స్టార్ హీరోయిన్ మూవీ ఓటీటీలోను నిరాశేనా?
ఇదే తరహాలో ప్రభాస్ బుజ్జిగాడు కూడా బుల్లితెరపై ఆదరణ దక్కించుకుంది.
థియేటర్లలో విజయం సాధించని చాలా సినిమాలు బుల్లితెరపై చక్కని ఆదరణ దక్కించుకున్నాయి. అలాంటి వాటిలో మహేష్ బాబు నటించిన అతడు, ఖలేజా లాంటి చిత్రాలు ఉన్నాయి. అవి రెండూ పెద్ద తెరపై ఫ్లాపైనా టీవీ ప్రేక్షకులను గొప్పగా అలరించాయి. ఇదే తరహాలో ప్రభాస్ బుజ్జిగాడు కూడా బుల్లితెరపై ఆదరణ దక్కించుకుంది. ఇంకా ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి.
కానీ వీటన్నిటి కంటే భిన్నంగా ఆలియా భట్ నటించిన జిగ్రా పెద్దతెరతో పాటు, ఓటీటీ తెరపైనా నిరాదరణకు గురవుతోంది. ఈ సినిమా కథ, కథనం, కంటెంట్ ఏమంత బాలేదని విమర్శకులు థియేట్రికల్ రిలీజ్ సమయంలోనే సమీక్షించారు. ప్రధాన పాత్రధారి ఆలియా భట్ నటన, నేపథ్య సంగీతం మినహా సినిమాలో ఎలాంటి విషయం లేదని క్రిటిక్స్ విమర్శించారు. పతాక సన్నివేశాల సాగతీత కూడా పెద్ద మైనస్ అని విశ్లేషించారు.
నిజానికి చాలా పెద్ద సినిమాల మాదిరిగా పెద్ద తెరపై ఫెయిలైనా కనీసం చిన్ని తెరపై ఆకట్టుకుంటుందని భావించారు. కానీ జిగ్రా ఫలితం ఓటీటీలోను భిన్నంగా ఉందని విశ్లేషిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ జిగ్రా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది పరమ బోరింగ్ సినిమా అని విమర్శకులు తేల్చేసారు. వాసన్ బాలా మార్క్ ఇందులో మిస్సయింది. అతడి గత చిత్రాలతో పోలిస్తే నాశిరకం చిత్రమిదని విమర్శలొచ్చాయి. అన్నా చెల్లెళ్ల కథలో ఎమోషన్ కనెక్ట్ కాలేదని, కీలకమైన జైల్ బ్రేక్ సన్నివేశం తేలిపోయిందని కూడా విమర్శలు ఎదురయ్యాయి. జిగ్రాలో అగస్త్య నందా కూడా ఓ కీలక పాత్రను పోషించాడు.
హన్సల్ మెహతా పాజిటివ్ రివ్యూ:
నెటిజనులు జిగ్రా సినిమాని ఓటీటీలో వీక్షించి చెత్త సినిమా అని తేల్చేయగా, అందుకు భిన్నంగా ప్రముఖ దర్శకుడు హన్సల్ మెహతా జిగ్రాపై ప్రశంసలు కురిపించారు. `ట్రాష్ బ్లాక్‌బస్టర్స్ కంటే బెటర్` అని ఈ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. చాలా ఆలస్యంగా అయినా ఎట్టకేలకు జిగ్రా సినిమా చూసానని పేర్కొన్న హన్సల్ ఇది జిగ్రాతో నిండి ఉందని అన్నాడు. అన్నా చెల్లెళ్ల నడుమ మెలో డ్రామా సన్నివేశాలతో సాగిన చిత్రమిది. కానీ కనికరం లేని ట్రోలింగ్ జరిగిందని అన్నారు.
వాసన్ బాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2024లో ఆలియా భట్ సోలో విడుదల. వేదాంగ్ రైనా, మనోజ్ పహ్వా, వివేక్ గోంబర్ సహాయక పాత్రల్లో నటించిన ఈ చిత్రం డిసెంబర్ 6 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.