సామ్ బహదూర్‌ని యానిమల్ కిల్ చేసిందా
ముఖ్యంగా రణబీర్ కపూర్ అద్భుత నటన, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ ఎబిలిటీకి గొప్ప ప్రశంసలు దక్కాయి.
ఈ డిసెంబర్ ఆరంభం రణబీర్ `యానిమల్` బ్లాక్ బస్టర్ విజయంతో ఘనంగా ప్రారంభమైంది. ఏడాది చివరిలో ఇది బాలీవుడ్ కి గొప్ప ఊరట. పఠాన్, జవాన్ లాంటి 1000 కోట్ల క్లబ్ సినిమాలతో ఇండస్ట్రీలో ఉత్సాహం పెరిగింది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు యానిమల్ తొలి రెండు రోజుల్లోనే 230 కోట్ల వసూళ్లను సాధించడం సంచలనంగా మారింది. ముఖ్యంగా రణబీర్ కపూర్ అద్భుత నటన, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ ఎబిలిటీకి గొప్ప ప్రశంసలు దక్కాయి.
భారీ యాక్షన్ కంటెంట్ తో తెరకెక్కిన యానిమల్ మాస్ ని ఒక ఊపు ఊపుతోంది. ఈ సినిమా అటు హిందీ బాక్సాఫీస్ తో పాటు, తెలుగు రాష్ట్రాల్లోను అద్భుత వసూళ్లను సాధిస్తోంది. సౌత్ లో యానిమల్ రణబీర్ కెరీర్ బెస్ట్ గా నిలుస్తుందని తాజా వసూళ్లు చెబుతున్నాయి.
అయితే యానిమల్ ర్యాంప్ షో ముందు క్లాసిక్ బయోపిక్ `సామ్ బహదూర్` వెలవెలబోయింది. విక్కీ కౌశల్ నటించిన ఈ సినిమాకి పాజిటివ్ సమీక్షలు వచ్చినా కానీ మాస్ జనం థియేటర్లకు పోటెత్తలేదు. ముఖ్యంగా యానిమల్ ప్రభావం స్పష్ఠంగా కనిపించింది. బయోపిక్ కేటగిరీలో ఒక యుద్ధ వీరుడి కథతో రూపొందించిన సామ్ బహదూర్ లో విక్కీ కౌశల్ నటన అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిసాయి. ఈ సినిమా సోలోగా వచ్చి ఉంటే అత్యుత్తమమైన ఓపెనింగులు సాధించేది అని కూడా చర్చ సాగుతోంది. ఈ చిత్రం రోజుకు 15 కోట్లు చొప్పన ఫర్వాలేదనిపించే వసూళ్లను రాబట్టింది. కానీ యానిమల్ ర్యాంప్ షో ముందు ఈ వసూళ్లు తీసికట్టుగా కనిపిస్తున్నాయి.
యానిమల్ ప్రభావం ఏ రేంజులో ఉంది? అంటే.. మల్టీప్లెక్సులు, సింగిల్ థియేటర్లలో ఎక్స్ ట్రా షోల కోసం థియేటర్ యాజమాన్యం పకడ్భందీ ప్లానింగ్స్ తో పని చేస్తోంది. మల్టీప్లెక్స్ మేనేజర్లకు నిదురపోయేంత సమయం కూడా ఉండటం లేదన్న చర్చా సాగుతోంది. రణబీర్ కపూర్ కెరీర్ లోనే ఇప్పటివరకూ ఏ సినిమాకి ఇలాంటి టాక్ లేనే లేదు. ఇది ఒక తెలుగు దర్శకుడి ఘనత అంటే అతిశయోక్తి కానే కాదు. యానిమల్ తో మరోసారి సందీప్ వంగా నిరూపించాడు. హింసాత్మక కంటెంట్ ని ఎంపిక చేసుకున్నాడని విమర్శలు వచ్చినా కానీ అతడు బ్లాక్ బస్టర్ ఫార్ములా తెలిసిన నిపుణుడు అని అంతా అంగీకరించాల్సిన పరిస్థితి.