్వం వహిస్తున్నారు, ఇందులో ప్రధాన నటులతో పాటు మానుషి చిల్లర్, సోనాక్షి సిన్హా, అలయ ఎఫ్ వంటి భారీ తారాగణం నటించారు. ఈ చిత్రం ప్రస్తుత షూటింగ్ లొకేషన్ జోర్డాన్.
దేవగన్ 'మైదాన్'తో పోటీబరిలో?
బడే మియాన్ చోటే మియాన్ ఈద్ సందర్భంగా అజయ్ దేవగణ్ నటించిన మరో భారీ చిత్రం `మైదాన్`తో పోటీపడనుంది. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఇటీవల తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఈ విషయాన్ని తెలియజేసారు. ఏప్రిల్ 2024 #ఈద్ పండుగకు ఇరు సినిమాలు పోటీపడతాయని వెల్లడించారు.
అజయ్ దేవగన్ నటించిన మైదాన్ అనేది 1952 నుండి 1962 వరకు భారతీయ ఫుట్‌బాల్ స్వర్ణ యుగం ఆధారంగా రూపొందించబడిన జీవిత చరిత్ర స్పోర్ట్స్ డ్రామా చిత్రం. అజయ్ లెజెండరీ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ పాత్రను పోషించాడు. రహీమ్ నాయకత్వంలో భారతదేశం 1951 - 1962లో ఆసియా క్రీడలలో బంగారు పతకాలను గెలుచుకుంది. 1956 సమ్మర్ ఒలింపిక్స్‌లో సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. ఈ ఘనత సాధించిన మొదటి ఆసియా దేశంగా అవతరించింది.
అమిత్ శర్మ దర్శకత్వంలో మైదాన్ చిత్రాన్ని 2019లో ప్రకటించారు. బోనీకపూర్ ఈ చిత్రానికి నిర్మాత. అయితే కరోనా క్రైసస్ సహా భారీ బడ్జెట్ల కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ చిత్రీకరణ పూర్తి చేసుకుని చివరికి ఇప్పటికి వస్తోంది. నిజానికి నవంబర్ 2020లో విడుదలవుతుందని ప్రకటించినా కానీ అప్పట్లో కోవిడ్-19 కారణంగా షూటింగ్‌ను పూర్తి చేయలేకపోయారు. 23 జూన్ 2023న కొత్త విడుదల తేదీని నిర్ణయించినా అది కూడా వీలుపడలేదు. మార్చి 2023 వరకు ప్రాజెక్ట్ గురించి ఎటువంటి అప్‌డేట్‌లు లేవు. పోస్ట్-ప్రొడక్షన్‌లో జాప్యం కారణంగా మైదాన్ మళ్లీ వాయిదా పడింది.