చిరంజీవికి ఆ పేరు పెట్టడం వెనక మిరాకిల్
మెగాస్టార్ అసలు పేరు శివశంకర వరప్రసాద్. కానీ ఆయన పేరు `చిరంజీవి`గానే పాపులర్. అసలు చిరంజీవి అనే పేరు ఎలా వచ్చింది? అంటే దానివెనక ఉన్న ఆసక్తికర స్టోరీని మెగాస్టార్ స్వయంగా వెల్లడించారు.;

మెగాస్టార్ అసలు పేరు శివశంకర వరప్రసాద్. కానీ ఆయన పేరు `చిరంజీవి`గానే పాపులర్. అసలు చిరంజీవి అనే పేరు ఎలా వచ్చింది? అంటే దానివెనక ఉన్న ఆసక్తికర స్టోరీని మెగాస్టార్ స్వయంగా వెల్లడించారు. ఆయన ఫేస్ బుక్ లో షేర్ చేసిన ఓ వీడియోలో ఆశ్చర్యం కలిగించే షాకింగ్ నిజాలు చెప్పుకొచ్చారు. తన పేరు వెనక ఉన్న `కల` గురించి, `దైవం` గురించి ఆయన స్వయంగా తెలిపారు.
సినిమా యాక్టర్ అయిపోతే శివశంకర వరప్రసాద్ అనే పేరును పిలవడం కష్టం. అలా అని శివ అనో, శంకర్ అనో లేదా ప్రసాద్ అనో పెట్టుకుంటే రొటీన్ గా వినిపించే పేర్లు కదా! అని ఆలోచించే క్రమంలో ఎప్పుడో ఏదో ఒక రోజు అనుకోకుండా ఒక కల వచ్చింది. నేను రాముల వారి టెంపుల్ లో గర్భగుడి దగ్గర సొమ్మసిల్లి పడుకున్నట్టుగా, నిదురపోతూ ఉన్నాను. ఆ సమయంలో ఎవరో ఒక 10 ఏళ్ల పాప.. ఏయ్ చిరంజీవి ఏంటయ్యా ఇక్కడ పడుకున్నావ్. టైమ్ అయిపోయింది .. ఇక్కడి నుంచి వెళ్లిపో! అని అంది. లేచి చూట్టూ వాతావరణం చూసేసరికి గుడిలో ఉన్నాను. ఇక్కడ ఉన్నానేంటి? అనుకున్నాను. కానీ ఈ అమ్మాయి చిరంజీవి అని పిలవడమేంటి? నా పేరు అది కాదు కదా! ఆ పేరు పెట్టి పిలవడమేంటి? అనుకున్నాను. ఇంతలోనే బయటి వైపు కాంపౌండ్ వాల్ పై నుంచి నా ఫ్రెండ్ అదే పేరు పెట్టి పిలిచాడు. ``చిరంజీవి రా.. వెళదాం రా`` అని పిలిచాడు. ఇదేంటి అందరూ ఆ పేరుతో పిలుస్తున్నారు. అసలు చిరంజీవి అనే పేరు ఉందనే తెలీదు. కానీ అలా పిలుస్తున్నారు అని ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత కల నుంచి బయటపడ్డాను.
మరుసటి రోజు అమ్మతో నా కల గురించి చెప్పాను. అయితే నువ్వేదో అందరికీ తెలీని పేరు పెట్టుకోవాలని అనుకుంటున్నావు కదా! రాముడి గుడిలో పడుకున్నావు కాబట్టే ఈ కల వచ్చింది. నువ్వు ఆంజనేయ స్వామి భక్తుడివి కదా.. ఆంజనేయుడు అంటేనే చిరంజీవి. కాబట్టి నువ్వు ఆ పేరు పెట్టుకుంటే బావుంటుంది అని చెప్పింది. దైవాన్ని నమ్మే ఒక భక్తుడిగా వెంటనే నేను ఆ పేరు పెట్టుకున్నాను.. అని చిరంజీవి తెలిపారు. ఆరోజు ఆ కల రాకపోయి ఉంటే, చిరంజీవి అనే పేరు ఉండేదో లేదో తెలీదు.. కానీ ఆ కల, రాములోరు, ఆంజనేయుడు ఈ పేరు పెట్టుకోవడానికి కారణం. ఇంట్రెస్టింగ్ కదూ!