తస్మాత్ జాగ్రత్త! సితార పేరుతో ఫ్రాడ్!!
సితార ఘట్టమనేని పేరుతో ఇన్వెస్టిమెంట్ లింకులు పంపుతూ మోసానికి తెర తీసాడు ఆకతాయి మోసగాడు
ఆన్ లైన్ మోసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతిరోజూ సైబర్ క్రైమ్ ఆఫీసుల చుట్టూ రకరకాలుగా మోసపోయిన బాధితులు తిరుగుతూ కనిపిస్తున్నారు. ఎప్పుడు ఎవరి డబ్బును ఏ కేటుగాడు ఎలా కొట్టేస్తాడో ఊహించలేం. ఇటీవల ఆన్ లైన్ మోసాలు మరీ ఎక్కువయ్యాయి.
ఇప్పుడు ఏకంగా సెలబ్రిటీల పేరుతో ఇన్వెస్టిమెంట్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఘరానా మోసం చేస్తున్న ఘనాపాటీలపైనా సైబర్ సెల్ వారికి ఫిర్యాదులు అందుతున్నాయి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేనికి ఇన్ స్టా సహా ఆన్ లైన్ లో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఇప్పుడు ఒక మోసగాడు పన్నిన వల గురించి ఘట్టమనేని కుటుంబం సైబర్ క్రైమ్ సెల్ కి ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.
సితార ఘట్టమనేని పేరుతో ఇన్వెస్టిమెంట్ లింకులు పంపుతూ మోసానికి తెర తీసాడు ఆకతాయి మోసగాడు. అతడు ఎవరో కనిపెట్టాలని, ఇలాంటి ఆన్ లైన్ మోసగాళ్ల వలకు చిక్కొద్దని మహేష్ బాబు కుటుంబం అర్థించింది. ఆ మేరకు సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు కూడా చేసింది. సితార ఘట్టమనేని పేరుతో పెట్టుబడులు పెట్టాలని ఎవరైనా కోరితే అది మోసగాడి పని అని నిర్థారించుకోవాలని కూడా వారు కోరారు. సెలబ్రిటీ అకౌంట్స్ అధికారికమైనవేనా కాదా? పరిశీలించి మాత్రమే దానిని అనుసరించాలని కూడా కోరారు. మొత్తానికి సితార క్రేజ్ ను మోసగాళ్లు తెలివిగా ఎన్ క్యాష్ చేసుకోవాలని భావించారు. కానీ ఇంతలోనే మహేష్ బాబు కుటుంబం అలెర్ట్ అయి పోలీసులకు ఫిర్యాదు చేసారు.