దాసరి బయోపిక్! శిష్యులకు చేతకాలేదా?
ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తనవంతు విరాళాన్ని ప్రకటించగా, పలువురు స్టార్లు ఇతర సాంకేతిక నిపుణులు కూడా విరాళాల్ని ప్రకటిస్తారని భావిస్తున్నారు.
దర్శకరత్న డా.దాసరి నారాయణరావు జయంతి వేడుకలు మే 4న వైభవంగా నిర్వహించేందుకు దర్శకసంఘం సన్నాహకాలలో ఉన్న సంగతి తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా దాసరి బర్త్ డే వేడుకల్లో ప్రత్యేక వినోద కార్యక్రమాలను ప్లాన్ చేయడమే గాక, ఈ వేదిక వద్ద దర్శకసంఘం సంక్షేమం కోసం భారీగా విరాళాల్ని సేకరిస్తారని కథనాలొస్తున్నాయి. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తనవంతు విరాళాన్ని ప్రకటించగా, పలువురు స్టార్లు ఇతర సాంకేతిక నిపుణులు కూడా విరాళాల్ని ప్రకటిస్తారని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే దాసరి బర్త్ డే అనగానే కేవలం పండగ చేసుకుని వెళ్లిపోవడమేనా? ఎందరికో పాఠాలు నేర్పించిన ఆయన జీవితంపై బయోపిక్ తెరకెక్కించే ఆలోచనను గురువుగారి శిష్యులు చేయడం లేదా? అంటూ కొందరు సూటిగా ప్రశ్నిస్తున్నారు. నిజానికి నటుడు.. దర్శకనిర్మాత.. రాజకీయ నాయకుడు అయిన దివంగత డా.దాసరి నారాయణరావు బయోపిక్ ని చాలా కాలం క్రితమే ప్రకటించారు. మద్రాసు పరిశ్రమలో ఆయన ప్రవేశం.. ఎదిగిన వైనం.. తొలి అడుగులు .. అగ్ర దర్శకనిర్మాతగా .. తెలుగు చిత్ర పరిశ్రమ పెద్ద దిక్కుగా ఆయన రూపాంతరం చెందిన తీరు.. ప్రతిదీ తెరపై చూపించేందుకు ప్లాన్ చేసారు. ఈ బయోపిక్ ని `దర్శకరత్న` పేరుతో దవళ సత్యం దర్శకత్వం లో ఇమేజ్ ఫిలింస్ బ్యానర్ పై తాడివాక రమేష్ నిర్మిస్తున్నారని ప్రకటించారు. దాసరి బయోపిక్ అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్‌తో రూపొందుతుందని నిర్మాతలు తెలిపారు.
అయితే మధ్యలో ఏమైందో కానీ ఈ ప్రాజెక్ట్ గురించి సరైన అప్ డేట్ లేదు. సాధారణంగానే కొన్ని సినిమాలకు బడ్జెట్ పరమైన సమస్యలు ఉంటాయి. అలాంటి చిక్కుల వల్ల ఆగిపోతే దానికి సహకరించేందుకు దర్శకసంఘం సాయపడాల్సి ఉంటుంది. ఇంతకుముందు దాసరి నారాయణరావు శిష్యుడు అయిన సి.కళ్యాణ్ సైతం దాసరి బయోపిక్ ని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. కానీ ప్రకటన ఘనంగానే ఉన్నా సినిమా తెరకెక్కలేదు. పలువురు చోటా మోటా దర్శకులు కూడా దాసరి బయోపిక్ పై ప్రకటనలు ఘనంగా చేసినా కానీ వాటిని నిజం చేయలేదు. ఇలా ఒక దిగ్గజ దర్శకుడి జీవితకథను తెరకెక్కించాలని పలువురు నీరుగారిపోవడం ఆశ్చర్యపరుస్తోంది. అయితే దాసరికి ఇండస్ట్రీలో చాలామంది శిష్యులు ఉన్నారు. వీళ్లంతా తలుచుకుంటే బయోపిక్ తీయడం ఏమంత కష్టం కాదు. కానీ ఎందుకు ప్రయత్నించడం లేదు? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
టాలీవుడ్ లో నాటి మేటి హీరోలు, అగ్ర హీరోలందరికీ బ్లాక్ బస్టర్లు అందించిన దర్శకరత్న దాసరి నారాయణరావు ఇతర పరిశ్రమల్లోనూ టాప్ డైరెక్టర్ గా పాపులరయ్యారు. దాసరి నారాయణరావు 150కి పైగా విభిన్న చిత్రాలకు దర్శకత్వం వహించారు. 3 జాతీయ చలనచిత్ర అవార్డులు , 9 రాష్ట్ర నంది అవార్డులను అందుకున్నారు. వఫాదార్- ప్రేమ్ తపస్య- జఖ్మీ షేర్- యాద్గార్- సర్ఫరోష్- స్వరాగ్ నరక్ - జ్యోతి బనే జ్వాలా- ప్యాసా సావన్- ఆజ్ కా ఎమ్మెల్యే రామ్ అవతార్- ఆశాజ్యోతి వంటి హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించిన దాసరి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.