చిరు కోసం రావిపూడి అలాంటి స్క్రిప్ట్?

చిరు, అనిల్ రావిపూడిల సినిమాను తానే నిర్మిస్తానని షైన్ స్క్రీన్స్ నిర్మాత సాహు గారపాటి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

Update: 2024-12-29 10:30 GMT

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఘ‌రానా మొగుడు, రౌడీ అల్లుడు కెరీర్ బెస్ట్ హిట్‌ల‌ జాబితాలో టాప్ లో నిలుస్తాయి. చిరు కెరీర్‌ని పీక్స్‌కి తీసుకెళ్లిన చిత్రాలివి. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు మెగాస్టార్ కి వ‌రుస సంవ‌త్స‌రాల‌లో మూడు బిగ్గెస్ట్ హిట్ చిత్రాల‌ను అందించారు. జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి(1990) లాంటి క్లాసిక్ హిట్ త‌ర్వాత రౌడీ అల్లుడు(1991), ఘ‌రానా మొగుడు(1992) లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్లు అందించారు. ఈ సినిమాలు చిరులో ఎన‌ర్జీని, కామెడీ టింజ్‌ను మ‌రో స్థాయిలో ఎలివేట్ చేసాయి.

'ఘ‌రానా మొగుడు', 'రౌడీ అల్లుడు'లో రాఘ‌వేంద్ర‌రావు మార్క్ కామెడీ పండించిన చిరు, మ‌రో సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు కోదండ రామిరెడ్డి సినిమాల్లోను అద్భుత‌మైన కామెడీ, ఎమోష‌న్స్ ని పండించారు. 1990 కంటే ముందే కోదండ రామిరెడ్డి ప‌సివాడి ప్రాణం, దొంగ మొగుడు, అత్త‌కు య‌ముడు అమ్మాయికి మొగుడు లాంటి క్లాసిక్ హిట్ చిత్రాలను చిరుకి అందించారు. చిరులోని అద్భుత‌మైన కామెడీ టింజ్ ని ఈ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు వెండితెర‌పై ఆవిష్క‌రించారు. ఆహ్లాద‌క‌ర‌మైన కామెడీతో చిరు అల‌రించారు. హాస్య బ్ర‌హ్మ జంధ్యాల ర‌చ‌న‌, కె.విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఆప‌ద్భాంద‌వుడు లాంటి జాతీయ అవార్డ్ చిత్రంలోను చిరంజీవి న‌టించారు. ఈ సినిమాలో చిరంజీవి మార్క్ కామెడీని తెలుగు ప్రేక్ష‌కులు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. చంట‌బ్బాయి సినిమాలో చిరంజీవి క్లీన్ కామెడీతో అల‌రించారు. ఈ సినిమాకి జంధ్యాల స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

2005లో 'జై చిరంజీవ', 'అంద‌రివాడు' సినిమాల్లో చిరంజీవి త‌న‌దైన‌ కామెడీతో మెప్పించారు..ఇప్పుడు అనీల్ రావిపూడి మార్క్ కామెడీ అంటున్నారు.. ఇటీవ‌ల కొంత కాలంగా అనీల్ రావిపూడి స్క్రిప్టు తుది మెరుగులు దిద్దుకుంటోంద‌ని, చిరు ఇంకా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వాల్సి ఉంద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఈ నేప‌థ్యంలో అనీల్ రావిపూడి మెగాస్టార్ ని పెద్ద తెర‌పై ఎలా చూపించ‌బోతున్నారు? అన్న‌ది ఆస‌క్తిగా మారింది. విక్ట‌రీ వెంక‌టేష్ కి 'ఎఫ్ 2' ఫ్రాంఛైజీలో ఫ‌న్ ఎంట‌ర్ టైన్ మెంట్ తో మంచి హిట్ చిత్రాల‌ను అందించిన అనీల్ రావిపూడి నంద‌మూరి బాల‌కృష్ణ‌కు 'భ‌గ‌వంత్ కేస‌రి'తో బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందించారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని ఎలాంటి పాత్ర‌లో ఎలివేట్ చేస్తారో వేచి చూడాల్సి ఉంది.

న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు కోదండ రామిరెడ్డి, జంధ్యాల‌ లాంటి సీనియ‌ర్ల స్ఫూర్తితో క్లీన్ కామెడీ హిట్ తీయాల్సి ఉంటుంది.. చిరు ఏజ్, ఇమేజ్ దృష్ట్యా అనీల్ రావిపూడి ఆహ్లాద‌క‌ర‌మైన కామెడీ సినిమా తెర‌కెక్కిస్తార‌ని అభిమానుల్లో చ‌ర్చ సాగుతోంది.

2026లోనే పాజిబుల్:

చిరు, అనిల్ రావిపూడిల సినిమాను తానే నిర్మిస్తానని షైన్ స్క్రీన్స్ నిర్మాత సాహు గారపాటి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ ''ఈ సినిమాలో ఎలాంటి సందేశం ఉండదు. కామెడీ, యాక్షన్ అంశాలతో కూడిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ ఇది. మేమంతా చిరంజీవి గారి సినిమాలు చూస్తూ, ఆయన ట్రేడ్ మార్క్ ఎలిమెంట్స్ ని ఎంజాయ్ చేస్తూ పెరిగాం. అనిల్‌తో సినిమా మనం మెగాస్టార్‌ని చూడాలనుకునే స్టైల్‌లో ఉంటుంది'' అన్నారు. ఇందులో అనిల్ రావిపూడి సిగ్నేచర్ కామెడీ ఉంటుందని, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని సాహు గారపాటి తెలిపారు. చిరంజీవి ఇటీవ‌ల 'విశ్వంభర'తో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది శ్రీకాంత్ ఓదెల, మోహన్ రాజాతో కలిసి పని చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన తర్వాత అనిల్ రావిపూడి సినిమాని ప్రారంభించే అవకాశం ఉంది.

Tags:    

Similar News