శ్రీదేవి మరణించాక లై డిటెక్టర్‌తో పరీక్షించారు: బోనీ కపూర్
లెజెండరీ నటి, అతిలోక సుందరి శ్రీదేవి 24 ఫిబ్రవరి 2018న మరణించారు. ఆమె అకాల మరణం వినోద పరిశ్రమనే కాకుండా యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది
లెజెండరీ నటి, అతిలోక సుందరి శ్రీదేవి 24 ఫిబ్రవరి 2018న మరణించారు. ఆమె అకాల మరణం వినోద పరిశ్రమనే కాకుండా యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. జాన్వీ కపూర్ -ఖుషి కపూర్ సహా ఇతర కుటుంబీకులు భారీ నష్టాన్ని ఎదుర్కొన్నామని ఆవేదన వ్యక్తం చేసారు. అయితే శ్రీదేవి మరణంపై చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అది సహజ మరణం కాదని నమ్మే అభిమానులున్నారు. దుబాయ్ హోటల్లో ఏం జరిగిందో ఎవరికీ తెలీదని ఆవేదన చెందేవారు ఇప్పటికీ ఉన్నారు. అది ఒక అంతూ దరీ లేని మిస్టరీగానే భావించే వారున్నారు. చాలా కాలం తర్వాత ఇప్పుడు బోనీ కపూర్ తన భార్య శ్రీదేవి గురించిన కొన్ని రహస్యాల గుట్టు విప్పారు. ముఖ్యంగా శ్రీదేవి కఠినమైన ఆహారనియమాల గురించి మాట్లాడాడు. ఆహారం సరిగా తినకపోవడం కూడా బ్లాక్‌అవుట్‌కు దారితీసిందని అన్నారు.
ప్రముఖ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోనీ కపూర్ చాలా బహిర్గతం కాని విషయాల్ని మాట్లాడారు. బోనీ మాట్లాడుతూ- ''ఇది సహజ మరణం కాదు. ప్రమాదవశాత్తు సంభవించిన మరణం. నేను దాని గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను.. ఎందుకంటే నేను దర్యాప్తు విచారణలో దాదాపు 24 లేదా 48 గంటల పాటు దాని గురించి మాట్లాడాను. వాస్తవానికి భారతీయ మీడియా నుండి చాలా ఒత్తిడి ఉన్నందున మేము ఇలా వ్యవహరించాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు. ఫౌల్ ప్లే (మోసం ధగా) లేదని వారు కనుగొన్నారు. నేను లై డిటెక్టర్ పరీక్షలకు గురయ్యాను. నాపై అన్ని పరీక్షలు చేసారు. ఆపై వచ్చిన నివేదికలో ఈ మరణం ప్రమాదవశాత్తు సంభవించిందని స్పష్టంగా రిపోర్ట్ పేర్కొంది... అని బోనీ తెలిపారు.
ఆమె(శ్రీదేవి) తరచుగా ఆకలితో అలమటించేది. అందంగా కనిపించాలని కోరుకునేది. తను మంచి ఆకృతిలో ఉండాలని ప్రయత్నించేది. దానివల్ల తెరపైనా అందంగా కనిపించాలనేది తన ఉద్ధేశం. శ్రీదేవితో నాకు పెళ్లయినప్పటి నుండి ఆమెకు రెండు సార్లు బ్లాక్‌అవుట్‌లు ఉన్నాయి. తనకు తక్కువ బిపి సమస్య ఉందని డాక్టర్ చెబుతూనే ఉండేవారు... అని బోనీ వెల్లడించారు.
లెజెండరీ నటి శ్రీదేవి దుబాయ్‌లోని ఓ ఖరీదైన స్టార్ హోటల్ లో తన జీవితాన్ని కోల్పోయింది. ఆమె మరణానికి కారణం ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో మునిగిపోవడమేనంటూ దర్యాప్తు అధికారులు తేల్చారు. శ్రీదేవి నటించిన చివరి చిత్రం మామ్ విజయం సాధించింది. ఇందులో ఆమె దేవకీ సబర్వాల్ పాత్రను పోషించింది. ఈ చిత్రంలో శ్రీదేవి నటనకు 'ఉత్తమ నటి'గా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది. రవి ఉద్యవార్ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ చిత్రం 2017లో థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, అక్షయ్ ఖన్నా తదితరులు కూడా నటించారు.