ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు.. రియల్ ఎమోషన్

గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో ‘చావా’ థియేటర్లలో ప్రేక్షకుల భావోద్వేగానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Update: 2025-02-19 01:30 GMT

ఈ రోజుల్లో సినిమాల పబ్లిసిటీ కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఏది వాస్తవమో, ఏది క్రియేషనో అర్థం కాని పరిస్థితి. థియేటర్లలో పెయిడ్ బ్యాచ్‌లను పెట్టించి.. సినిమాలు చూసి తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నట్లు, స్టాండింగ్ ఒవేషన్లు ఇస్తున్నట్లు వీడియోలు తీసి వాటిని ప్రమోషన్ కోసం ఉపయోగించడమూ చూస్తున్నాం. కానీ ఏది రియల్ ఎమోషన్, ఏది ఫేక్ అని తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పుడు ‘చావా’ అనే సినిమాకు వస్తున్న స్పందనలో మాత్రం రవ్వంత కూడా అతిశయోక్తి లేదన్నది ఆ సినిమా చూసిన వారు చెబుతున్న మాట.

గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో ‘చావా’ థియేటర్లలో ప్రేక్షకుల భావోద్వేగానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎంతోమంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. గట్టిగా నినాదాలు చేస్తున్నారు. ఇలాంటి వేల వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.

ఐతే లెజెండరీ కింగ్ ఛత్రపతి శివాజీ పేరెత్తితే చాలు.. మరాఠీలు తీవ్ర భావోద్వేగానికి గురవుతారన్న విషయం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నిజానికి శివాజీ గురించి పుస్తకాల్లో చదివినపుడు ప్రాంతం, భాష బేధం లేకుండా ఆయన పట్ల ఆరాధన భావం కలుగుతుంది. అలాంటిది మరాఠీలు శివాజీ, ఆయన వారసుల గురించి గర్వపడడం, ఉద్వేగానికి గురి కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. శివాజీ గురించి చాలా రచనలు, సినిమాలు ఉన్నాయి కానీ.. ఆయన తనయుడు శంబాజీ కూడా అంతే గొప్పవాడని చరిత్రకారులు చెబుతారు.

హిందూ సంస్కృతి కోసం ప్రాణం పెట్టి పోరాడిన ఘనుడిగా ఆయన గురించి ప్రస్తావిస్తారు. ఆయన కథను ‘చావా’ మేకర్స్ అత్యద్భుతంగా చిత్రీకరించడం, విక్కీ కౌశల్ అంతే గొప్పగా ఆ పాత్రను పండించడం.. సినిమాలో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను కదిలించేయడం, ఆవేశానికి గురి చేస్తుండడంతో థియేటర్లలో ప్రేక్షకులు ఆ భావోద్వేగాలన్నీ బయటపెట్టేస్తున్నారు. సంబంధిత వీడియోలే ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఈ వీడియోలే సినిమాకు మంచి ప్రమోషనల్ మెటీరియల్‌గా మారుతూ.. మరింతమంది సినిమా చూసేలా చేస్తున్నాయి. ఇంతకుముందు ‘కశ్మీర్ ఫైల్స్’ కూడా ఇలాగే చాలామందిని థియేటర్లకు తీసుకువచ్చింది.

Tags:    

Similar News