ఇది అన్ స్టాపబుల్.. బాలకృష్ణ షోకు ముఖ్య అతిథిగా చిరంజీవి

మూడు సీజన్లు పూర్తయిన అన్ స్టాపబుల్.. నాలుగో సీజన్ కు సిద్ధం అవుతోంది.

Update: 2024-08-10 10:17 GMT

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నుంచి ఆయన శిష్యుడైన దర్శక ధీరుడు రాజమౌళి వరకు వచ్చారు.. బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ నుంచి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వరకు వచ్చారు.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరకు వచ్చారు.. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నుంచి యంగ్ ప్రొడ్యూసర్ల వరకు ఎందరో వచ్చారు.. కానీ.. ఆ టాక్ షోకు ఆ ‘ఒక్కరు’ వస్తే.. ఆ లెక్కే వేరు.. అది హోస్ట్ చేసేది బాలకృష్ణ కాబట్టి.. దాని పేరు అన్ స్టాపబుల్ కాబ్టటి.. ఇప్పుడీ అన్ స్టాపబుల్ షో గురించి అదిరిపోయే అప్ డేట్. అది కూడా మామూలుగా అదిరిపోయేది కాదు..

పాన్ వరల్డ్ సినిమా..

మూడు సీజన్లు పూర్తయిన అన్ స్టాపబుల్.. నాలుగో సీజన్ కు సిద్ధం అవుతోంది. మధ్యలో ఎన్నికలు రావడంతోనో, మరే కారణానో ఈ షో రెగ్యులర్ గా రాలేదు. అయితే, ఆ లోటును భర్తీచేస్తూ రెట్టింపు జోష్ నింపేలా బాలకృష్ణ ఆతిథ్యంతో దూసుకురానుంది. పనులు పూర్తి చేసుకున్న నాలుగో సీజన్.. అదిరిపోయే సర్ ప్రౌజ్ ఇవ్వనున్నదన్నమాట. అదే తెలుగు ఇండస్ట్రీ మెగాస్టార్ చిరంజీవి.. బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకు ముఖ్య అతిథిగా రానుండడం. కాగా.. ఈ నెల 22న గురువారం చిరంజీవి 69వ పుట్టిన రోజు జరగనుంది. ఈ నేపథ్యంలోనే అన్ స్టాపబుల్ షో ఉంటుందా..? లేక ఆ రోజున ఏదైనా ప్రకటన ఉంటందా? అనేది తెలియాల్సి ఉంది. ఈ షోకు ఏడాదిన్నర కిందటనే చిరంజీవి తమ్ముడు, ఏపీ ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరైన సంగతి తెలిసిందే. చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ కు చెందిన అహా ఓటీటీలో ఈ షో ప్రసారం అవుతోంది. అరవింద్ హాజరైన సందర్భంలోనే.. తాను మీ ఇద్దరి (బాలయ్య, చిరంజీవి)తో కలిసి సినిమా తీయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అలాగైతే అది పాన్ వరల్డ్ సినిమా అవుతుందని బాలయ్య చెప్పడం విశేషం.

ఇద్దరు ఢీ అంటే ఢీ..

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి, యువ రత్న నుంచి నట సింహంగా ఎదిగిన బాలకృష్ణది చెరగని ముద్ర. 1980, 1990ల్లో ఇద్దరూ ఢీ అంటే ఢీ అని తలపడ్డారు. మాస్ కు పర్యాయపదంగా నిలిచారు. ఇద్దరి ఫ్యాన్స్ కూడా తీవ్రంగా పోటీ పడేవారు. కాగా, సినిమా కార్యక్రమాలు, ఇతర వేడుకల సందర్భంగా ఇద్దరు హీరోలు కలిసినా.. ఒక టాక్ షోలో ఇద్దరూ కనిపించడం ఇదే తొలిసారి. అది అందరు అభిమానులకు అత్యంత వినోదం పంచనుంది. అయితే, అన్ స్టాపబుల్ నాలుగో సీజన్ లో చిరుతో పాటు మరో టాప్ స్టార్, వారి సమకాలీనుడు అయిన నాగార్జున కూడా పాల్గొంటారని సమాచారం. ఇంకా సర్ ప్రైజ్ లు ఉంటాయని చెబుతున్నారు. అంటే.. వెంకటేష్ కూడా హాజరవుతారా? అనేది చూడాలి. అయితే ఆహా నుంచే దీనిపై ప్రకటన రావాల్సి ఉంది.

Tags:    

Similar News