రజినీ మేనియా.. 'భోళా' థియేటర్లు లాక్కుంటుందా?
ఆగస్టు 15 తర్వాత ఏ సినిమాకు విశేష స్పందన ఉంటే దానికి ఎక్కువ థియేటర్లు ఇస్తాం" అని కూడా అన్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే కేవలం తమిళ ప్రేక్షకులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇందుకు తెలుగువారేమీ భిన్నం కాదు. ఇక్కడ కూడా ఆయన చిత్రాలకు మంచి మార్కెట్, క్రేజ్ ఉంది. చాలా సినిమాల ఫ్లాప్‌ల తర్వాత తాజాగా ఆయన నటించిన 'జైలర్' విడుదలై మంచి టాక్‌ను అందుకుంది. వాస్తవానికి కథ పరంగా రొటీన్ సినిమానే అయినప్పటికీ రజనీ మేనియా అండ్ స్టైలిష్ యాక్షన్‌తో పాజిటివ్ టాక్ దక్కించేసుకుంది. దీంతో సక్సెస్‌మీట్ కూడా పెట్టేసి సందడి చేస్తున్నారు.
అయితే ఇక్కడ వరకు కథ బాగానే ఉంది. కానీ టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు అసలు కథ ఆగస్ట్ 11నే మొదలు కానుంది. ఎందుకంటే ఆ రోజే తెలుగు వారి అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ సినిమా రిలీజ్ కానుంది. దీంతో ఆగస్ట్ 11 నుంచి సూపర్ స్టార్ వర్సెస్ మెగాస్టార్ బాక్సాఫీస్ వార్‌గా మారనుంది. అయితే ఎంతకాదనుకున్నా మన తెలుగు ప్రేక్షకులు మొదటి ప్రాధాన్యత భోళాశంకర్కే ఇస్తారు. అప్పటికీ టికెట్లు దొరక్కపోతేనో రజనీ జైలర్‌కు వెళ్తారు. అవసరమైతే జైలర్‌ను కాస్త పక్కనపెట్టి తర్వాత రోజైనా భోళాశంకర్కే ఓటు వేస్తారు.
అందుకే నెటివిటీకి ప్రాధాన్యతతో ఇక్కడ థియేటర్లు కూడా ఎక్కువ శాతం భోళాశంకర్కే దక్కాయి. ఇదే విషయాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కూడా చెప్పారు. "భోళాశంకర్‌కు ఇప్పటికే భారీ సంఖ్యలో థియేటర్‌లు లాక్ అయ్యాయి. 'జైలర్'కు వచ్చిన రెస్పాన్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు ఈ చిత్రానికి మరిన్ని థియేటర్లు యాడ్ చేశాం. ఆగస్టు 15 తర్వాత ఏ సినిమాకు విశేష స్పందన ఉంటే దానికి ఎక్కువ థియేటర్లు ఇస్తాం" అని కూడా అన్నారు.
దీంతో ఆగస్ట్ 11న రిలీజ్ కాబోయే భోళాశంకర్ ఎలా ఉండబోతుందా అన్న ఆసక్తి సినీ ప్రియులతో పాటు మెగా అభిమానుల్లో భారీగా నెలకొంది. మొదటి షో పడి హిట్ టాక్ వచ్చే వరకు అందరిలో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా రీమేక్ కావడం, పైగా స్టార్ హీరోలందరకీ భారీ డిజాస్టర్లను ఇచ్చిన దర్శకుడు తెరకెక్కించడంతో.. ఈ చిత్రంపై కేవలం మెగా ఫ్యాన్స్‌లో మాత్రమే భారీ అంచన్నాలు ఉన్నాయి. మిగతా వర్గాల సినీ ప్రియులు.. మౌత్ టాక్ ఆధారంగానే వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
ఒకవేళ ఈ భోళాశంకర్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్కుకుంటే మాత్రం.. సినిమాకు తిరుగుండదు. అవసరమైతే 'జైలర్'ను కాస్త పక్కకు పెట్టి 'భోళాశంకర్'కు మరిన్ని థియేటర్లు కూడా పెంచేస్తారు. కానీ ఏ కాస్త తేడా వచ్చినా, లేదంటే మిక్స్డ్ టాక్ వచ్చినా.. దిల్ రాజు చెప్పినట్లు ఆగస్ట్ 15(ఎలాగో గవర్న్మెంట్ హాలీడే) వరకు చూసి.. 'భోళాశంకర్' థియేటర్లు కాస్త తగ్గి 'జైలర్'కు ఉన్న రెస్పాన్స్‌తో ఈ సినిమా థియేటర్లను పెంచేస్తారు. ఇప్పటికే తొలి రోజు వచ్చినా టాక్‌తో కొన్ని థియేటర్లను పెంచినట్లు దిల్‌రాజు తెలిపారు. చూడాలి మరి 'జైలర్' రజనీకాంత్ మేనియా.. 'భోళాశంకర్' చిరు మేనియాను తట్టుకుని ముందుకు వెళ్తుందా, థియేటర్లను లాక్కుంటుందా లేదా అనేది.