డిప్రెషన్‌తో పోరాడుతున్న నటీమణులు
డిప్రెషన్‌తో తన పోరాటం గురించి బహిరంగంగా మాట్లాడిన బాలీవుడ్ నటీమణులలో దీపికా పదుకొణే ఒకరు.
నేటి బిజీ జీవితం చాలా ఒత్తిళ్లమయం. ఇది రంగుల పరిశ్రమకు వర్తిస్తుంది. ఇక్కడ పని చేసే స్టార్లు, సాంకేతిక నిపుణుల జీవితాల్లో ఒత్తిళ్లు చాలా సహజం. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ప్రభావితం చేసే తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్య. స్టార్ల విషయానికి వస్తే కొందరు బహిరంగంగా తమ ఒత్తిడి గురించి ఓపెనయ్యారు. దీనివల్ల ప్రజలు మానసిక ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడేందుకు ఆస్కారం ఉందనేది ఒక భావన. సక్సెస్ లేదా కీర్తి, డబ్బుతో సంబంధం లేకుండా ఎవరైనా డిప్రెషన్ సవాళ్లను అనుభవించవచ్చనేందుకు చాలా ఉదాహరణలున్నాయి.
డిప్రెషన్‌తో తన పోరాటం గురించి బహిరంగంగా మాట్లాడిన బాలీవుడ్ నటీమణులలో దీపికా పదుకొణే ఒకరు. చిత్ర పరిశ్రమలో అద్భుత విజయం సాధించినప్పటికీ ఒకానొక దశలో దీపిక చాలా కష్టతరమైన కాలాన్ని ఎదుర్కొంది. మానసికంగా ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఎంచుకున్న వృత్తిలో ముందుకు వెళ్లాలా వద్దా? పని చేయాలా వద్దా? అనే డైలమాను ఎదుర్కొంది. అదంతా ఒత్తిడి వల్లనే. దానినుంచి బయటపడేందుకు తనవారి సాయం కూడా కోరింది. దీపిక వృత్తిపరమైన సహాయాన్ని కోరింది. అప్పటి నుండి మానసిక ఆరోగ్య అవగాహన కోసం వేదికలపై న్యాయవాదిగా మారింది. బహిరంగంగా ఒత్తిళ్ల నుంచి ఎలా బయటపడాలో చెబుతోంది. ఇతరులకు సహాయం చేయడానికి ది లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ అనే ఫౌండేషన్‌ను ప్రారంభించింది.
అనుష్క శర్మ కూడా బాలీవుడ్ లో విజయవంతమైన నటి కం నిర్మాత. తాను కూడా ఆందోళన.. నిరాశతో జీవించానని ఆమె పలుమార్లు తన అనుభవాన్ని మీడియాకు షేర్ చేసారు. ఆ సమయంలో సహాయం కోరడంలోని ప్రాముఖ్యత గురించి .. చికిత్సతో తన పరిస్థితిని ఎలా మేనేజ్ చేసిందో వెల్లడించింది. తన మానసిక ఆరోగ్య ప్రయాణం గురించి అనుష్క బహిరంగంగా మాట్లాడటం, సహాయం కోరడం చాలా మందికి ప్రోత్సాహకరంగా మారింది.
ఇలియానా డి క్రజ్ డిప్రెషన్ -బాడీ డైస్మోర్ఫిక్ డిజార్డర్‌తో తన పోరాటం గురించి ఓపెనైంది. ఒక వ్యక్తి వారి ప్రదర్శనలో లోపాల గురించి చాలా కాలం పాటు ఆలోచిస్తూ సమయం గడుపుతారు. అది ఒత్తిడిని పెంచుతుందని ఇలియానా తెలిపింది. తాను కూడా సహాయం కోరింది. చికిత్స తీసుకుంది. ఇది చాలా ప్రయోజనకరంగా ఉందని కూడా చెప్పింది. ఇలియానా తన కథను వినిపించడానికి కారణం.. మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ఇతరులకు ఉపకరిస్తుందనే. ఇలియానా ప్రేమలో విఫలమై ఒత్తిళ్లకు లోనైంది. ఇటీవల రెండోసారి ప్రేమలో ఆనందం వెతుక్కుంది. ఇప్పుడు ఒక బిడ్డకు జన్మనిచ్చిన ఆనందంలో ఉంది.
పరిణీతి చోప్రా వృత్తిపరమైన వైఫల్యాలు.. వ్యక్తిగత సమస్యల కారణంగా తన డిప్రెషన్ గురించి మాట్లాడింది. నాటి సమయం తన జీవితంలో అత్యంత చెత్త సమయం అని అభివర్ణించింది. అయితే తన కుటుంబం నిపుణుల సహాయంతో దాని నుండి బలంగా బయటపడగలిగింది. అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ చాలా భయంకరమైన డిప్రెషన్ ని ఎదుర్కొంది. ఆ విషయాన్ని బహిరంగంగా వెల్లడించింది. చికిత్సతో కోలుకున్న తర్వాత ఇతరులకు ఇలా జరగకూడదని ప్రతిదీ ఓపెన్ గా చర్చించడం ప్రారంభించారు ఇరా ఖాన్. ఇరా ఇటీవల తన ప్రేమికుడు నూపూర్ ని పెళ్లాడి చాలా సంతోషంగా ఉన్న సంగతి తెలిసిందే. శ్రుతిహాసన్ పలుమార్లు ప్రేమలో విఫలమై తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొందని కథనాలొచ్చాయి. కానీ ఇప్పుడు కొత్త ప్రేమతో ఒత్తిడి నుంచి బయటపడింది. అవసరం మేర చికిత్సతో అన్నిటి నుంచి బయటపడింది. సహజనటి జయసుధ భర్త, దివంగత నితిన్ కపూర్ తీవ్ర మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న సంగతిని ఆ కుటుంబం ఇంతకుముందు వెల్లడించింది. కొన్ని సార్లు చికిత్స కొనసాగుతున్నా మానసిక ఒత్తిడి(వంశ పారంపర్య సమస్య) ప్రమాదకరంగా మారుతుందనేందుకు ఇది ఉదాహరణ గా నిలిచింది.
డిప్రెషన్‌తో బాధపడుతున్నచాలామంది నటీమణులు వాటి నుంచి బయటపడేందుకు చేసిన ప్రయత్నాలపై కథనాలు మానసిక ఆరోగ్య సమస్యల్లో ఉన్నవారికి స్ఫూర్తినివ్వవచ్చు. వీరంతా ధనవంతులు, సెలబ్రిటీలు, పాపులర్ పర్సనాలిటీస్.. కానీ ఒత్తిళ్లతో జీవితంలో కొంత సమయం సమస్యాత్మకంగా మారింది. ప్రజల్లో ఒత్తిడిని ఎదుర్కొనేవాళ్లు.. ఇతరుల సహాయం మద్దతును కోరేలా ఈ కథనాలు ప్రోత్సహిస్తాయని ఆశిద్దాం.