గ్రౌండ్ జీరో టీజర్: ఆద్యంతం మరిగిస్తోంది
మురుగదాస్ సికందర్ ట్రైలర్ కంటే గోపిచంద్ మలినేని 'జాట్' టీజర్ ఆకట్టుకుందని ప్రశంసలు కురిసాయి.;

హృదయాన్ని మరిగించడం.. హృదయాన్ని రగిలించడం లేదా ఏదో ఒక బాధ సంతోషం అనే ఎమోషన్ కలిగించడం.. ఈ లక్షణాలు ఏవీ లేని ట్రైలర్ లేదా టీజర్ అస్సలు ఆకర్షించదు. అలాంటి ఒక ట్రైలర్ కి ఒక ఎమోషన్ రగిలించే టీజర్ కి మధ్య ఇటీవల పోలికలు చూస్తున్నారు ప్రజలు. సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ ట్రైలర్ తో, గదర్ ఫేం సన్నీడియోల్ మూవీ `జాట్` టీజర్ ని పోల్చి చూసారు. మురుగదాస్ సికందర్ ట్రైలర్ కంటే గోపిచంద్ మలినేని 'జాట్' టీజర్ ఆకట్టుకుందని ప్రశంసలు కురిసాయి.
ఇప్పుడు ఇమ్రాన్ హష్మీ నటించిన సినిమా టీజర్ కి అంతే మంచి ప్రశంసలు కురుస్తున్నాయి. హష్మి నటించిన గ్రౌండ్ జీరో టీజర్ హృదయాన్ని మరిగించింది. గుండెల్ని పిండేసే కంటెంట్ ఈ సినిమాలో ఉందని నిరూపించింది. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాని సల్మాన్ ఎలా వదులుకున్నారు? అనే చర్చ ఇప్పుడు వేడెక్కిస్తోంది. తొలుత గ్రౌండ్ జీరో కథను సల్మాన్ ఖాన్ కు నిర్మాతలు ఫర్హాన్ అక్తర్ - రితేష్ సిధ్వానీ వినిపించారు.
కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా సల్మాన్ వదులుకోగా ఇమ్రాన్ హష్మీ ఇందులో కథానాయకుడిగా నటించారు. ఇప్పుడు టీజర్ విడుదలైన తర్వాత సల్మాన్ ఇలాంటి అవకాశాన్ని వదులుకోవడం సరికాదని, ఆలోచనలో పడొచ్చని కూడా విశ్లేషిస్తున్నారు. అయితే సల్మాన్ క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా లేదా షెడ్యూలింగ్ సమస్యల కారణంగా నిరాకరించారా? అన్నది తెలియాల్సి ఉంది.
గ్రౌండ్ జీరో టీజర్ లో ఇమ్రాన్ హష్మీని బీఎస్ ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ నరేంద్ర నాథ్ దూబేగా కనిపించారు. అతడు ఒక రిస్కీ మిషన్ కి నాయకత్వం వహిస్తాడు. విజువల్స్ ఉద్రేకం పుట్టిస్తున్నాయి. యాక్షన్ పచ్చిగా అనిపిస్తుంది. ఇది రొటీన్ కమర్షియల్ సినిమా కాదు.. గ్రౌండ్ జీరో కేవలం యాక్షన్ ని మాత్రమే హైలైట్ చేయదు... ఒక సైనికుడి విధి నిర్వహణ, బాధ్యత గురించి చెబుతోంది. ఇప్పటికే టీజర్ సానుకూల స్పందనలను అందుకుంది. ఇమ్రాన్ హష్మీ సైనికుడిగా జీవించాడు. సల్మాన్ వదులుకున్నా ఇమ్రాన్ దీనిని క్యాచ్ చేయడం అతడికి బాగా కలిసొస్తోంది. ఈ చిత్రం 25 ఏప్రిల్ 2025న విడుదలకు సిద్ధమవుతోంది.