500 కోట్ల క్లబ్‌లో మేమూ ఉన్నాం.. హిందీ నిర్మాత ఫికర్
అయితే స్కై ఫోర్స్ రిలీజ్ ప్రచారంలో ఉన్న దినేష్ విజన్ నాగవంశీ కామెంట్ పై స్పందించారు.
ఈరోజుల్లో 500 కోట్ల క్లబ్.. 1000 కోట్ల క్లబ్ అంటే కేవలం తెలుగు సినిమాలతోనే సాధ్యమవుతోందనే భావన సినీవర్గాల్లోను చాలా మందిలో ఉంది. కానీ హిందీ పరిశ్రమ పెద్దలు దీనిని ఇంకా అంగీకరించలేని పరిస్థితి. మేము కూడా రేసులో ఉన్నామని చెప్పుకోవాల్సిన సన్నివేశం ఉంది. కరోనా తర్వాత బాలీవుడ్ పుంజుకున్నా ఇంకా పెద్ద హీరోలు ఫుల్ ఫామ్ లోకి రాకపోవడంతో సందిగ్ధత అలానే కొనసాగుతోంది.
ఇదే సమయంలో బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ డిబేట్ అంతకంతకు వేడి పెంచుతోంది. ఇటీవల ఉత్తరాది, దక్షిణాది నిర్మాతల సమావేశంలో తెలుగు నిర్మాత నాగవంశీ కామెంట్లు ఉత్తరాది వారిని మరిగించాయి. ఆర్‌ఆర్‌ఆర్, బాహుబలి వంటి దక్షిణ భారత బ్లాక్‌బస్టర్‌లు విజయం సాధించే వరకు బాలీవుడ్ బాంద్రా - జుహూ చిత్రాలను నిర్మించడంలో చిక్కుకుపోయిందని, ఈమధ్యనే హిందీలోను కథలు మారాయని ప్యానెల్ చర్చలో నాగ వంశీ పేర్కొన్న తర్వాత అది హిందీ ఫిలింమేకర్స్ లో చర్చగా మారింది. నిర్మాత బోనీ కపూర్ తో సరదా సంభాషణల గురించి ఆ తర్వాత నాగవంశీ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎంతో ఆరోగ్యకరమైన సమావేశమిదని, తమ మధ్య మంచి డిబేట్ కొనసాగిందని నాగవంశీ అన్నారు.
అయితే స్కై ఫోర్స్ రిలీజ్ ప్రచారంలో ఉన్న దినేష్ విజన్ నాగవంశీ కామెంట్ పై స్పందించారు. స్కైఫోర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో హిందీ చిత్రాల బాక్సాఫీస్ ఘనతను హైలైట్ చేస్తూ, భారతీయ సినిమా సాధించిన సామూహిక విజయాలపై దృష్టి సారించేలా మరింత ఏకీకృత దృక్పథం కావాలని దినేష్ విజన్ పిలుపునిచ్చారు. దినేష్ విజన్ ప్రాంతీయ తత్వంతో ఏకీభవించలేదు. ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల రూపాయలను అధిగమించిన ఐదు హిందీ చిత్రాల విజయాన్ని ఉటంకిస్తూ, మహమ్మారి తర్వాత హిందీ సినిమా కూడా గొప్ప మైలురాళ్లను సాధించిందని ధృవీకరించారు.
హిందీ సినిమా ప్రపంచవ్యాప్తంగా బలమైన స్థానాన్ని కలిగి ఉంది. మహమ్మారి తర్వాత 500 కోట్లు అధిగమించిన హిందీ చిత్రాలు ఉన్నాయి. బహుశా మేం వాటి గురించి ఎక్కువగా మాట్లాడుకోకపోవచ్చు.. కానీ మనమూ రేసులో ముందున్నాం! అని దినేష్ విజన్ వ్యాఖ్యానించాడు.
నేను దక్షిణాదికి వెళ్లినప్పుడల్లా మీరంతా చాలా ప్రోత్సహించారు. ఇరు పరిశ్రమల్ని మనం భారతీయ చలనచిత్ర పరిశ్రమగా చూడటం ప్రారంభిస్తే రూ. 500 కోట్లు + రూ. 800 కోట్లు అంటే రూ. 1,300 కోట్ల వరకూ సాధిస్తామని దినేష్ విజన్ అన్నారు. మనం కలిసికట్టుగా ఎందుకు లక్ష్యం పెట్టుకోకూడదు? అని దినేష్ విజన్ ప్రశ్నించారు. అక్షయ్ కుమార్ నటించిన స్కైఫోర్స్ 24 జనవరి 2025న విడుదల కానుంది. ఈ చిత్రంలో అక్షయ్‌తో పాటు సారా అలీ ఖాన్, నిమ్రత్ కౌర్, వీర్ పహారియా నటించారు.