రోహిత్.. నీ లేఖ హ‌త్తుకుంది: CM చంద్ర‌బాబు

''ప్రియ‌మైన నారా రోహిత్.. నీ లేఖ నా మ‌న‌సును హ‌త్తుకుంది. ఎన్ని ఒడిదుడుకులు వ‌చ్చినా నా కుటుంబ స‌భ్యుల అండ‌దండ‌ల, స‌దా ఆశీస్సులు ఉన్నాయి గ‌నుక‌నే త‌ట్టుకోగ‌లిగాను.

Update: 2024-06-13 17:35 GMT

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. కూట‌మి గెలుపుతో సంబ‌రాలు చేసుకున్నారు. ఈ ఆనంద స‌మ‌యంలో నారా నంద‌మూరి కుటుంబంలో భావోద్వేగాలు సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ఇప్పుడు నారా కుటుంబ స‌భ్యుడు.. చంద్రబాబు సోదరుడి కుమారుడు, హీరో నారా రోహిత్ రాసిన ఒక లేఖ తేదేపా శ్రేణుల్లో, అలాగే రోహిత్ అభిమానుల్లో చ‌ర్చ‌గా మారింది.

ఇప్పుడు ఆ లేఖ‌పై సీఎం చంద్ర‌బాబు నాయుడు ఎమోష‌న‌ల్ గా స్పందించారు. ''ప్రియ‌మైన నారా రోహిత్.. నీ లేఖ నా మ‌న‌సును హ‌త్తుకుంది. ఎన్ని ఒడిదుడుకులు వ‌చ్చినా నా కుటుంబ స‌భ్యుల అండ‌దండ‌ల, స‌దా ఆశీస్సులు ఉన్నాయి గ‌నుక‌నే త‌ట్టుకోగ‌లిగాను. నీకు ఎల్ల‌పుడూ నా శుభాశీస్సులు వెన్నంటి ఉంటాయి. ప్రేమ‌తో మీ పెద‌నాన్న‌!'' అని లేఖ‌లో రాసారు.

ఇంత‌కుముందు నారా రోహిత్ రాసిన లేఖ అంత‌ర్జాలంలో వైర‌ల్ అయింది. ఆ లేఖ సారాంశం ఇలా ఉంది. ''పెదనాన్న… గత నాలుగున్నర దశాబ్దాలుగా మీరు రాజకీయాలలో ఉన్నారు. ఎన్నో ఒడిదుడుకులను చూశారు… తట్టుకున్నారు… ఆత్మవిశ్వాసంతో నిలబడ్డారు. కానీ గత ఐదేళ్ల కాలంలో ఎంతో వేదన అనుభవించారు. అయినప్పటికీ పార్టీని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. మీకు కష్టం వచ్చినప్పుడు వాళ్లందరూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా మీ కోసం నిలబడ్డారు. అప్పుడు తెలిసింది… గత 40 ఏళ్ల మీ కష్టానికి మీరు పొందింది ప్రజల గుండెల్లో కదిలించలేని స్థానం అని.

చరిత్రలో ఎవరూ మళ్లీ తిరగరాద్దాం అని సాహసం చేయలేని విధంగా ఈ ఎన్నికల్లో విజయాన్ని అందుకున్నారు. ఈ విజయం ఎన్డీయే కూటమిది మాత్రమే కాదు… ఆంధ్రా ప్రజలది.. తెలుగువారిది.. మనందరిదీ. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు'' అంటూ రోహిత్ ఎంతో ఉద్విగ్న‌త‌తో రాసిన లేఖ వైర‌లైంది.

నారా రోహిత్ కొంత‌కాలంగా సినిమాల‌కు దూరంగా ఉన్నారు. అత‌డు న‌టించిన క్లాసిక్ హిట్ చిత్రం 'ప్ర‌తినిథి'కి సీక్వెల్ లో నటిస్తున్నాడ‌ని క‌థ‌నాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన త‌దుప‌రి వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.

Tags:    

Similar News