CBI ఉచ్చులో విలవిల.. రియాకు సుప్రీంలో పెద్ద ఊరట
రియాకు వ్యతిరేకంగా లుక్ అవుట్ సర్క్యులర్‌లను (ఎల్‌ఓసి) రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని సుప్రీం సమర్థించింది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో అతడి ప్రియురాలు, నటి రియా చక్రవర్తి ప్రమేయం గురించి విచారణ జరుగుతోంది. అయితే ఈ కేసులో రియా చక్రవర్తికి పెద్ద ఊరట లభించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), మహారాష్ట్ర ఇమ్మిగ్రేషన్ బ్యూరో దాఖలు చేసిన పిటిషన్‌లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రియాకు వ్యతిరేకంగా లుక్ అవుట్ సర్క్యులర్‌లను (ఎల్‌ఓసి) రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని సుప్రీం సమర్థించింది.
ఈ తీర్పు రియా చక్రవర్తి సోదరుడు షోక్ , ఆమె తండ్రి లెఫ్టినెంట్ కల్నల్ ఇంద్రజిత్ చక్రవర్తి, ఆర్మీ వెటరన్‌లకు కూడా ఉపశమనం కలిగించింది. ఎందుకంటే సుప్రీం కోర్టు వారికి అనుకూలంగా హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. ఇంతకుముందే అంటే ఫిబ్రవరిలో బాంబే హైకోర్టు వారిపై ఉన్న ఎల్.ఓ.సీని రద్దు చేసింది. ఎల్.వో.సి అంటే లుక్ అవుట్ సర్క్యులర్ (విదేశాలకు వెళ్లకుండా).. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు , ఆమె తండ్రికి వ్యతిరేకంగా CBI జారీ చేసిన సర్క్యులర్. ఇది సుప్రీం తీర్పుతో ఇక వర్తించదు. CBI సుప్రీం కోర్టులో ఈ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేయగా సుప్రీం దానిని ఇప్పుడు కొట్టివేసింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై సీబీఐ దర్యాప్తులో భాగంగా వాస్తవానికి లుక్ అవుట్ సర్క్యులర్ జారీ అయింది.
'లైవ్ లా' వెల్లడించిన కథనం ప్రకారం.. న్యాయమూర్తుల బెంచ్ B.R. గవాయి, కె.వి. విశ్వనాథన్ సీబీఐ వేసిన పిటిషన్ పనికిమాలినదిగా కనిపిస్తోందని, నిందితులు ఉన్నత స్థాయి వ్యక్తులు కావడం వల్లనే దీనిని దాఖలు చేసినట్లుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. జస్టిస్ గవాయ్ తాను పనికిమాలిన పిటిషన్‌గా పేర్కొన్న దానిని మళ్లీ దాఖలు చేయకుండా సీబీఐ తరపు న్యాయవాదిని హెచ్చరించారు. ఇద్దరు వ్యక్తులు సమాజంలో బలమైన సంబంధాలను కలిగి ఉన్నారని ఆయన తెలిపారు. న్యాయవాది ఈ విషయాన్ని వాయిదా వేయాలని అభ్యర్థించినప్పుడు, న్యాయస్థానం ఒత్తిడి చేస్తే, న్యాయస్థానం ఖర్చులు విధించడాన్ని, సీబీఐకి కొన్ని అక్షింతలు వేయడాన్ని పరిగణించవచ్చని సూచించింది.
గతంలో న్యాయమూర్తులు రేవతి మోహితే దేరే, మంజుషా దేశ్‌పాండేలతో కూడిన ధర్మాసనం రియా చక్రవర్తి, ఆమె సోదరుడు, తండ్రి విదేశాలకు వెళ్లకుండా వారిపై జారీ చేసిన LOCలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లను అనుమతించింది. 14 జూన్ 2020న సుశాంత్ ఇంట్లో ఉరి వేసుకున్న ఘటన పలు వివాదాలు ఊహాగానాలకు దారితీసింది. అప్పటికి రియా చక్రవర్తి అతడికి ప్రియురాలిగా ఉండటం తనను చిక్కుల్లోకి నెట్టింది. రియాపై అనుమానాలు వ్యక్తం చేయడంతో.. CBI, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) సహా పలు ఏజెన్సీల ద్వారా ఇన్వెస్టిగేషన్ కొనసాగడానికి కారణమైంది.