నితిన్‌ 'రాబిన్‌ హుడ్‌' లో స్పెషల్ గెస్ట్‌ పుష్పరాజ్‌..!

అల్లు అర్జున్‌ హీరోగా నటించిన పుష్ప సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Update: 2024-09-23 06:08 GMT

అల్లు అర్జున్‌ హీరోగా నటించిన పుష్ప సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలోని పాటలు, మేనరిజంలు, డాన్స్ లు ఇలా ప్రతి ఒక్కటి సోషల్‌ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ముఖ్యంగా పుష్ప పాటల స్టెప్పులు సోషల్‌ మీడియాలో అంతర్జాతీయ స్థాయిలో వైరల్‌ అవ్వడానికి ఒక కారణం ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సోషల్‌ మీడియాలో పుష్ప కు సంబంధించిన పలు రీల్స్ ను చేయడం జరిగింది. అలా పుష్ప ను వరల్డ్‌ వైడ్‌ కి తీసుకు వెళ్లడం లో డేవిడ్‌ వార్నర్ కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత సైతం డేవిడ్ వార్నర్‌ తెలుగు ప్రేక్షకులకు ఏదో రకంగా చేరువ అవుతూనే ఉన్నాడు.

ఐపీఎల్‌ లో ఆడుతున్న సమయంలో ఈ ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యాడు. అందుకే ఆయన్ను తెలుగు సినిమాల్లో నటింపజేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అయింది. పుష్ప గెటప్ లోనే డేవిడ్‌ వార్నర్‌ ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల పుష్ప గెటప్ లో డేవిడ్‌ వార్నర్‌ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా డేవిడ్‌ వార్నర్‌ పుష్ప గెటప్‌ పై క్లారిటీ వచ్చింది. ఆయన ఒక సినిమాలో పుష్పరాజ్ గెటప్‌ లో కనిపించబోతున్నాడు. ఆ గెటప్ తో డేవిడ్‌ వార్నర్‌ 'రాబిన్‌ హుడ్‌' అనే సినిమాలో కనిపించబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.

నితిన్‌ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న 'రాబిన్‌ హుడ్‌' సినిమా షూటింగ్‌ చకచకా జరుగుతోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ ఆస్ట్రేలియాలో జరుగుతున్న సమయంలో డేవిడ్‌ వార్నర్‌ ను ఒక సన్నివేశంలో చూపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశ్యంతో దర్శకుడు వెంకీ ఆయనను సంప్రదించడం జరిగిందట. తెలుగు సినిమాలపై ఆసక్తితో వార్నర్‌ వెంటనే ఓకే చెప్పాడని తెలుస్తోంది. రాబిన్‌ హుడ్‌ సినిమాలో పుష్పరాజ్ పేరుతో దొంగతనాలు చేసే వ్యక్తి పాత్రలో డేవిడ్‌ వార్నర్ కనిపించబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి పుష్ప పాత్రను డేవిడ్ వార్నర్‌ మరోసారి వాడబోతున్నాడు.

అల్లు అర్జున్‌ పుష్ప రాజ్ పాత్రకు ఉన్న పాపులారిటీ నేపథ్యంలో నితిన్‌, వెంకీ కుడుముల కాంబో మూవీకి కచ్చితంగా డేవిడ్ వార్నర్ పాత్ర హైలైట్‌ గా నిలిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రాబిన్‌ హుడ్‌ లో నితిన్ కు జోడీగా హీరోయిన్‌ గా శ్రీలీల నటిస్తున్న విషయం తెల్సిందే. నితిన్‌ కి ఈ సినిమా చాలా కీలకంగా మారింది. నితిన్‌, వెంకీ కాంబోలో గతంలో వచ్చిన సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలు పెంచే విధంగా డేవిడ్‌ వార్నర్‌ ను ఈ సినిమాలో నటింపజేయడం అనేది కచ్చితంగా మంచి నిర్ణయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సోషల్‌ మీడియాలో పుష్ప పాత్ర తో రాబోతున్న రాబిన్‌ హుడ్‌ గురించిన చర్చ జరుగుతోంది. ఈ సినిమాతో మంచి పేరు సొంతం చేసుకుంటే ముందు ముందు డేవిడ్‌ వార్నర్‌ మరిన్ని తెలుగు సినిమాలు చేస్తాడేమో చూడాలి.

Tags:    

Similar News