'భారతీయుడు 2'.. రివ్యూలపై బాబీ సింహా షాకింగ్‌ కామెంట్స్‌!

యూనివర్సల్ స్టార్ కమల్‌ హాసన్‌ నటించిన లేటెస్ట్ మూవీ 'భారతీయుడు 2'. ఎస్ శంకర్‌ దర్శకత్వంలో ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కింది.

Update: 2024-07-19 11:07 GMT

యూనివర్సల్ స్టార్ కమల్‌ హాసన్‌ నటించిన లేటెస్ట్ మూవీ 'భారతీయుడు 2'. ఎస్ శంకర్‌ దర్శకత్వంలో ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కింది. గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. శంకర్ మేకింగ్‌ స్టైల్‌ బాగున్నప్పటికీ, ఔట్ డేటెడ్ స్టోరీ అని, ఈతరం ఆడియన్స్ కు తగ్గట్టుగా లేదని కామెంట్స్ వచ్చాయి. మూడు గంటల సేపు సీట్లో కూర్చొని సినిమా చూడలేకపోయామనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఈ సినిమాపై వస్తోన్న నెగెటివ్‌ రివ్యూలపై నటుడు బాబీ సింహా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

'ఇండియన్ 2' సినిమాలో సిబిఐ ఆఫీసర్ పాత్రలో నటించారు నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ బాబీ సింహా. తాజాగా ఓ ఇంటర్య్వూలో సినిమా గురించి మాట్లాడుతూ, నెగిటివ్ రివ్యూలపై తన నిరాశను వ్యక్తం చేశారు. ఒక సినిమా వెనుక ఎందరో కృషి ఉంటుందని, ప్రతీ చిత్రం విమర్శకుల అంచనాలను అందుకోలేకపోయినా, చిత్రనిర్మాణంలో వారు పడిన శ్రమను అభినందించడం చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు.

''ప్రతి ఒక్కరూ తాము తెలివైన వాళ్లమనే అనుకుంటారు. అన్నీ తమకే తెలుసని భావిస్తారు. ఒకవేళ మేము ఏదైనా బాగుందని చెప్తే, మమ్మల్ని పిచ్చి వాళ్లలా చూస్తారు. మేము కావాలని అలా చెబుతున్నామని అనుకుంటారు. కనుక అలాంటి తెలివైన వారి అభిప్రాయాల గురించి బాధపడాల్సిన అవసరం లేదు'' అని బాబీ సింహా అన్నారు. నెగిటివ్ రివ్యూలు ఇచ్చే వారిని ఉద్దేశిస్తూ ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. సినిమా బాగుంటే ఎవరైనా బాగుందనే చెప్తారని, విమర్శను సానుకూలంగా తీసుకోవాలే తప్ప ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

1996లో కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన 'భారతీయుడు' చిత్రానికి సీక్వెల్ గా 'భారతీయుడు 2' సినిమా రూపొందింది. ఓల్డ్ మ్యాన్ సేనాపతి ఎందుకు మళ్ళీ ఇండియాకి తిరిగొచ్చాడు? సమాజంలోని అవినీతి, లంచగొండితనాన్ని, అన్యాయాన్ని రూపుమాపడానికి ఆయన ఏం చేశాడు? ఈ క్రమంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. దీనికి కొనసాగింపుగా 'ఇండియన్ 3' చిత్రం కూడా ఉంటుందని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. సెకండ్ పార్ట్ చివర్లో మూడో భాగానికి సంబంధించిన ట్రైలర్ ను జోడించారు. దీంట్లో సేనాపతి ఫ్లాష్ బ్యాక్ ను ఎస్టాబ్లిష్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

'భారతీయుడు 2' చిత్రంలో బొమ్మరిల్లు సిద్ధార్థ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య, బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్‌, బ్రహ్మానందం, సముద్రఖని, గుల్షన్ గ్రోవర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్ లో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. జులై 12వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. సినిమా నిడివి ఎక్కువైందనే విమర్శలు రావడంతో, 12 నిమిషాలు ట్రిమ్ చేసినట్లుగా మేకర్స్ ఇటీవల ప్రకటించారు. అయినా సరే ఈ సినిమాకి స్పందన కరువైందని టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News