దేవర... వాళ్ళిద్దరికీ అగ్ని పరీక్షే!

అయితే ఈ సినిమా విజయం అందరికంటే దర్శకుడికి, సంగీత దర్శకుడికి కీలకంగా మారిందని చెప్పాలి.

Update: 2024-07-17 01:30 GMT

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషనల్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'దేవర'. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రం మొదటి భాగాన్ని సెప్టెంబర్ నెలాఖరున విడుదల చేయనున్నారు. ఇది బాక్సాఫీస్ ను షేక్ చెయ్యడం గ్యారంటీ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ సినిమా విజయం అందరికంటే దర్శకుడికి, సంగీత దర్శకుడికి కీలకంగా మారిందని చెప్పాలి.

'దేవర' చిత్రానికి తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకముందు 'అజ్ఞాతవాసి', 'జెర్సీ', 'గ్యాంగ్ లీడర్' వంటి స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు వర్క్ చేసారు అనిరుధ్. ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలను సాధించలేదు. దీనికి తోడు లేటెస్టుగా వచ్చిన కమల్ హాసన్, శంకర్ ల 'భారతీయుడు 2' సినిమా సంగీతం విషయంలో అనిరుధ్ ను నెటిజన్లు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

'ఇండియన్' మూవీకి ఏఆర్ రెహమాన్ చార్ట్ బస్టర్ ఆల్బమ్ అందిస్తే, ఇప్పుడు అనిరుధ్ దాని సీక్వెల్ కు ఒక్కటంటే ఒక్క మంచి పాటను ఇవ్వలేకపోయారని విమర్శిస్తున్నారు. బ్యాగ్రౌండ్ స్కోర్ లోనూ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయారని, సినిమా ఫెయిల్యూర్ కి ఇది కూడా ఒక కారణమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'దేవర' పార్ట్-1తో రాక్ స్టార్ తన సత్తా ఏంటో చూపించాల్సిన అవసరం ఏర్పడింది. అంతేకాదు అతను తెలుగులో మ్యూజిక్ అందిస్తే ఆ సినిమా ప్లాప్ అవుతుందనే అపవాదును తొలగించుకోవాలంటే, ఎన్టీఆర్ చిత్రంతో కచ్చితంగా హిట్టు కొట్టి తీరాల్సి ఉంది.

మరోవైపు కొరటాల శివ పరిస్థితి కూడా ఇలానే ఉంది. మెగా తండ్రీకొడుకులతో చేసిన 'ఆచార్య' సినిమా భారీ డిజాస్టర్ గా మారింది. సినిమా పరాజయానికి దర్శకుడే కారణమంటూ మెగా ఫ్యాన్స్ అంతా డైరెక్టర్ ను నిందించారు. చిరంజీవి సైతం ఇది దర్శకుడి ఛాయిస్ అని కామెంట్స్ చేయడంతో కొరటాల మీద ఎన్నడూ లేనంత నెగెటివిటీ వచ్చి చేరింది. దీంతో రాబోయే సినిమాతో తన స్టామినా ఏంటో తెలియజేయాల్సిన అవసరముంది. తప్పకుండా 'దేవర 1'తో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి అందరి నోళ్ళూ మూయించాల్సి ఉంది.

'దేవర' సినిమా నుంచి ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ గ్లింప్స్‌ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను సంతృప్తి పరిచాడు కొరటాల శివ. మరోవైపు ఫస్ట్ సింగిల్ 'ఫియర్' సాంగ్ తో సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాడు అనిరుధ్ రవిచందర్. ఇవన్నీ ఈసారి తారక్ తో కలిసి వీరిద్దరూ విజయం సాధిస్తారనే పాజిటివ్ వైబ్ ను కలిగించాయి. ఈ నెలలోనే రెండో పాటను రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌ పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'దేవర' ప్రపంచాన్ని సిల్వర్ స్క్రీన్ చూడటానికి అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 2024 సెప్టెంబర్ 27న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

Tags:    

Similar News