IFFI 2024 విజేతలు: ఈ భారతీయ నటుడిపైనే అందరి కళ్లు
డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో 55వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (IFFI) నవంబర్ 28న భారీ వేడుకతో ముగిసింది.
గోవాలో ప్రతిష్ఠాత్మక ఇఫీ-2024 ఉత్సవాలు వైభవంగా జరిగాయి. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో 55వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (IFFI) నవంబర్ 28న భారీ వేడుకతో ముగిసింది. తొమ్మిది రోజుల పాటు సాగిన ఈ ఉత్సవంలో 75 దేశాల నుండి 200 పైగా చిత్రాలను ప్రదర్శించారు. ప్రపంచం నలుమూలల నుంచి సినిమాలను ఇక్కడ ప్రదర్శించడం మహదాద్భుతంగా సినీఔత్సాహికులు అభివర్ణిస్తున్నారు. ఇక్కడ ఔత్సాహిక ఫిలింమేకర్స్ చాలా విషయాలను నేర్చుకున్నారు. ఈ అవార్డుల్లో భారతీయ నటుడు విక్రాంత్ మాస్సే పేరు మార్మోగింది. ప్రఖ్యాత భారతీయ ఫిలింమేకర్ అశుతోష్ గోవారికర్ అధ్యక్షతన జ్యూరీ వివిధ విభాగాల్లో అత్యున్నత పురస్కారాలను ప్రదానం చేసింది. విజేతలలో బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే `ట్వల్త్ ఫెయిల్`లో అతడి అద్భుత నటనకు గాను గౌరవనీయమైన వ్యక్తిత్వ పురస్కారా(ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ ని అందుకున్నాడు. ఈ అవార్డు మాస్సే కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఇది బాలీవుడ్‌లో అతడి కెరీర్ ఎదుగుదలకు పెద్ద బూస్ట్ ఇస్తుందనడంలో సందేహం లేదు.
ప్రతిష్టాత్మక సత్యజిత్ రే లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డును ఆస్ట్రేలియా దర్శకుడు ఫిలిప్ నోయిస్‌కు అందించడం అవార్డుల్లో మరో కీలక అంశం. ప్రపంచ సినిమాకు ఆయన చేసిన విశేషమైన సేవలను గుర్తించి ఈ అవార్డును నోయిస్ కి అందించారు. అతడు దశాబ్దాలపాటు పేట్రియాట్ గేమ్స్, క్లియర్ అండ్ ప్రెజెంట్ డేంజర్, సాల్ట్ , ది సెయింట్ వంటి చిత్రాలలో అద్భుతంగా పనిచేసినందుకు గానూ దీనిని అందజేసారు. హారిసన్ ఫోర్డ్, నికోల్ కిడ్‌మాన్ , ఏంజెలీనా జోలీ వంటి దిగ్గజ నటీనటులతో కలిసి నాయిస్ అద్భుతమైన కెరీర్ ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. సత్యజిత్ రే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును గతంలో మార్టిన్ స్కోర్సెస్, వాంగ్ కర్-వై , క్రిజ్‌టోఫ్ జానుస్సీ వంటి సినీ దిగ్గజాలకు అందించారు. శాంతి ప్రచారం - మానవ హక్కులను ప్రోత్సహించినందుకు ICFT-UNESCO గాంధీ పతకాన్ని లెవాన్ అకిన్స్ క్రాసింగ్ గెలుచుకున్నారు. మరాఠీ చిత్రం ఘరత్ గణపతికి ఉత్తమ తొలి భారతీయ ఫీచర్ ఫిల్మ్ అవార్డును నవజ్యోత్ బండివాడేకర్ అందుకున్నారు.
అంతర్జాతీయ కేటగిరీలలో, లిథువేనియన్ చిత్రం `టాక్సిక్` గోల్డెన్ పీకాక్ (ఉత్తమ చిత్రం) విజేతగా నిలిచింది, హోలీ కౌ క్లెమెంట్ ఫేవో ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకోగా, వెస్టా మటులియెట్ - ఇవా రూపాయికైట్ సంయుక్తంగా ఉత్తమ నటి అవార్డును గెలుపొందారు. లంపన్ (మరాఠీ) ఉత్తమ వెబ్ సిరీస్ అవార్డును గెలుచుకుంది.
విజేతల పూర్తి జాబితా:
అవార్డుల వివరాలు:
గోల్డెన్ పీకాక్ (ఉత్తమ చిత్రం): టాక్సిక్ (లిథువేనియన్)
ఉత్తమ నటి: వెస్టా మటులైతే - ఇవా రూపాయికైతే (టాక్సిక్)
ఉత్తమ నటుడు: క్లెమెంట్ ఫావో (హోలీ కౌ)
ఉత్తమ దర్శకుడు: బొగ్దాన్ మురేసాను (ది న్యూ ఇయర్ దట్ నెవర్ కేం)
ప్రత్యేక జ్యూరీ అవార్డు: లూయిస్ కోర్వోయిసియర్ (హోలీ కౌ)
ఉత్తమ వెబ్ సిరీస్: లంపన్ (మరాఠీ)
భారతీయ చలనచిత్రం యొక్క ఉత్తమ తొలి దర్శకుడు: నవజ్యోత్ బండివాడేకర్ (ఘరత్ గణపతి)
ICFT-UNESCO గాంధీ మెడల్: క్రాసింగ్ (లెవన్ అకిన్)