బండి, కేటీఆర్ మధ్య ‘లీగల్’ వార్.. కారణం ఏంటేంటే..?

కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీమంత్రి కేటీఆర్ మధ్య నెలకొన్న వివాదం మరోసారి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది.

Update: 2024-10-23 15:30 GMT

కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీమంత్రి కేటీఆర్ మధ్య నెలకొన్న వివాదం మరోసారి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఇద్దరి మధ్య ఇప్పుడు లీగల్ నోటీసుల వార్ కొనసాగుతోంది. దీంతో రాజకీయాలు ఒక్కసారిగా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా మారిపోయాయి. ఇప్పటికే కాంగ్రెస్‌పై పైచేయి సాధించేందుకు.. ప్రజల్లో పార్టీకి మరింత హైప్ తెచ్చేందుకు ఒకరికి ఒకరు పోటీపడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో సంజయ్, కేటీఆర్ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు మరోసారి మొదలయ్యాయి.

ఈ నెల 19వ తేదీన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పలు ఆరోపణలు చేశారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారని.. డ్రగ్స్ విక్రయిస్తారని.. అధికారంలో ఉండగా వీఐపీల ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు పాల్పడ్డాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో సంజయ్ వ్యాఖ్యలపై కేటీఆర్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.

బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉన్నాయని కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు సంజయ్‌కి లీగల్ నోటీసులు పంపించారు. బాధ్యతాయుతమైన కేంద్రమంత్రి పదవిలో ఉండి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ప్రజలు కూడా సీరియస్‌గా తీసుకునే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. తనపై, తన పార్టీపై నిరాధార ఆరోపణలు చేశారని తెలిపారు. తన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చెప్పాలని, వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే లీగల్‌గా వెళ్లక తప్పదని హెచ్చరించారు. రూ.100 కోట్ల పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.

అయితే.. కేటీఆర్ వ్యాఖ్యలకు బండి సంజయ్ దీటుగా బదులిచ్చారు. కేటీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులను ఎదుర్కొంటానని అన్నారు. ఇన్నాళ్లు మాటలకు మాటలతోనే బదులిచ్చానని.. ఇప్పుడు లీగల్ నోటీసులకు లీగల్ నోటీసులతోనే బదులిస్తానని వార్నింగ్ ఇచ్చారు. రాజకీయాలను రాజకీయంగా ఎదుర్కోలేక నోటీసులు పంపించడమా అంటూ ప్రశ్నించారు. ముందుగా తనను అన్నారు కాబట్టే తాను రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందని సంజయ్ తెలిపారు. తాను సుదపూసను అన్నట్లుగా కేటీఆర్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాను కూడా కోర్టు ద్వారానే సమాధానం చెప్తానన్నారు.

రాష్ట్రంలోని ఇద్దరు కీలక నేతల మధ్య మరోసారి రాజకీయంగా వార్ మొదలుకావడంతో రాష్ట్రవ్యాప్తంగానూ చర్చకు దారితీసింది. బండి సంజయ్ వెనక్కి తగ్గేదే లేదు అన్నట్లు బదులిస్తుండగా.. సంజయ్ వ్యాఖ్యలకు కేటీఆర్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తి నెలకొంది. తాను చెప్పినట్లుగా వారం రోజుల్లోగా రిప్లై రాకుంటే లీగల్‌గా వెళ్తారా అన్న ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. మరోవైపు.. ఇద్దరు కీలక నేతలు కలిసి ప్రభుత్వం కొట్లాడితే ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది కానీ.. ఇలా మీకు మీరు కొట్టుకుంటే సమస్యలు ఏం పరిష్కారం అవుతాయి అనే భిన్న వాదనలు సైతం ప్రజల్లో వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News