తెలంగాణ ప్రజలకు దిల్ రాజు క్షమాపణలు!
తెలంగాణ ప్రజలను అవమానించినట్లుగా దిల్ రాజుపై కొందరు అసహనం వ్యక్తం చేసారు.
నిజామాబాద్ వేదికగా 'సంక్రాంతికి వస్తున్నాం' ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత దిల్ రాజు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ సంస్కృతిలో దావత్ గురించి అవమాన కరంగా మాట్లాడటంతో సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమైంది. తెలంగాణ ప్రజలను అవమానించినట్లుగా దిల్ రాజుపై కొందరు అసహనం వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో తాజాగా దిల్ రాజు రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణలు తెలియజేసారు.
దీనికి సంబంధించి ఆయన ఓ వీడియో కూడా రిలీజ్ చేసారు. 'నిజామాబాద్ జిల్లా వాసిగా సినిమా ఈవెంట్ అక్కడ చేసా. ఈవెంట్ లో మన సంస్కృతిలో ఉండే దావత్ గురించి మాట్లాడాను. తెలంగాణ వాళ్లను నేను అవమానించానని, హేళన చేసానని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తెలంగాణ సంస్కృతిని నేను అభిమానిస్తాను. బాన్సు వాడలోనే 'ఫిదా' చిత్రాన్ని తెరకెక్కించా. ఆ సినిమా తెలంగాణ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసింది.
'బలంగం' చిత్రాన్ని తెలంగాణ సమాజమంతా ఆదరించింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా బలగం చిత్రాన్ని ప్రశంసించాయి. అలాంటి వాడిని తెలంగాణ సంస్కృతిని ఏ విధంగా అవమానిస్తాను. హేళన చేస్తాను' అని అన్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజామాబాద్ ఈవెంట్ లో ఆయన మాట్లాడు తూ 'ఏ పీలో సినిమా ఈవెంట్ అంటే ఓ వైబ్ ఉంటుందని..కానీ మనకిక్కడ అలా లేదు అన్నారు.
మనకి వైబ్ కావాలంటో మటన్, కల్లు ఉండాలి అని అక్కడ సంస్కృతిపై సరదాగా చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలు తెలంగాణ వాదుల్ని కించ పరిచినట్లుగా అనిపించడంతో రాజుగారు క్షమాపణలతో ముందుకొచ్చారు. దిల్ రాజు నిర్మించిన 'గేమ్ ఛేంజర్' నిన్న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మరో మూడు రోజుల్లే అదే నిర్మాత నిర్మించిన 'సంక్రాంతికి వస్తున్నాం' కూడా రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం దిల్ రాజు తెలంగాణ ఎఫ్ డీసీ చైర్మన్ గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న సంగతి తెలిసిందే.