ఓటీటీ రిలీజ్.. దిల్ రాజు కూడా ఒప్పేసుకున్నారు

టాలీవుడ్ లో బడా నిర్మాత, డిస్టిబ్యూటర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నారు దిల్ రాజు.

Update: 2024-08-17 09:35 GMT

టాలీవుడ్ లో బడా నిర్మాత, డిస్టిబ్యూటర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నారు దిల్ రాజు. ఆయన బ్యానర్ నుంచి గతంలో ఏడాదికి అరడజను సినిమాలకి పైగా వచ్చేవి. అయితే ఈ సారి మాత్రం సినిమాలు కొద్దిగా తగ్గాయి. ఈ ఏడాది ఆరంభంలో ది ఫ్యామిలీ స్టార్ సినిమాని ప్రేక్షకులకి తీసుకొచ్చారు. ప్రస్తుతం దిల్ రాజు ప్రొడక్షన్ గేమ్ చేంజర్ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. డిసెంబర్ లో ఈ సినిమా క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుంది.

అలాగే నితిన్ హీరోగా తమ్ముడు సినిమా కూడా తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. వీటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా ప్రీప్రొడక్షన్ దశలో నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా దిల్ రాజు రేవు అనే చిన్న సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులని థియేటర్స్ కి రాకుండా మేమే చెడగొడుతున్నాం.

థియేటర్స్ లో మూవీ రిలీజ్ అయిన నాలుగు వారాల్లోనే ఓటీటీలో ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాం. దీని ద్వారా ఇంట్లో ఉంటూనే హ్యాపీగా చూసుకునే సౌలభ్యం ప్రేక్షకులకి కలిగింది. మీరు ఇంట్లో ఉంటూనే సినిమాలు చూసుకోండి అని మేమే వారిని ప్రోత్సహిస్తున్నట్లు ఉంది. ఈ కారణంగానే ఎలాగూ ఓటీటీలో మూవీ రిలీజ్ అవుతుందనే ధీమాతో ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చి సినిమా చూడటం లేదని దిల్ రాజు అన్నారు.

కమిటీ కుర్రోళ్ళు లాంటి సినిమాలు మెల్లగా జనానికి ఎక్కుతాయి. మంచి కంటెంట్ బేస్డ్ సినిమాలు థియేటర్స్ లో కొనసాగితే ఎన్ని రోజులు అయిన ప్రేక్షకులు చూస్తారని దిల్ రాజు ఈ ఈవెంట్ లో మాట్లాడారు. దిల్ రాజు వ్యాఖ్యలపై చాలా మంది పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఓటీటీ వచ్చాక డిజిటల్ రైట్స్ ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుందనే ఉద్దేశ్యంతో నెల రోజుల్లోనే డిజిటల్ రిలీజ్ కి సినిమాకి రెడీ చేస్తున్నారు.

దీంతో కొన్ని సినిమా పర్వాలేదనే టాక్ తెచ్చికొని కూడా కమర్షియల్ గా డిజాస్టర్ అవుతున్నాయి. అయితే ఈ డిజిటల్ రిలీజ్ విషయంలో మార్పులు చేయాలని థియేటర్స్ అసోసియేషన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే నిర్మాతలు ఇప్పటి వరకు డిజిటల్ రిలీజ్ విషయంలో ఎలాంటి ఆంక్షలు పెట్టినట్లు కనిపించలేదు.

సలార్, గుంటూరు కారం, టిల్లు స్క్వేర్, ది ఫ్యామిలీ స్టార్ సినిమాలు చాలా ఎర్లీగా ఓటీటీలోకి వచ్చేశాయి. తాజాగా రిలీజ్ అయిన కల్కి మూవీ మాత్రం సుమారు 50 రోజుల తర్వాతనే ఓటీటీలోకి రాబోతోంది. మూవీ లాంగ్ రన్ థియేటర్స్ లో కొనసాగడం వలన భారీ కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో హిందీ సినిమాల రిలీజ్ విషయంలో నిబంధనలు కఠినతరం చేశారు.

ఏ సినిమా అయిన 50 రోజుల తర్వాతనే ఓటీటీలో రిలీజ్ చేయాలని అక్కడ మల్టీప్లెక్స్ ఓనర్స్ కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్స్ కి ఒప్పుకోని వారు డైరెక్ట్ గా ఓటీటీలో తమ సినిమాలు రిలీజ్ చేసుకుంటున్నారు. మలయాళం, తమిళ్ ఇండస్ట్రీలలో కూడా సినిమాలు ఓటీటీ రిలీజ్ విషయంలో కొత్తగా నిబంధనలు తీసుకొచ్చారు. ఇప్పుడు తెలుగులో కూడా ఆ దిశగా అడుగులు పడుతున్నాయనే మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News