ఇంద్ర టీమ్‌కు చిరు సత్కారం
తన దర్శకనిర్మాతలను గౌరవించడం, వారిని సందర్భానుసారం సత్కరించడం వంటివి మెగాస్టార్ లో ఒదిగి ఉండే స్వభావాన్ని హైలైట్ చేస్తాయి.
తన దర్శకనిర్మాతలను గౌరవించడం, వారిని సందర్భానుసారం సత్కరించడం వంటివి మెగాస్టార్ లో ఒదిగి ఉండే స్వభావాన్ని హైలైట్ చేస్తాయి. తనకు అద్భుతమైన సినిమాలను ఇచ్చిన తన దర్శకులు, నిర్మాతలను సత్కరించుకునేందుకు ఏ ఒక్క అవకాశం ఉన్నా ఆయన వదిలిపెట్టరు. ఇప్పుడు ఇంద్ర దర్శకనిర్మాతలు బి.గోపాల్, అశ్వనిదత్ లను, రచయిత చిన్ని కృష్ణ, పరుచూరి సోదరులు, మణిశర్మ ప్రభ్రుతులను తన ఇంటికి ఆహ్వానించి మరీ సన్మానించారు మెగాస్టార్ చిరంజీవి.
నిన్న చిరు పుట్టినరోజు ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని `ఇంద్ర` చిత్రాన్ని థియేటర్లలో రీ-రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. విడుదలకు ముందే ప్రీటికెట్ సేల్ అద్భుతం అన్న టాక్ వచ్చింది. 24 జూలై 2002లో ఇంద్ర విడుదలై బంపర్ హిట్టు కొట్టింది. మెగస్టార్ చిరంజీవి కెరీర్ లో మరపురాని విజయాన్ని ఇచ్చిన చిత్రమిది. అప్పట్లో పలు ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసింది. దాదాపు 22ఏళ్ల తర్వాత తిరిగి ఈ సినిమాని థియేటర్లలో వీక్షించడం అభిమానులకు థ్రిల్ ని కలిగిస్తోంది.
తాజాగా సన్మానం అందుకున్న వారితో చిరు ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలను చిరంజీవి X ప్రొఫైల్‌లో షేర్ చేసారు. ``ఇంద్ర సృష్టించిన సునామీని గుర్తు చేసుకుంటూ 22 ఏళ్ల తర్వాత థియేటర్లలో విడుదలవుతున్న సందర్భంగా ఇంద్ర టీమ్‌కి చిరు సత్కారం!``అని రాసారు. ఇంద్ర కచ్చితంగా టీమ్‌కు, ప్రేక్షకులకు, అభిమానులకు అనేక ప్రత్యేకమైన రికార్డులతో మరపురాని క్షణాలను సృష్టించింది. ఆ అందమైన జ్ఞాపకాలలో కొన్నింటిని ఆస్వాధించాను! అని చిరంజీవి తన X ప్రొఫైల్‌లో రాశారు. చిరు ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.