సెక్యూరిటీ వాళ్లే చంపేస్తారని టెన్షన్ పడ్డ నిర్మాత
బాలీవుడ్ లో రోషన్ ల చరిత్ర సుదీర్ఘమైనది. రోషన్ ల కుటుంబంపై నెట్ ఫ్లిక్స్ డాక్యు సిరీస్ ఇటీవల హాట్ టాపిక్ అయింది.;

బాలీవుడ్ లో రోషన్ ల చరిత్ర సుదీర్ఘమైనది. రోషన్ ల కుటుంబంపై నెట్ ఫ్లిక్స్ డాక్యు సిరీస్ ఇటీవల హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్ ని మాఫియా ఏల్తున్న రోజుల్లో చాలామంది సినీప్రముఖులను అంతర్గత భయాలు వెంటాడాయి. 2000లో ప్రముఖ హిందీ నిర్మాత రాకేష్ రోషన్ పై కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. మాఫియా అతడిని వెంటాడి వేటాడి చంపేందుకు ప్రయత్నించిందని బాలీవుడ్ మీడియాలో కథనాలొచ్చాయి.
నాటి ఘటనను మరోసారి తలుచుకున్న రాకేష్ రోషన్ తాను అడుగడుగునా అంతర్గత భయంతో ఎలా కంపించిపోయాడో తెలిపాడు. రాకేష్ రోషన్ ఇటీవల తన జీవితంపై శాశ్వత ప్రభావాన్ని చూపిన భయంకరమైన కాల్పుల సంఘటనను గుర్తుచేసుకున్నాడు. అది బ్యాడ్ డ్రీమ్ అని అన్నాడు. నేను బెదిరింపులను ఎదుర్కొన్న దానికంటే రక్షణ కోసం నియమించిన భద్రతా సిబ్బంది కారణంగా నిరంతరం భయంతో జీవించానని రోషన్ అంగీకరించాడు.
2000లో తనపై జరిగిన దాడి తర్వాత, తనకు రక్షణ కోసం సాయుధ భద్రతా సిబ్బందిని అందించారని ఏఎన్ ఐ ఇంటర్వ్యూలో రాకేష్ రోషన్ చెప్పార. అయితే తన రక్షణకు భరోసా ఇవ్వడానికి బదులుగా మిస్‌ఫైర్ అయ్యి ఏదో ఒక ప్రమాదం వారి వల్ల సంభవించి తన ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందనే ఆందోళనతో జీవించానని రోషన్ ఒప్పుకున్నాడు. ``చుట్టూ ఎంతమంది భద్రతా సిబ్బంది ఉన్నా, అప్పటికీ బహిరంగ లక్ష్యంగా ఉన్నాను. ఎవరైనా హాని చేయాలనుకుంటే, భద్రతా సిబ్బంది ఏమీ చేయలేరు`` అని రాకేష్ రోషన్ అన్నారు. అదనపు రక్షణ ఉన్నా కానీ, రోషన్ రోషన్ ఆ టెన్షన్స్ నుండి బయటపడలేకపోయాడు.
ఆ కష్టకాలంలో ఎన్నో ఎదురయ్యాయి. తాను కారు ముందు భాగంలో ఉన్నప్పుడు సెక్యూరిటీ గార్డులు వెనుక సీట్లో కూర్చునేవారు! వారి సమక్షంలో ఓదార్పు పొందే బదులు, తన వెనుక లోడ్ చేసిన ఆయుధాలతో కూర్చున్న సాయుధ వ్యక్తుల ఆలోచన అతడి భయాన్ని మరింత పెంచింది. తన చుట్టూ ఉన్న తుపాకుల గురించి నిరంతరం తెలుసుకోవడం వల్ల అతడు సురక్షితంగా ఉన్నాను అనుకునే కంటే దారుణ స్థితిలో ఉన్నట్లు అనిపించింది. బాత్రూమ్ కి వెళ్లినా, బీచ్ కి వెళ్లినా రోషన్ తన భద్రతా సిబ్బందిని మోయాల్సి వచ్చేదని అన్నాడు. తన సాధారణ బీచ్ నడకల సమయంలో, గార్డులు తనను దగ్గరగా అనుసరిస్తారని, తనను రక్షించడానికి బదులుగా వలయంలో చిక్కుకున్నట్లు భావించానని తెలిపాడు. ఈ క్లాస్ట్రోఫోబిక్ ఉనికి చివరికి తనపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆ తర్వాత ధైర్యంగా ఈ భద్రతా సిబ్బందిని తొలగించమని అభ్యర్థించాడు. దానితో వచ్చే ఆందోళన లేకుండా స్వేచ్ఛగా జీవించాలని నిర్ణయించుకున్నాడు. బీచ్ లోను ఇంతమంది గార్డులు దేనికి? ఏమి జరిగినా, నేను దానిని ఎదుర్కొంటానని నిర్ణయించుకున్నాను అని తెలిపాడు.
ఖూన్ భరి మాంగ్, కరణ్ అర్జున్, కోయ్లా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రాకేష్ రోషన్ బాలీవుడ్‌లో చెరగని ముద్ర వేశారు. కోయి... మిల్ గయా, క్రిష్ సిరీస్ తో అతడు రోషన్ ల గౌరవాన్ని మరింత పెంచాడు. ఈ ప్రాజెక్టులతో ఆయన తన కుమారుడు హృతిక్ రోషన్ కెరీర్‌ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన `ది రోషన్స్` అనే డాక్యుమెంట్-సిరీస్ విడుదలతో రోషన్ కుటుంబం అందరి దృష్టిని ఆకర్షించింది. హృతిక్ రోషన్, రాకేష్ రోషన్, రాజేష్ రోషన్ సహా వారి సినీకుటుంబం ప్రయాణంపై సిరీస్ ఇది.