ఫ్యాన్‌ను పక్కకు నెట్టేసిన చిరంజీవి.. వీడియో వైరల్!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. తాజాగా చిరు తన ఫ్యామిలీతో కలిసి ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తుండగా, విమానాశ్రయ సిబ్బంది కొందరు ఆయనతో ఫొటోలు దిగడానికి ఆసక్తి కనబరిచారు. అందులో ఒకరు తన మొబైల్ ఫోన్ తో సెల్ఫీ తీసుకోడానికి ప్రయత్నించగా.. చిరంజీవి అతన్ని మెల్లగా పక్కకి నెట్టడం ఈ వీడియోలో కనిపిస్తోంది.
అభిమానిని పక్కకు తోసేసిన చిరంజీవి అంటూ ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అంత పెద్ద హీరో అయ్యిండి, సెల్ఫీ తీసుకునే వ్యక్తి పట్ల అలాంటి దురుసు ప్రవర్తన సరికాదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. "సెలబ్రెటీ ఎవరైనా ఒక్కటే. ఆఫ్ కెమెరాలో అది చిరంజీవి అయినా ఇంకెవరైనా.. ముందు వాళ్ళని అంత ఎత్తులో చూడడం మానేయాలి. నీ కంటే హీరో ఎవరు ఉండరు అనే ఆత్మాభిమానం ఉండాలి" అని ఓ నెటిజన్ ఈ వీడియోపై కామెంట్ పెట్టారు.
నిజానికి చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి వస్తున్నప్పుడు, పర్మిషన్ కూడా అడగకుండా ఆ వ్యక్తి ఫోటో కోసం ట్రై చేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది. చిరు అవేమీ పట్టించుకోకుండా ముందుకు నడిచారు. అయినా సరే ఆ వ్యక్తి మళ్ళీ చిరుకు అడ్డుగా వచ్చి సెల్ఫీ ఫోటో తీసుకునే ప్రయత్నం చేసాడు. దీంతో చిరు కాస్త విసుగు చెంది అతన్ని నెమ్మదిగానే పక్కకు నెట్టడం కనిపించింది. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అడ్డంగా వస్తే ఎవరైనా అలానే రియాక్ట్ అవుతారని, అందులో తప్పుబట్టాల్సిన పనిలేదని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
పారిస్ వేదికగా అట్టహాసంగా జరుగుతున్న ఒలంపిక్స్ క్రీడలను ప్రత్యక్షంగా చూసేందుకు చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి ఫ్రాన్స్ రాజధానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఫారిన్ ట్రిప్ పూర్తి చేసుకొని చిరు ఇండియాకి తిరిగి వస్తున్నారు. ప్రయాణం చేయడం వల్ల ఎంత పెద్ద. సెలబ్రిటీ అయినా కాస్త అలసటగా ఫీల్ అవ్వడం సహజమే. అందులోనూ ఆ వ్యక్తి కనీసం చిరుతో ఒక ఫోటో కావాలని కూడా అడకుండా మీద పడిపోతున్నట్లు వీడియోలో కనిపించింది కాబట్టి, చిరు చేసిన దాంట్లో తప్పులు వెతకడం సరికాదని ఫ్యాన్స్ అంటున్నారు.
అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరైనా అసహనానికి గురవుతారని, ఇక్కడ మెగాస్టార్ ను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అందులోనూ తన భార్యతో కలిసి వస్తున్నప్పుడు అందరూ ముందు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలనే ఆలోచిస్తారని వ్యాఖ్యానిస్తున్నారు. అభిమానులతో ఫోటోలు దిగడానికి చిరంజీవి ఎప్పుడూ ముందే ఉంటారని అంటున్నారు. గతంలో ‘అలయ్ బలయ్’ వేదికపై ఫ్యాన్స్ అడగడంతో సెల్ఫీలు దిగిన కారణంగానే అనవసరంగా గరికపాటితో చిరు మాటలు పడ్డారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇటీవల కింగ్ అక్కినేని నాగార్జున ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తున్నప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఓ వ్యక్తి నాగ్ ను కలవడానికి ప్రయత్నించగా.. వెంటనే పక్కనున్న బౌన్సర్ ఒకరు అతన్ని పట్టుకుని పక్కకి లాగేయడంతో కింద పడిపోయాడు. నాగార్జున అది గమనించకుండా ముందుకి వెళ్ళిపోయారు. ఈ వీడియో తన దృష్టికి రావడంతో నాగ్ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశారు. అతనికి సారీ చెప్పడమే కాదు, తర్వాతి రోజు పిలిచి మరీ ఫోటో దిగారు. ఇప్పుడు అలాంటి ఘటనే చిరంజీవికి ఎదురవ్వడం గమనార్హం. దీనిపై చిరు స్పందిస్తారేమో చూడాలి.