దర్శన్‌పై ఛార్జిషీట్ లీకులు.. మీడియాపై హైకోర్టు నిషేధం!

కన్నడ హీరో దర్శన్ తూగుదీప ఒక హత్యలో ప్రమేయం ఉన్నందున అరెస్ట‌యి జైలులో ఉన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-09-11 09:39 GMT

కన్నడ హీరో దర్శన్ తూగుదీప ఒక హత్యలో ప్రమేయం ఉన్నందున అరెస్ట‌యి జైలులో ఉన్న సంగ‌తి తెలిసిందే. జూన్ లో ఈ విష‌యం వెలుగులోకి వచ్చింది. త‌న అభిమాని రేణుకా స్వామిని హత్య చేసాడ‌నేది ఆరోప‌ణ‌. ఈ కేసులో ద‌ర్శ‌న్ స‌హా అత‌డి ప్రియురాలు పవిత్ర గౌడను అరెస్టు చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇత‌రుల‌ను విచారిస్తున్నారు. ఇటీవ‌ల ద‌ర్శ‌న్ స‌హా ఇత‌రుల‌పై ఛార్జ్ షీట్ ఫైల్ కాగా, దానినుంచి చాలా విష‌యాల‌ను మీడియా వెలుగులోకి తెచ్చిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఈ లీకుల‌పై హైకోర్ట్ నిషేధం విధించింది. రేణుకా స్వామి కేసులో ఛార్జిషీట్‌కు సంబంధించిన విషయాలను ప్రసారం చేయకుండా మీడియా సంస్థలను నిషేధిస్తూ కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 10న జస్టిస్ హేమంత్ చందంగౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడు నంబర్ టూ దర్శన్ తూగుదీప లాయ‌ర్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ మధ్యంతర ఉత్తర్వులు వెలువడడం గమనార్హం. కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్ ద్వారా నమోదైన క్రైమ్ నం 0250 లేదా 2024కి సంబంధించి ఛార్జ్ షీట్‌లో ఉన్న రహస్య సమాచారాన్ని ప్రచురించడం, ముద్రించడం, ప్రసారం చేయడం, ప్రచారం చేయడం వంటి వాటిపై ప్రతివాదులుగా చేర్చుతూ 3 నుండి 40 వరకు మీడియా సంస్థలను ఈ వార్త‌లు ప్ర‌చారం చేయ‌కుండా కోర్టు నిషేధించింది. అంతేకాకుండా వారు త‌ప్పు రిపీట్ చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక కోర్టు హెచ్చరించింది.

ఇదిలా ఉండగా హ‌త్య కేసులో నిందితులుగా ఉన్న దర్శన్, పవిత్ర స‌హా ఇతరులకు బెంగుళూరు కోర్టు మరోసారి జ్యుడీషియల్ కస్టడీని 3 రోజులు పొడిగించడంతో వారికి ఎటువంటి ఉపశమనం ల‌భించ‌లేదు. సెప్టెంబర్ 9తో ముగియాల్సిన జ్యుడీషియల్ కస్టడీని ఇప్పుడు సెప్టెంబర్ 12 వరకు పొడిగించారు. జూన్ 11 నుండి ద‌ర్శ‌న్, పవిత్ర స‌హా ఇత‌రులు జ్యుడీషియల్ కస్టడీలో ఉండటం గమనార్హం. ఇక ప‌విత్ర‌కు అస‌భ్య‌క‌ర మెసేజ్ లు పంప‌డ‌మే ఈ హ‌త్య‌కు దారి తీసింద‌ని పోలీసులు తొలి నుంచి చెబుతున్నారు. ఛార్జ్ షీట్‌లోను ఇది నిజ‌మేన‌ని పేర్కొన్న‌ట్టు మీడియాలు క‌థ‌నాలు వేసాయి. రేణుకా స్వామిని తీవ్ర చిత్రహింసలకు గురిచేసినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించిందని ఛార్జ్ షీట్ పేర్కొంది. అతడి శరీరంలో అనేక గాయాలు ఉన్నాయి. చెవి చిరిగిపోయింది.. వృషణాలు పగిలిపోయాయి. అత‌డిని చెట్టు కొమ్మ‌తో బాధిన‌ట్టు ద‌ర్శ‌న్ అంగీక‌రించార‌ని కూడా మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. బాధితుడిపై భౌతిక దాడిలో దర్శన్ ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

Tags:    

Similar News