ట్రైలర్: మార్వల్ సినిమాని కొట్టేది ఒకటొస్తోంది
మార్వల్ సినిమాటిక్ ప్రపంచంలో ఒకదానిని మించి ఒకటిగా సూపర్ హీరో సినిమాలు విడుదలై ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల డాలర్లను వసూలు చేస్తున్నాయి
మార్వల్ సినిమాటిక్ ప్రపంచంలో ఒకదానిని మించి ఒకటిగా సూపర్ హీరో సినిమాలు విడుదలై ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల డాలర్లను వసూలు చేస్తున్నాయి. వందల వేల కోట్ల కలెక్షన్లను సాధిస్తూ సంచలనంగా మారుతున్నాయి. నిజానికి భారతీయ సినిమా బడ్జెట్ల స్పాన్ ఆ స్థాయిలో లేదు కానీ మనకు కూడా సింగీతం శ్రీనివాసరావు లాంటి లెజెండ్ హాలీవుడ్ ని తలదన్నే సినిమాలను ఆరోజుల్లోనే తీశారని గర్వంగా చెప్పుకోగలం. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ క్లాసిక్ మూవీ- బ్యాక్ టు ద ఫ్యూచర్ స్ఫూర్తితో సింగీతం అప్పట్లోనే ఆదిత్య 369 లాంటి అద్భుతాన్ని సృజించారు. భూతభవిష్యత్ వర్తమాన కాలాల్లోకి మనిషి ప్రవేశిస్తే అనంతర పరిణామాలు ఎలా ఉంటాయో ఆదిత్య 369లో అద్భుతంగా చూపించిన మేధావి సింగీతం.
ఆయన నుంచి వచ్చిన మరో క్లాసిక్ చిత్రం 'భైరవద్వీపం'. అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోని అద్భుత విజువల్ మాయాజాలాన్ని సృష్టించిన అపరమేధావి సింగీతం అని భైరవద్వీపంతో మరోసారి ప్రూవ్ అయింది. యాధృచ్ఛికంగా ఈ రెండు సినిమాల్లో నందమూరి బాలకృష్ణ కథానాయకుడు. నిజానికి కమర్షియల్ సినిమా పేరుతో వాస్తవ విరుద్ధంగా సినిమాలు తీస్తున్న ఆ రోజుల్లో కూడా సింగీతం భైరవద్వీపం లాంటి చిత్రాన్ని పురాణ కథతో అందమైన చందమామ కథలా ఫాంటసీ నేపథ్యంలో అద్భుతంగా తెరకెక్కించిన వైనం ఆశ్చర్యపరుస్తుంది.
ఒక అందమైన రాకుమారి.. కన్నెతనం చెరగని రాకుమారిని అమ్మవారికి బలి ఇచ్చేందుకు తాంత్రిక పూజలు చేసే మాంత్రికుడు.. సప్త సముద్రాల అవతలికి రాకుమారిని ఎత్తుకుని వెళ్లే మాయాతల్పం.. ఇక ఆ తల్పానికి కాపలా కాసే రెండు తలల డ్రాగన్.. రాకుమారిని కాపాడేందుకు సాహసాలు చేసే ప్రేమికుడు (బాలయ్య) ఇలా అతడు ఎంచుకున్న ఈ సినిమా కథాంశమే ఒక వండర్. ఇటీవలి కాలంలో చాలా హాలీవుడ్ జంగిల్ సినిమాల్లో మర్రి ఊడల్ని వింతగా చూపిస్తున్నారు. భైరవద్వీపంలో ఆనాడే వాటిని అద్భుతంగా చూపించారు సింగీతం. మాంత్రిక ద్వీపంలో మర్రి ఊడలు కథానాయకుడిని కట్టేస్తూ గోడలపైకి ఝాడించి కొట్టేస్తూ చేసే విన్యాసాలు ఎంతో అద్భుతంగా అలరించాయి.
నిజానికి మార్వల్ సినిమాటిక్స్ రేంజు బడ్జెట్ పెట్టి భైరవద్వీపం కథనే తిప్పి తీస్తే ఇప్పుడు హాలీవుడ్ లో రిలీజ్ చేసి బిలియన్ డాలర్ వసూళ్లను సాధించడం కష్టం కాదేమో!! నిజానికి అంత ఎఫెక్టివ్ స్టోరీ.. అద్భుతమైన స్క్రీన్ ప్లే.. అంతే ఎఫెక్టివ్ విజువల్ మాయాజాలం ఉన్న సినిమా ఇది. అందుకే ఇప్పుడు రీరిలీజ్ కి సిద్ధమవుతోంది అనగానే ఒకటే ఉత్కంఠ నెలకొంది. నెవ్వర్ బిఫోర్ క్లాసిక్ భైరవద్వీపం చిత్రాన్ని మరోసారి పెద్దతెరపై వీక్షించి తరించాలని బాలయ్య అభిమానులు ఇప్పటికే సిద్ధమవుతున్నారు. నందమూరి బాలకృష్ణ- రోజా ఈ చిత్రంలో సాహసవీరుడు - రాకుమారి పాత్రల్లో నటించారు. 'భైరవ ద్వీపం' కొత్త వెర్షన్ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.