ఐ లవ్ యు BRO.. హాస్యబ్రహ్మీ నవ్వుల చమక్కులు
హాస్యబ్రహ్మీ నవ్వుల చమక్కుల గురించి ఎంత చెప్పినా తక్కువే
హాస్యబ్రహ్మీ నవ్వుల చమక్కుల గురించి ఎంత చెప్పినా తక్కువే. దశాబ్ధాల కెరీర్ లో ఆయన రారాజు. నవ్వుల రేడు. ఇక వేదికలపై ఆయన స్పీచ్ .. టైం టైమింగ్ గురించి ఎంత చెప్పినా అది తక్కువ. ఆయన ఇటీవల అరుదుగా సినిమాల్లో కనిపిస్తున్నా ఎప్పటికీ తాను నవ్వించడంలో రారాజు అని నిరూపిస్తున్నారు. నేటితరం కమెడియన్లు ఎందరు దూసుకొచ్చినా బ్రహ్మీకి ఉండే స్టాచుర్ స్టామినా వేరు అని నిరూపణ అవుతూనే ఉంది. ఇటీవలి పవన్ కల్యాణ్ సినిమాల్లోను బ్రహ్మానందం కనిపించారు.
ఇక పూరి- త్రివిక్రమ్ లాంటి సీనియర్ దర్శకుల సినిమాల్లో బ్రహ్మానందం తప్పనిసరిగా కనిపించాల్సిందే. ఇప్పుడు సముద్రఖని దర్శకుడిగా త్రివిక్రమ్ రచయితగా అరుదైన కాంబినేషన్ లో రూపొందిన 'బ్రో' చిత్రంలోను బ్రహ్మానందం నటించారు. పవన్ కల్యాణ్ - సాయిధరమ్ లతో కలిసి బ్రహ్మానందం హాస్యాన్ని పండించబోతున్నారు. ఈ సినిమాలో నవ్వుకునేవారికి నవ్వుకున్నంత స్కోప్.. ఎమోషన్ కి కొదవేమీ లేదని పవన్ కల్యాణ్ స్వయంగా తెలిపారు.
బ్రో ప్రీరిలీజ్ వేడుకలో ప్రత్యక్షమైన బ్రహ్మీ ఇలా వేదిక ఎక్కగానే అందరి మోములో నవ్వేలే నవ్వులు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్రహ్మీని చూడగానే నవ్వును ఆపుకోలేకపోవడం వేదిక వద్ద కనిపించింది. బ్రహ్మీ తనదైన స్పీచ్ తో వేదిక ఆద్యంతం కట్టిపడేసారు. ''మిస్టర్ బ్రో.. ఐ లవ్ యు బ్రో.. ఏయ్ దొంగా.. ఐ లవ్ యు.. ఏయ్.. ఐలవ్ యు డా.. మిస్టర్ బ్రో..'' అంటూ బ్రహ్మీ నవ్వులు పండించారు.
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో నేనొక పాత్రధారిని. పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. 18-20 సంవత్సరాల వయసు నుంచే నేను ఆయనను చూస్తున్నాను. ఆయన నవ్వు ఎంత స్వచ్ఛంగా ఎంత అందంగా ఉంటుందో.. అంతే అందమైన మనిషి. సరదాగా నవ్విస్తూ ఉంటారు. మనిషి అంతా మంచితనం.. మనిషి అంతా హాస్యం. ఏ రకంగా ఆయన దగ్గరకు వెళ్తే ఆ రకంగా దర్శనం ఇవ్వగల దైవాంశసంభూతుడు మా పవన్ కళ్యాణ్'' అంటూ ప్రశంసలు కురిపించారు. నిర్మాత విశ్వప్రసాద్ పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ సినిమాలు తీస్తాను అన్నారు. ఇంతటి గట్స్ ఉన్న నిర్మాతకు ఆల్ ది బెస్ట్.. బ్రో ఘనవిజయం సాధించాలి అని అన్నారు.