కోఆప‌రేటివ్ సొసైటీ మోసం.. పుష్ప న‌టుడిపై చీటింగ్ కేసు..

పుష్ప‌1, పుష్ప 2 హిందీ వెర్ష‌న్ల‌లో పుష్ప‌రాజ్ పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పిన ప్ర‌ముఖ న‌టుడు శ్రేయాస్ త‌ల్ప‌డే, స‌హాయ న‌టుడు అలోక్ నాథ్ ల‌పై కేసులు బుక్ అయ్యాయి.

Update: 2025-01-25 03:56 GMT

ఘ‌రానా మోసాలు, దందాలు ఇటీవ‌ల ఎక్కువ‌య్యాయి. ప్ర‌జ‌ల‌ సొమ్మును సింపుల్ గా ఎలా కొట్టేయాలో తెలిసిన తెలివైన కేటుగాళ్లకు కొద‌వే లేదు. ఇప్పుడు కోఆప‌రేటివ్ సొసైటీ పేరుతో పెద్ద మోసం బ‌ట్ట‌బ‌య‌లైంది. ఆస‌క్తిక‌రంగా ఈ కేసులో ఇద్ద‌రు ప్ర‌ముఖ న‌టులు ఉన్నారు. పుష్ప‌1, పుష్ప 2 హిందీ వెర్ష‌న్ల‌లో పుష్ప‌రాజ్ పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పిన ప్ర‌ముఖ న‌టుడు శ్రేయాస్ త‌ల్ప‌డే, స‌హాయ న‌టుడు అలోక్ నాథ్ ల‌పై కేసులు బుక్ అయ్యాయి. వీరితో పాటు మొత్తం 13 మందికి ఈ కేసుతో సంబంధం ఉంది.

ఇంత‌కీ ఈ కేసు ఏమిటి? అంటే.. కోఆప‌రేటివ్ సొసైటీ పేరుతో పెద్ద మొత్తంలో డ‌బ్బు సేక‌రించి, తిరిగి చెల్లింపులు చేయ‌లేనందున‌ మోసం, న‌మ్మ‌క ద్రోహం కేసులు న‌మోదు చేసారు. వివ‌రాల్లోకి వెళితే.. సోనెపట్ జిల్లాలోని ముర్తల్ వద్ద క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ దారుణ మోసానికి పాల్ప‌డింది. మోసం, నమ్మక ద్రోహం, మోసగించి ఆస్తి బదిలీ చేసార‌ని నటులు అలోక్ నాథ్ , శ్రేయాస్ తల్పాడే సహా 13 మందిపై కేసు నమోదు చేసామ‌ని పోలీసులు తెలిపారు. ఈ ఇద్ద‌రు నటులు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ కి చెందిన కంపెనీగా నమోదైన `హ్యూమన్ వెల్ఫేర్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ`కి బ్రాండ్ అంబాసిడర్లు.

మల్టీస్టేట్ కోఆపరేటివ్ సొసైటీ చట్టం- 2002 కింద నమోదైన సహకార సంఘం 16 సెప్టెంబర్ 2016 నుండి హర్యానా సహా అనేక రాష్ట్రాల్లో చురుగ్గా పనిచేస్తుందని పేర్కొన్న సోనెపట్ నివాసి విపుల్ ఆంటిల్ ఫిర్యాదు మేర‌కు జనవరి 22న కేసు నమోదు అయింది. ఇద్దరు నటులు సొసైటీని ప్రోత్సహించారని, అందులో పెట్టుబడి పెట్టాలని, అధిక రాబడిని పొందాలని ప్రజలను విజ్ఞప్తి చేశార‌ని అత‌డు ఆరోపించాడు. హ్యూమన్ వెల్ఫేర్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అధిక రాబడి హామీతో ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డి) .. రిటర్నింగ్ డిపాజిట్ పథకాలను అందిస్తుందని ఫిర్యాదుదారుడు ఆరోపించారు. శిక్షణ పేరుతో పెట్టుబడిదారులను ఆకర్షించడానికి సొసైటీ హర్యానాలోని వివిధ నగరాల్లోని లగ్జరీ హోటళ్లలో సెమినార్లు నిర్వహించింది.

``ఈ సొసైటీకి మహేంద్రగఢ్‌లో రాష్ట్ర ప్రధాన కార్యాలయం.. హర్యానా అంతటా 250 కి పైగా కార్యాలయాలు ఉన్నాయి, ఇక్కడ పెట్టుబడిదారులు డబ్బు డిపాజిట్ చేస్తున్నారు. ఈ సొసైటీ పెట్టుబడిదారుల డబ్బు సురక్షితంగా ఉందని, మెచ్యూరిటీ మొత్తం సకాలంలో రిలీజ‌వుతుందని హామీ ఇచ్చింది. ప్రారంభంలో ఇది ఏజెంట్లకు ప్రోత్సాహకాలను అందించింది కానీ 2023లో ఆ పద్ధతిని నిలిపివేసింది. దీని తర్వాత మెచ్యూరిటీ తీరిన బాండ్ల మొత్తాన్ని పెట్టుబడిదారులకు విడుదల చేయడంలో ఆలస్యం జరిగింది. ఈ స‌మ‌స్య మ‌రింత ఎక్కువైంది. ఇప్పుడు వారి కార్యాలయాలు మూసేసారు. యజమానుల జాడ కనిపించడం లేదు!`` అని యాంటిల్ ఫిర్యాదులో తెలిపారు.

మోసపోయిన ఫిర్యాదుదారుడు అతని సోదరుడు అమిత్ వారి కుటుంబ సభ్యులు, బంధువుల నుండి డబ్బు తీసుకొని సొసైటీలో రూ.4.33 కోట్లు పెట్టుబడి పెట్టారు. బంధువులంతా ఇప్పుడు వారి డబ్బును తిరిగి డిమాండ్ చేస్తున్నారు. ముర్తల్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ దేవేందర్ కుమార్ మాట్లాడుతూ... న‌టులు నరేందర్ నేగి (ఇండోర్ నుండి సొసైటీని నిర్వహించేవారు), సమీర్ అగర్వాల్ (దుబాయ్), పప్పు శర్మ, ఆకాష్ శ్రీవాస్తవ, హర్యానాలో సొసైటీ అధిపతులు ఇద్దరూ సహా 13 మంది నిందితులపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 316(2), 318(2) - 318(4) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇందులో నిజాలు నిగ్గు తేలుస్తామ‌ని పోలీసులు హామీ ఇచ్చారు. ప్ర‌స్తుతానికి వారంతా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసారు..అని తెలుస్తోంది.

Tags:    

Similar News