అన్ స్టాపబుల్ వివాదం.. బాబీ క్లారిటీ ఇలా...
బాలయ్య కూడా కావాలనే ఎపిసోడ్స్ లో ఎన్టీఆర్ పేరును ప్రస్తావనకు తీసుకురావడం లేదంటూ తారక్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోలో నిర్వాహకులు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన లేకుండా చూసుకుంటున్నారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. బాలయ్య కూడా కావాలనే ఎపిసోడ్స్ లో ఎన్టీఆర్ పేరును ప్రస్తావనకు తీసుకురావడం లేదంటూ తారక్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
రీసెంట్ ఎపిసోడ్ లో బాలయ్య అప్ కమింగ్ మూవీ డాకు మహారాజ్ టీమ్ సందడి చేయగా.. డైరెక్టర్ బాబీకి ఆయన ఇప్పటి వరకు పని చేసిన హీరోల గురించి స్లైడ్స్ ద్వారా అడిగారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పిక్ ను ప్రదర్శించలేదు. బాబీ, తారక్ కాంబోలో ఇప్పటికే జై లవకుశ మూవీ వచ్చిన విషయం తెలిసిందే.
కానీ ఎన్టీఆర్ గురించి బాలయ్య అడగకపోవడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ హర్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై నిర్మాత నాగవంశీ స్పందించారు. అదేం అక్కడ జరగలేదని చెప్పారు. ఓ సినిమాలో క్యారెక్టర్ కు తారక్ సూట్ అవుతారని బాలయ్య చెప్పినట్లు నాగవంశీ తెలిపారు.
ఇప్పుడు ఇదే విషయంపై డైరెక్టర్ బాబీకి కూడా డాకు మహారాజ్ ప్రెస్ మీట్ లో ప్రశ్న ఎదురైంది. ఎన్టీఆర్ ఫొటో చూపించి ఎడిటింగ్ లో తీసేశారా లేక మీకేమైనా ముందే చెప్పారా అని ఓ మీడియా ప్రతినిధి బాబీని అడగ్గా.. బయట జరుగుతున్న ప్రచారం ఏమీ నిజం కాదని దర్శకుడు క్లారిటీ ఇచ్చారు.
షోలో అక్కడ అంత డ్రామా ఏం జరగలేదని బాబీ తెలిపారు. దాన్ని కవర్ చేయాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. అక్కడ చూపించిన పిక్స్ కోసం బాలయ్య అడగ్గా.. తాను ఆన్సర్స్ చెప్పానని తెలిపారు. షూటింగ్ గ్యాప్ లో ఓ సినిమాలోని క్యారెక్టర్ గురించి ప్రస్తావన రాగా.. తారక్ అయితే బాగుంటాడని బాలయ్య చెప్పినట్టు వెల్లడించారు.
అది రికార్డు అవ్వలేదు కాబట్టి బయటకు రాలేదని తెలిపారు. బాలయ్యకు జై లవకుశ సినిమా అంటే చాలా ఇష్టమని బాబీ చెప్పారు. ఆ మూవీ గురించి తనతో రెండు మూడు సార్లు మాట్లాడినట్లు గుర్తు చేసుకున్నారు. కేవలం చిన్నదాన్ని అనవసరంగా పెద్దగా చేస్తుంటామని అన్నారు. ఏమీ జరగని దాని గురించి కూడా రకరకాల ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు! దీంతో డైరెక్టర్ బాబీ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.