పుష్ప పార్ట్ 3 - DSP సలహా ఏంటంటే..
తెలుగు సినిమా బాక్సాఫీస్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాలు పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్.
తెలుగు సినిమా బాక్సాఫీస్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాలు పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్. ఈ రెండు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు చిత్రాలకు ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. అల్లు అర్జున్ టాలెంట్, సుకుమార్ దర్శకత్వం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కలిసి ఈ సిరీస్‌ను మరోస్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా పుష్ప 2: ది రూల్ 2024 చివరలో విడుదలై థియేటర్లలో ఇప్పటికీ సందడి చేస్తోంది. ఈ చిత్రం వసూళ్లలో రూ. 1800 కోట్లను దాటేసి, టాప్ రికార్డును కూడా అధిగమించడం విశేషం.
పుష్ప సిరీస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అంశాల్లో ఐటెమ్ సాంగ్స్ ఒకటి. మొదటి భాగంలో సమంత, రెండో భాగంలో శ్రీలీల గ్లామరస్ పెర్ఫార్మెన్స్ అందరికీ గుర్తుండేలా చేసింది. తాజాగా ఈ సిరీస్‌లో మూడో భాగం పుష్ప 3: ది ర్యాంపేజ్ గురించి ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. ఆంగ్ల మీడియాతో ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, ఈ సినిమాలోని ఐటెమ్ సాంగ్ కోసం బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ సరైన ఎంపిక అని అభిప్రాయపడ్డారు.
దేవిశ్రీ ప్రసాద్ మరింత వివరణ ఇస్తూ.. ఐటెమ్ సాంగ్స్ డ్యాన్సర్లు మాత్రమే కాకుండా, ఆ పాటలో ఉన్న ఎమోషన్‌ను తెరపై కనిపించేలా చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తారని చెప్పారు. "సమంత, శ్రీలీల వంటి అగ్ర కథానాయికలు ఈ తరహా పాటల్లో నటించడం ఓ ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. జాన్వీ కపూర్ అద్భుతమైన డ్యాన్సర్ మాత్రమే కాకుండా, ఆమెలో శ్రీదేవి గ్రేస్ కనిపిస్తుంది. ఈ పాటకు ఆమె సరైన ఎంపికగా నిలుస్తుందని నా అభిప్రాయం," అని దేవిశ్రీ వెల్లడించారు.
గతంలో కాజల్, పూజా హెగ్డే నేను కంపోజ్ చేసిన సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేశారు. వారు అప్పుడు స్టార్ హోదాలో ఉన్నవారే అని దేవి తెలిపారు. ఇక పుష్ప 2 లోని "కిస్సిక్" పాటకు అందరి నుండి విశేష స్పందన వచ్చింది. ఈ పాట అంతర్జాతీయ స్థాయిలో హైలైట్ కావడానికి డ్యాన్స్ ముఖ్య కారణం అని దేవిశ్రీ గుర్తుచేశారు.
ఇక పుష్ప 3 లో కూడా ఐటెమ్ సాంగ్ కోసం దృశ్యపరమైన అద్భుతత అవసరమని దర్శకనిర్మాతలు ఆలోచన చేస్తున్నారు. జాన్వీతో పాటను మరింత వైభవంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయవచ్చని ఇండస్ట్రీ వర్గాలు చర్చిస్తున్నాయి. ఇప్పటికే పుష్ప 3 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రెండు భాగాలు అందించిన భారీ విజయాల తర్వాత, మూడో భాగం థియేటర్లలో ఒక సంచలనం అవుతుందనడంలో ఎలాంటి అనుమానమే లేదని ఫ్యాన్స్ ఓ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
అయితే ఈ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనే విషయంలో మేకర్స్ ఇంకా సరైన క్లారిటీ ఇవ్వలేదు. ఇక పుష్ప 2లో అదనపు 20 నిమిషాల సన్నివేశాలు ప్రేక్షకులను థియేటర్లకు మళ్లీ రప్పించినట్లు ఇలాంటి ఐటెమ్ సాంగ్స్ కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఒకవేళ పుష్ప 3 సెట్టయితే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, జాన్వీ కపూర్ డ్యాన్స్ కాంబినేషన్ ఎలా ఉంటుందో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి పార్ట్ 3పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.