పాపం.. ఆ సినిమాకు మళ్లీ బ్రేక్?

విడుదలకు ఇంకో నాలుగు రోజులే సమయం ఉండగా.. ఇంకా ఆర్థిక వివాదాలు సద్దుమణగకపోవడంతో ఈ వారం సినిమా రిలీజ్ కావడం కష్టమే అంటున్నారు.

Update: 2023-11-20 14:28 GMT

ధృవనక్షత్రం.. ఎప్పుడో పదేళ్ల కిందట అనౌన్స్ చేసిన సినిమా. ముందు సూర్య హీరోగా ఈ సినిమా తీయాలనుకున్నాడు దర్శకుడు గౌతమ్ మీనన్. కానీ అతడితో కుదరక విక్రమ్‌ను ఎంచుకోవాల్సి వచ్చింది. రకరకాల కారణాల వల్ల ఈ సినిమా ప్రొడక్షన్‌ కూడా ఆలస్యంగా మొదలైంది. 2017లో సినిమాను మొదలుపెట్టి ఏడాది లోపే చాలా వరకు పూర్తి చేశాడు గౌతమ్. కానీ తన నిర్మాణ సంస్థ ఆర్థిక వివాదాల్లో చిక్కుకోవడం వల్ల గౌతమ్ సినిమాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. మూణ్నాలుగు ప్రాజెక్టులు అనిశ్చితిలో పడ్డాయి. ధనుష్‌తో తీసిన ఓ సినిమాను ఎలాగోలా బయటికి తీసుకురాగలిగాడు కానీ.. 'ధృవనక్షత్రం' మాత్రం ఎటూ కాకుండా ఆగిపోయింది. 'నరకాసుర' పేరుతో తాను ప్రొడ్యూస్ చేసిన మరో సినిమా అటకెక్కేసింది. దాని సంగతి పక్కన పెట్టేసి 'ధృవనక్షత్రం'ను బయటికి తేవాలని ఎంతో ప్రయత్నిస్తున్నా కుదరడం లేదు.

ఎట్టకేలకు ఈ సినిమాను రిలీజ్‌కు రెడీ చేశాడు గౌతమ్. నవంబరు 24కి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశాడు. ఐతే కొన్ని రోజుల ముందే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ముందు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి తర్వాత బిజినెస్ ప్రయత్నాలు చేస్తున్నానని.. నాన్ థియేట్రికల్ డీల్స్ అవీ పూర్తయితే వచ్చే డబ్బులతో ఈ సినిమా ఫైనాన్స్ సమస్యలన్నీ క్లియర్ చేసి ఎలాగైనా నవంబరు 24న సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నానని చెప్పాడాయన. కానీ కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం గౌతమ్ ప్రయత్నాలు ప్రయత్నించట్లేదట.

ఇంకా డిజిటల్, శాటిలైట్ రైట్స్ డీల్స్ తేలలేదట. గౌతమ్ చేతికి డబ్బులు రాలేదట. విడుదలకు ఇంకో నాలుగు రోజులే సమయం ఉండగా.. ఇంకా ఆర్థిక వివాదాలు సద్దుమణగకపోవడంతో ఈ వారం సినిమా రిలీజ్ కావడం కష్టమే అంటున్నారు. రిలీజ్ డేట్ అయితే ఇచ్చారు కానీ.. చాలామందిలో దీనిపై సందేహాలున్నాయి. అందుకే హీరో విక్రమ్ కూడా సినిమాను ప్రమోట్ చేయలేదు. మరి గౌతమ్ కష్టాలు ఎప్పటికి తీరుతాయో.. ఈ సినిమా ఎన్నటికి వెలుగు చూస్తుందో చూడాలి.

Tags:    

Similar News