ఆంధ్ర బాక్సాఫీస్.. బయ్యర్స్ భయంభయంగా..

తెలుగు రాష్ట్రాలలో నైజాం కంటే ఆంధ్రప్రదేశ్ లోనే సినిమాలకి ఎక్కువ బిజినెస్ జరుగుతూ ఉంటుంది.

Update: 2024-10-21 05:17 GMT

తెలుగు రాష్ట్రాలలో సినిమాల బిజినెస్ అనేది ప్రొడ్యూసర్స్ కి చాలా కీలకం అని చెప్పొచ్చు. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాలకి ఇక్కడ ఏ స్థాయిలో బిజినెస్ జరుగుతుందనే దానిపై మార్కెట్ లెక్కలు కూడా ఆధారపడి ఉంటాయి. సినిమాపైన పాజిటివ్ బజ్ ఉంటే ఎగ్జిబిటర్లు, బయ్యర్లు భారీ ధరకు ఆ చిత్రాలకు సంబంధించిన ఏరియా రైట్స్ ని కొనుగోలు చేస్తారు. తెలుగు రాష్ట్రాలలో నైజాం కంటే ఆంధ్రప్రదేశ్ లోనే సినిమాలకి ఎక్కువ బిజినెస్ జరుగుతూ ఉంటుంది.

అయితే గత కొంతకాలంగా స్టార్ హీరోల సినిమాలపై ఏపీలో భారీగా బిజినెస్ జరుగుతున్న కూడా ఆశించిన స్థాయిలో ప్రాఫిట్ రావడం లేదు. నైజాంతో పోల్చుకుంటే చెప్పుకోదగ్గ లాభాలను ఆంధ్ర బయ్యర్లు సొంతం చేసుకోలేకపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మంచి లాభాలు అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్ 2’, ‘పుష్ప’, ‘సలార్’, ‘సర్కారు వారి పాట’ సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ప్రాఫిట్ ని తీసుకురాలేకపోయాయి. కేవలం సంక్రాంతి సినిమాలు మాత్రమే కొంత వరకు ఆంధ్ర బయ్యర్లకి లాభాలు అందిస్తున్నాయి.

మిగిలిన టైం లో రిలీజ్ అయ్యే ఏ పెద్ద సినిమాలు కూడా చెప్పుకోదగ్గ ప్రాఫిట్ అందించడం లేదు. కొన్ని సినిమాలు అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని కూడా అందుకోవడం కష్టం అయిపోతుంది. ఈ నేపథ్యంలో ఏపీలో స్టార్ హీరోల సినిమాలను భారీ ధరలకు కొనుగోలు చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్లు రిస్క్ చేయడం లేదు. కొంతమంది నిర్మాతలు సొంతంగా ఏపీలో తమ సినిమాలను రిలీజ్ చేసుకుంటున్నారు. ‘కల్కి 2898ఏడీ’ సినిమాని వైజయంతి మూవీస్ ఏపీలో సొంతంగా రిలీజ్ చేసింది.

తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో బీ, సీ సెంటర్లు ఎక్కువగా ఉంటాయి. అక్కడ మొదటి రెండు వారాల్లోనే ఆల్ మోస్ట్ ప్రేక్షకులు అందరూ సినిమాని చూసేస్తారు. అలాగే రిపీటెడ్ ఆడియన్స్ కూడా చాలా తక్కువగా ఉంటారు. బీ,సి సెంటర్లలో టికెట్ ధరలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. ఈ ప్రభావం కలెక్షన్స్ లలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే డిస్ట్రిబ్యూటర్స్ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. ‘దేవర’ మూవీ మరల ఏపీలో కొంత వరకు లాభాలు తీసుకొచ్చింది. దీంతో ‘పుష్ప 2’ కోసం ఆంధ్రా డిస్ట్రిబ్యూటర్స్ కాస్త ధైర్యం చేశారు. ఈ సినిమా రైట్స్ ఏకంగా 85 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

నిజానికి ‘పుష్ప’ ఏపీలో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ అందుకోలేదు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాటడానికి చాలా కాలం పట్టింది. అయిన కూడా ‘పుష్ప 2’ మీద ఉన్న హైప్ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్ భయంతోనే రిస్క్ తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ వర్కౌట్ అయితే తర్వాత రాబోయే పాన్ ఇండియా సినిమాల విషయంలో కూడా ఆంధ్రా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్లు రిస్క్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం నడుస్తోంది.

Tags:    

Similar News