దేవర కాపీ సాంగ్.. ఆ ఒరిజినల్ కంపోజర్ ఏమన్నారంటే..
ఈ చర్చల నేపథ్యంలో ‘మనికే మగే హితే’ ఒరిజినల్ కంపోజర్ చమత్ సంగీత్ కూడా స్పందించారు.
జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’ నుండి విడుదలైన రెండో సింగిల్ ‘చుట్టమల్లే’ సాంగ్ మ్యూజిక్ ప్రియుల మధ్య విస్తృత చర్చలకు దారితీసింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ తో రూపొందిన ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మధ్య కెమిస్ట్రీని ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తున్నారు.
అయితే ఈ సాంగ్ విడుదలైన వెంటనే శ్రీలంకన్ సాంగ్ ‘మనికే మగే హీతే’ తరహాలో ఉందని కొంత సిమిలారిటీస్ కనిపిస్తున్నాయని కామెంట్స్ చేశారు. చమత్ సంగీత్ స్వరపరిచిన ఈ పాటను యోహానీ పాడింది. అందుకే, అనిరుధ్ పై కొన్ని విమర్శలు వినిపించాయి. ‘అనిరుధ్ ఈ ట్యూన్ ని కాపీ చేసాడా?’ అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
ఈ చర్చల నేపథ్యంలో ‘మనికే మగే హితే’ ఒరిజినల్ కంపోజర్ చమత్ సంగీత్ కూడా స్పందించారు. అనిరుధ్ మ్యూజిక్ కి ఆయన అభిమానిగా ఉన్నట్లు చెప్పడమే కాకుండా, తన పాట నుంచి అనిరుధ్ ఇన్‌స్పిరేషన్ పొందడం గర్వంగా ఉందని చెప్పారు. అతను పెద్దగా నెగిటివ్ కామెంట్స్ ఏమి చేయలేదు కానీ ఈ విధంగా స్పందించడంతో సోషల్ మీడియాలో మ్యాటర్ మరింత హాట్ టాపిక్ గా మారింది.
అయినా, ఈ వివాదం అడ్డంకిగా మారకపోవడంతో ‘చుట్టమల్లే’ పాట ఇప్పటికి మిలియన్లలో వ్యూవ్స్ సొంతం చేసుకుంది. ఈ పాటలోని రొమాంటిక్ విజువల్స్, హృదయానికి హత్తుకునే మెలోడీ ప్రేక్షకుల మద్దతు పొందుతున్నాయి. అంతకుముందు అనిరుధ్ మ్యూజిక్ కి ఉన్న క్రేజ్, ఆయన కాంపోజిషన్స్ మీద ఉన్న ట్రస్ట్ ఈ వివాదం పట్ల అభిమానుల్లో మిశ్రమ అభిప్రాయాలను సృష్టిస్తోంది.
ఈ వివాదం ఎక్కడికెళ్తుందో తెలియదు కానీ, ఇంతలో ఈ పాట మాత్రం మంచి హిట్ అయ్యే దిశగా సాగుతోంది. ఇప్పటికే టాలీవుడ్ లో టాప్ వ్యూవ్స్ అందుకున్న పాటలో ఇది కూడా ఒకటిగా నిలుస్తోంది. దేవర సినిమాపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. తప్పకుండా సినిమా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఇక అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ విషయంలో టాక్స్ ఎలా ఉన్నా కూడా హైప్ అయితే క్రియేట్ అవుతున్నట్లు అనిపిస్తుంది. మరి నెక్ట్స్ సాంగ్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి.