ధనుష్ Vs నయన్.. ఇద్దరి మధ్య అసలు గొడవ ఏంటంటే?
ఈ క్రమంలో ధనుష్ వ్యక్తిత్వం మీద నయన్ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ధనుష్ Vs నయనతార.. ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో వీరిద్దరి గొడవ గురించే ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. తన జీవితంపై రూపొందించిన నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీకి ధనుష్ ఎన్ఓసీ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడని.. ‘నేనూ రౌడీనే’ సినిమాలోని విజువల్స్ వాడుకుంటామని అడిగితే, రెండేళ్లు తిప్పించుకొని అనుమతి ఇవ్వలేదంటూ నయన్ ఓపెన్ లెటర్ రాసింది. ఈ క్రమంలో ధనుష్ వ్యక్తిత్వం మీద నయన్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదంలో కొందరు నయనతారకు మద్దతుగా నిలుస్తుంటే, మరికొందరు ఆమెకు వ్యతిరేఖంగా రియాక్ట్ అవుతున్నారు. దీంతో అసలు ఇద్దరి మధ్య ఏం జరిగింది? విబేధాలు రావడానికి కారణమేంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గతంలో ధనుష్, నయనతార కలిసి 'యారడి నీ మోహిని ('ఆడవారి మాటలకు అర్థాలు వేరులే' రీమేక్) అనే తమిళ సినిమాలో నటించారు. ఆ తర్వాత శివ కార్తికేయన్ హీరోగా ధనుష్ నిర్మించిన ‘ఎదిర్ నీచ్చిల్’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో నయన్ కనిపించింది. దీని కోసం ఆమె ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని ధనుష్ అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అది జరిగిన రెండేళ్లకు ధనుష్ తన హోమ్ ప్రొడక్షన్ లో తీసిన ‘నేనూ రౌడీనే’ (తమిళ్ లో 'నానుమ్ రౌడీ దాన్') సినిమాలో నటించింది నయనతార. అప్పటి వరకూ ఇద్దరూ బాగానే ఉన్నారు కానీ, ఈ మూవీ తర్వాతే వారి మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
'రఘువరన్ బీటెక్'లో చిన్న పాత్ర పోషించిన విఘ్నేష్ శివన్.. ధనుష్ తో ఏర్పడిన ఫ్రెండ్ షిప్ తో 'నానుమ్ రౌడీ దాన్' కథ చెప్పి, సినిమాని ప్రొడ్యూస్ చెయ్యమని కోరాడు. కథ నచ్చడటంతో వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయ్యాడు. ముందు ఈ స్టోరీని హీరో గౌతమ్ కార్తీక్ కు నేరేట్ చేసాడు కానీ, చివరకు విజయ్ సేతుపతి ప్రాజెక్ట్ లో చేరాడు. హీరోయిన్ రోల్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి, నయనతార లాంటి అగ్ర కథానాయిక అయితే బాగుంటుందని ధనుషే సూచించారు. 2013లోనే ఈ చిత్రాన్ని ప్రకటించగా.. 2015లో సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది.
‘నేనూ రౌడీనే’ సినిమా టైంలోనే నయన్-విఘ్నేష్ మధ్య సాన్నిహిత్యం పెరగడం, ఆ తర్వాత అది ప్రేమగా మారడం జరిగింది. కొన్నేళ్లపాటు డేటింగ్ చేసిన ఈ జంట, చివరకు 2022లో పెళ్లి చేసుకున్నారు. అయితే వాళ్ళిద్దరినీ ఒక్కటి చేసిన ఆ సినిమా విషయంలో నయన్-విఘ్నేశ్ హ్యాపీగా ఉన్నప్పటికీ.. నిర్మాతగా ధనుష్ మాత్రం సంతోషంగా లేరట. ఎందుకంటే వాళ్ళ కారణంగానే సినిమా లేట్ అయిందని, అందుకే బడ్జెట్ ఎక్కువైందనే ఫీలింగ్ లో ఉన్నారట. ముందుగా ఈ సినిమాకి 6 కోట్ల బడ్జెట్ అనుకుంటే, కంప్లీట్ అయ్యే సమయానికి 16 కోట్లు దాటిపోయిందట. సినిమా హిట్టయినప్పటికీ నిర్మాతగా ధనుష్ నష్టపోయారట. ఇదే నయన్-విఘ్నేష్ లతో ధనుష్ కు విబేధాలు రావటానికి ప్రధాన కారణమని అంటున్నారు.
అలానే ఈ సినిమాలో నయనతార యాక్టింగ్ కూడా ధనుష్ కు నచ్చలేదట. సరిగ్గా నటించడం లేదని, టైం వేస్ట్ చేస్తోందని విమర్శలు చేసినట్టు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే ‘నేనూ రౌడీనే’ సినిమాకి ఉత్తమ నటిగా నయనతారకు ఫిలిం ఫేర్ అవార్డ్ వచ్చింది. 2016లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో ధనుష్ నొచ్చుకునేలా మాట్లాడింది నయన్. ''నానుమ్ రౌడీ దాన్ సినిమాని హేట్ చేసినందుకు థ్యాంక్యూ ధనుష్. సినిమాలో నా పెర్ఫార్మన్స్ ని ధనుష్ చాలా హేట్ చేసాడు. నిన్ను డిజప్పాయింట్ చేసినందుకు సారీ ధనుష్'' అంటూ అతన్ని ఇబ్బందిపెట్టేలా సెటైర్లు వేసింది. అదే ఏడాది సైమా అవార్డ్ ఫంక్షన్ లో డైరెక్టర్ విక్కీని పొగుడుతూ, నిర్మాత ధనుష్ పేరుని కూడా ప్రస్తావించలేదు నయనతార. అదే ఈవెంట్ లో అల్లు అర్జున్ అవార్డు ప్రధానం చేయడానికి వేదిక మీద నిలబడి ఉండగా, విఘ్నేష్ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకుంటానని నయనతార చెప్పడం అప్పట్లో ఆమెపై విమర్శలకు కారణమైంది.
ధనుష్ దీనిపై ఎప్పుడూ మాట్లాడలేదు కానీ, ఈ సినిమా నుంచే నయన్ తో దూరం పెరిగినట్లు అందరికీ క్లారిటీ వచ్చేసింది. అయితే ఇన్నేళ్ల తర్వాత ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ కారణంగా వీరిద్దరి మధ్య గొడవలు వార్తల్లో నిలిచాయి. ఆమె లైఫ్ లోని కీలకమైన అంశాలతో నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని రూపొందించింది. దీని కోసం విఘ్నేష్ - నయన్ సదరు ఓటీటీ సంస్థతో భారీ డీల్ కుదుర్చుకున్నట్లుగా నివేదికలు ఉన్నాయి. పెళ్లి రైట్స్ ను కూడా అమ్ముకోవడం ఏంటంటూ అప్పట్లో సోషల్ మీడియాలో ట్రోల్స్ నడిచాయి. ఇదే డాక్యుమెంటరీలో విఘ్నేష్ కు తనకు ఎంతో ముఖ్యమైన 'నానుమ్ రౌడీ దాన్' ఫుటేజీ యూజ్ చేసుకోవాలని నయనతార భావించింది. దీని కోసం ధనుష్ ని అనుమతి కోరగా, దాన్ని ఆయన నిరాకరించారు. అంతేకాదు పర్మిషన్ లేకుండా 3 సెకండ్ల వీడియో క్లిప్ వాడటం ఏంటంటూ కాపీ రైట్ చట్టం కింద నష్టపరిహారం కోసం కోర్టు నోటీసులు కూడా పంపించారు.
తన బ్యానర్ లో డబ్బులు పెట్టి సినిమా తీస్తే, దాన్ని నయనతార దంపతులు తమ డాక్యుమెంటరీ కోసం ఓటీటీకి అమ్ముకొని క్యాష్ చేసుకోవాలని అనుకోవడం సరికాదని ధనుష్ భావించారట. అందుకే తన సినిమాలోని విజువల్స్ ని ఎందుకు ఫ్రీగా ఇవ్వాలని లీగల్ నోటీసు పంపించారని తమిళ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. చట్టప్రకారం ఈ వివాదంలో ధనుష్ పైచేయి సాధించవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసే ధనుష్ క్యారక్టర్ ను దెబ్బ తీసే విధంగా నయన్ ఓపెన్ లెటర్ రాసిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. తన డాక్యుమెంటరీకి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చుకోడానికే వివాదం తెర మీదకు తీసుకొచ్చిందని ధనుష్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాను నటించిన సినిమా విజువల్స్ వాడుకునే హక్కు హీరోయిన్ కు లేదా అని నయన్ అభిమానులు అంటుంటే.. ఆమె డాక్యుమెంటరీ ఛారిటీ కోసం చేయడం లేదు కదా? అని డీ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఇలా ధనుష్ Vs నయన్ కాంట్రవర్సీ నడుస్తున్న తరుణంలోనే, నయనతార డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కు వచ్చేసింది.