హరీష్ శంకర్, చోటా భాయ్.. ఇలా ఫ్రెండ్లీగా..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడుల మధ్య వివాదం గురించి తెలిసిందే.

Update: 2024-06-14 12:30 GMT

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడుల మధ్య వివాదం గురించి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ రామయ్య వస్తావయ్యా సినిమాకు గాను వీరిద్దరు కలిసి వర్క్ చేశారు. ఆ సమయంలో ఏం జరిగిందో తెలియదు కానీ.. రీసెంట్ ఇంటర్వ్యూలో చోటా కె నాయుడు పలు వ్యాఖ్యలు చేశారు. రామయ్య వస్తావయ్యా సినిమా చేస్తున్న సమయంలో హరీష్ శంకర్ ప్రతి పనికి తనకు అడ్డుపడేవాడని, తన మాట పట్టించుకునేవాడు కాదని ఆరోపించారు.

అయితే ఆ తర్వాత చోటా కామెంట్స్ పై ఫైర్ అవుతూ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు హరీష్ శంకర్. చోటా కె నాయుడితో కలిసి పనిచేయడంతో ఆయనకు ఉన్న అనుభవం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. అందుకే ఆయనంటే తనకు గౌరవమని దాన్ని నిలబెట్టుకోవాలంటూ కోరారు. లేదు ఇంకా అలాగే మాట్లాడతా అంటే ఎక్కడికైనా డిబెట్ కు వస్తానని చెప్పారు. తాను తప్పుగా మాట్లాడకపోయినా ఆయన(చోటా) మాట్లాడుతున్నట్లు ప్రెస్ నోట్ లో హరీష్ శంకర్ తెలిపారు.

దీంతో సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధంపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అయితే హరీష్ ప్రెస్ మీట్ పై చోటా మాత్రం స్పందించలేదు. ఇప్పుడు ఇద్దరి మధ్య ఉన్న వివాదం మొత్తం క్లియర్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా హరీష్ శంకర్- రవితేజ కాంబోలో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ మూవీ సెట్స్ కు చోటా కె నాయుడు వెళ్లారు. అక్కడ నవ్వుతూ సరదాగా హరీష్ తో గడిపారు. సెట్స్ అంతా కలియ తిరుగుతూ ఇద్దరూ మాట్లాడుకున్నారు.

అందుకు సంబంధించిన వీడియోను హరీష్ శంకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సెట్స్ కు వచ్చినందుకు చోటా కె నాయుడికి థ్యాంక్స్ చెప్పారు. "ధన్యవాదాలు చోటన్నా .. మా సెట్‌ ను సందర్శించినందుకు.. మీ బిజీ షెడ్యూల్‌ లో కూడా ప్రతిదీ నేరుగా చూసినందుకు.. హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం నెట్టింట హరీష్ శంకర్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. మీరిద్దరూ ఎప్పటికీ ఇలానే నవ్వుతూ ఉండాలని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

ప్రస్తుతం హరీష్ శంకర్.. మిస్టర్ బచ్చన్ మూవీతో బిజీ గా ఉన్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. 2024లోనే ఈ మూవీ విడుదల అవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, చోటా కె నాయుడు మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీ విశ్వంభరకు పని చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న ఆ సినిమా విడుదల కానుంది. మరి ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి విజయాలు సాధిస్తాయో చూడాలి.

Tags:    

Similar News