ఇండియా గురించి మిస్‌ వరల్డ్‌ ఏమన్నదంటే..!

మిస్ వరల్డ్‌ ఈవెంట్ నిర్వహణకు సంబంధించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మిస్ వరల్డ్‌ క్రిస్టినా పిస్కోవా పాల్గొన్నారు.;

Update: 2025-03-20 14:30 GMT

72వ మిస్ వరల్డ్‌ పోటీలు మే నెలలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ నిర్వహణ బాధ్యతను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఇటీవల మిస్ వరల్డ్‌ పోటీల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించేందుకు గాను హైదరాబాద్‌లో క్రిస్టినా పిస్కోవా బృందం పర్యటించారు. మిస్ వరల్డ్‌ ఈవెంట్ నిర్వహణకు సంబంధించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మిస్ వరల్డ్‌ క్రిస్టినా పిస్కోవా పాల్గొన్నారు. ఆ సందర్భంగా క్రిస్టినా మాట్లాడుతూ ఇండియాపై ప్రశంసలు కురిపించారు. ఇండియా ఒక గొప్ప దేశంగా ఆమె వ్యాఖ్యలు చేశారు.

మీడియా సమావేశంలో క్రిస్టినా మాట్లాడుతూ... అందాల పోటీలు ఇండియాలో జరగనుండటం సంతోషాన్ని కలిగించింది. ఇండియాకు వచ్చిన మాకు గొప్ప స్వాగతం లభించింది. నా మనసుకు నచ్చే విధంగా ఈ దేశం ఉందని, నా హృదయంలో ఈ దేశానికి ప్రాధాన్యత ఉందని చెప్పుకొచ్చింది. ఈ దేశంలో ఎన్నో భాషలు ఉన్నా కూడా అంతా ఒక్కటిగా కలిసి ఉండటం ఎంతో స్ఫూర్తిదాయకం. మిస్ వరల్డ్‌ పోటీలు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తాయని చెప్పుకొచ్చింది. భారత్‌ ఎన్నో విషయాల్లో ప్రపంచానికి స్ఫూర్తి దాయకంగా నిలవడం నిజంగా అభినందనీయం అని క్రిస్టినా మీడియా ముందు ప్రశంసలు కురిపించింది.

అందాల పోటీల ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయడంతో పాటు ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో స్మితా సభర్వాల్‌ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ తెలంగాణ గొప్పతనం గురించి ప్రస్తావించారు. తెలంగాణను త్రిలింగ దేశంగా పిలుస్తారని, 2500 ఏళ్ల చరిత్ర ఈ ప్రాంతానికి ఉందని స్మిత సభర్వాల్‌ అన్నారు. దేశంలో కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు అయి 11 ఏళ్లే అవుతున్నా అభివృద్దిలో ముందు ఉన్నామని అన్నారు. రామప్ప, వేయి స్తంభాల గుడి, గోల్కొండ, చార్మినార్ వంటి గొప్ప కట్టడాలు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు.

ఇండియాలో మిస్ వరల్డ్‌ పోటీలు జరగబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి హైదరాబాద్‌ పై ఉంది. ఈ మెగా ఈవెంట్‌కి బాలీవుడ్‌ నుంచి ప్రముఖులు హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఎప్పుడూ హైదరాబాద్‌లో మిస్ వరల్డ్‌ పోటీల నిర్వహణ జరగలేదు. దాంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర గౌరవం, హైదరాబాద్ ఖ్యాతి పెరిగే విధంగా ఇండియా గౌరవం పెంచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలకు ఈ ఈవెంట్‌ ఎంతో ప్రతిష్టాత్మకం.

Tags:    

Similar News