జనసేన జై కొట్టిన మెగాస్టార్.. మొదటిసారి ఇలా..
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల విశ్వక్సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హాజరై అభిమానులను ఉత్సాహపరిచారు.
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల విశ్వక్సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హాజరై అభిమానులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి చేసిన కొన్ని వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్‌లో భారీ చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా ఆయన జనసేన గురించి చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఉత్సాహం నింపాయి. రాజకీయాల నుంచి దూరంగా ఉంటూ సినీ ప్రపంచంలో తనదైన శైలిలో కొనసాగుతున్న మెగాస్టార్, మళ్లీ రాజకీయ ప్రస్తావన తీసుకురావడం ఆసక్తికరంగా మారింది.
చిరంజీవి స్టేజ్‌పై మాట్లాడుతుండగా, అభిమానులంతా ఒక్కసారిగా "జై జనసేన" అంటూ నినాదాలు చేయడం గమనార్హం. ఈ నినాదాలను చూసిన చిరంజీవి కూడా స్పందించి "జై జనసేన" అంటూ తన స్వరంతో సమాధానం ఇచ్చారు. ఇది మెగా అభిమానులకు ఒక ఎమోషనల్ మూమెంట్‌గా మారింది. చిరంజీవి నోట జై జనసేన నినాదం రావడం ఇదే తొలిసారి కావడం గమనించాల్సిన విషయం. అయితే, అంతటితో ఆగకుండా తన గత రాజకీయ ప్రయాణాన్ని కూడా స్వల్పంగా ప్రస్తావించారు.
విశ్వక్సేన్ నాన్న కరాటే రాజు గారు 18 ఏళ్లుగా తెలుసని, ప్రజారాజ్యం సమయం నుంచి తమ ఇద్దరి మధ్య పరిచయం ఉందని అన్నారు. ఇక ఆ క్రమంలో "నాటి ప్రజారాజ్యం పార్టీనే జనసేనగా రూపాంతరం చెందింది" అని చేసిన కామెంట్ అభిమానుల్లో ఆసక్తిని రేపింది. చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. 2009 ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత పరిస్థితులు అనుకూలించకపోవడంతో 2011లో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.
అప్పటి నుంచి ఆయన మళ్లీ రాజకీయ ప్రస్తావన తీసుకురాలేదు. కానీ, ఇప్పుడు తన నోట ఈ వ్యాఖ్యలు రావడం జనసేన శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచింది. ఇక లైలా సినిమా విషయానికి వస్తే, ఈ చిత్రంలో విశ్వక్సేన్ పూర్తిగా కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. లేడీ గెటప్‌లో కనిపించనున్న విశ్వక్ పాత్రపై మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమాను రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తుండగా, ఆకాంక్ష శర్మ కథానాయికగా నటిస్తోంది. ఫిబ్రవరి 14న సినిమా విడుదల కాబోతుంది.
చిరంజీవి వ్యాఖ్యలు మెగా ఫ్యామిలీ అభిమానులను ఎంతగానో ఉత్సాహపరిచాయి. రాజకీయాల గురించి మాట్లాడిన చిరు, జనసేన పేరును ప్రస్తావించడంతో పవన్ కల్యాణ్ అభిమానులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ ఈమధ్య రాజకీయాల గురించి మాట్లాడడం లేదు, కానీ ఈసారి ఆయన నోట వీటి ప్రస్తావన రావడంతో అన్నయ్య తమ్ముడు బాండింగ్ మరింత బలంగా మారినట్లు అర్ధమవుతుంది. మారి భవిష్యత్తు రాజాకీయాల్లో ఈ బంధం ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.